బాబు@ ‘సీబీఎన్‌’ చానల్‌

28 Mar, 2019 07:48 IST|Sakshi

ఎన్నికల సిత్రం

‘ఈ’పేపర్‌ని, ‘ఆ’ పేపర్‌ని చింపి పడేశాడు చంద్రబాబు! పార్టీ కార్యకర్తల ప్రాడక్ట్‌ మీద ఎప్పుడూ ఆయన అంత కోపం ప్రదర్శించలేదు. ‘‘చెత్తగాళ్లు, చెత్త న్యూస్‌’’ అన్నాడు. చుట్టూ ఆయన పెట్టుకున్న స్టార్‌ క్యాంపెయినర్లు ఉన్నారు.  
‘‘నిన్నంతా మీరేమీ పీకలేదా?’’ అన్నాడు చంద్రబాబు.  
‘‘పీకాము నాయుడుగారూ.. వాళ్లే, మేము పీకిందేమీ రాయలేదు’’ అన్నారు. 
చంద్రబాబు మండిపడ్డాడు. ‘‘జగన్‌ ఇలా అన్నాడు. జగన్‌ అలా అన్నాడు. కేసీఆర్‌తో సెల్ఫీ దిగాడు. కేటీఆర్‌తో కుల్ఫీ తిన్నాడు.. ఇదా న్యూస్‌! జనాన్ని జగన్‌కి దూరం చేసే న్యూస్‌ రాయమంటే జగన్‌కి మనవాళ్లను కూడా దగ్గర చేసే న్యూస్‌ రాస్తున్నారు’’ అన్నాడు.  
స్టార్‌ క్యాంపెయినర్‌ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఒక కన్ను మూసి, పళ్లు పటపటలాడించాడు.  
‘‘ఏంటా ఎక్స్‌ప్రెషన్‌?’’ అన్నాడు చంద్రబాబు.  
‘‘మీ మీద కాదు. వాళ్ల మీద’’ అన్నాడు. 
‘‘వాళ్ల మీద అంటే.. వేళ్ల మీద? అన్నాడు చంద్రబాబు చికాగ్గా.  
‘‘అదేనండీ నాయుడుగారూ.. మన రెండు పేపర్‌ల మీద! మన పేపర్‌లు అయివుండి, పొద్దస్తమానం జగన్‌.. జగన్‌.. అంటాయేంటీ! ఆయనెరూ.. పీయుష్‌ గోయెల్‌. ఈ మధ్య ఆయన హైదరాబాద్‌లో ఏదో హోటల్‌లో దిగాడంట. ‘జగన్‌ నా ఫ్రెండు’ అన్నాడంట.
పీయుష్‌కి జగన్‌ ఫ్రెండయితే జగన్‌కి వచ్చే నష్టం ఏంటి, మనకొచ్చే లాభం ఏంటి? అది రాసుకొచ్చాడు రాధాకృష్ణ! వేస్ట్‌ ఎనాలిసిస్‌. పీయుష్‌ గోయెల్‌ కేంద్ర మంత్రి అని వర్ల రామయ్య చెప్పే దాకా నాకే తెలీదు. జనానికేం తెలుస్తుంది’’ అన్నాడు రాజేంద్రప్రసాద్‌.  నిజమేనన్నట్లు చూశాడు వర్ల రామయ్య.  
‘‘ఆ పీకే గురించి ఎందుకు రాస్తున్నారో తెలియడం లేదు. పీకే అంటే జనం పవన్‌కళ్యాణ్‌ అనుకుంటారు కానీ, ప్రశాంత్‌ కిశోర్‌ అనుకుంటారా! జగన్‌కి పీకే ఐడియాలు ఇస్తున్నాడని రాస్తే, పవన్‌ జగన్‌కి సపోర్ట్‌ చేస్తున్నాడని జనం జగన్‌కి ఓటేసే ప్రమాదం ఉంది.
ఆ ప్రశాంత్‌ కిశోర్‌ జగన్‌ అడ్వయిజర్‌ అని రాజేంద్రప్రసాద్‌ చెప్పేవరకు నాకూ తెలీదు.’’ అన్నాడు వర్ల రామయ్య.  విసుగ్గా చూశాడు చంద్రబాబు. ‘‘మీకు మీరు చెప్పుకోవడం మానేసి, నాక్కూడా చెబుతుండండి’’ అన్నాడు.  
‘‘మీక్కూడా చెప్పాం నాయుడుగారూ’’ అన్నారు రాజేంద్రప్రసాద్, వర్ల రామయ్య.  
‘ఏం చెప్పారు?’ అన్నాడు బాబు కళ్లద్దాల లోపల్నుంచి చూస్తూ.  
‘‘మనమూ ఒక సీబీఎన్‌ చానల్, మనమూ ఒక ‘సీ’టీవీ పెట్టుకుందాం అని చెప్పాం. మీరు వినలేదు. ‘ఈ’ పేపర్, ‘ఆ’ పేపర్‌ మనవే కదా. మళ్లీ మనకో పేపర్, మనకో చానల్‌ ఎందుకు.. డబ్బులు దండగ అనేశారు’’ అన్నారు స్టార్‌ క్యాంపెయినర్‌లు.  
‘అవునా..’ అన్నట్లు చూశాడు చంద్రబాబు. ‘ఈ’ పేపర్‌కి, ‘ఆ’ పేపర్‌కీ లైన్‌ కలపమన్నాడు. కలిపారు. మాట్లాడి పెట్టేశాడు చంద్రబాబు.  
‘‘ఏమంటున్నారు సార్‌.. ’’ అడిగారు స్టార్‌ క్యాంపెయినర్‌లు.  
‘‘రోజూ మీరు పీకిందేనా.. మేం పీకిందీ రాసుకోవాలి కదా’’ అంటున్నారు.. అన్నాడు చంద్రబాబు.  రాజేంద్రప్రసాద్‌ మళ్లీ ఒక కన్ను మూసి, పళ్లు పటపటలాడించాడు. 
– మాధవ్‌  

మరిన్ని వార్తలు