యూపీలో పార్టీల బలాబలాలు

24 May, 2019 16:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లే కాకుండా ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయన్నది కూడా ముఖ్యమైనదే. రాష్ట్రంలో మొత్తం 80 సీట్లుండగా, బీజేపీ తన మిత్రపక్షమైన అప్నాదళ్‌కు రెండు సీట్లను వదిలేసి మొత్తం 78 సీట్లకు పోటీ చేసింది. అలాగే ఎస్పీ, బీఎస్పీ కూటమి రెండు సీట్లను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలకు వదిలేసి 78 సీట్లకు పోటీ చేసింది. పోటీ చేసిన 78 సీట్లకుగాను బీజేపీ 62 సీట్లను గెలుచుకోగా, దాని మిత్ర పక్షమైన అప్నాదళ్‌ రెండు సీట్లను గెలుచుకుంది. గత ఎన్నికల్లో బీజేపీకి 71 సీట్లు, అప్పాదళ్‌కు రెండు సీట్లు వచ్చాయి. 

ఈసారి అజిత్‌ సింగ్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌ను కలుపుకొని ఎస్పీ, బీఎస్పీ పార్టీలు మహా కూటమిగా పోటీ చేసినా పెద్దగా లాభం ఏమీ లేకపోయింది. ముజఫర్‌నగర్‌ నుంచి పోటీ చేసిన అజిత్‌ సింగ్‌ ఓడిపోగా, మిగతా సీట్లలో బీఎస్పీకి పది సీట్లు, ఎస్పీకి ఐదు సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఒక్క సోనియా గాంధీయే రాయ్‌బరేలి నుంచి విజయం సాధించారు. రాహుల్‌ గాంధీ పోటీ చేసిన అమేథి నియోజకవర్గంలో ఆయనపై కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి స్మతి ఇరానీ 55 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 

యూపీలో బీజేపీకి మొత్త 49.6 శాతం ఓట్లు రాగా, బీఎస్పీకీ 19.3 శాతం ఓట్లు, ఎస్పీకి 18 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీకి 6.3 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పార్టీ కూడా కూటమితో చేతులు కలిపి ఉన్నట్లయితే కాంగ్రెస్‌కు రెండు సీట్లు, కూటమికి మరో రెండు సీట్లు వచ్చేవి. హిందీ రాష్ట్రాల్లోనే బీజేపీకి అనూహ్య విజయం సిద్ధించింది. యూపీతోపాటు బీహార్, చత్తీస్‌గÉŠ , మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో మొత్తం 273 సీట్లు ఉండగా బీజీపీ, దాని మిత్రపక్షాలకు 243 సీట్లు వచ్చాయి. 

మరిన్ని వార్తలు