గులాబీ జెండా గెల్సుడు ఖాయమే

10 Apr, 2019 11:18 IST|Sakshi

బాతాఖానీ

‘ఏహే.. గిదేం ఇచిత్రం. గింతమంది గిట్ల ఒకలెన్క కొకలు కండువ మార్చ బట్టిరి. అద్దన్న సుత గులాబీ పార్టీల జేర బట్టిరి. గట్ల జట్టుకట్టినట్లు పార్టీల జేరుడు జూత్తే ఇక గా పతిపక్ష పార్టీలుండి ఎలచ్చన్ల పోటీ జేసేటోళ్లు దప్పా ఒక్కలు సుత మిగిలేటట్టు కనిపిత్త లేలు. గా సర్వేలు సుత టీఆరెస్సే గెలుత్తయని చెప్ప బట్టే. ఇగ తిరుగులేదు టీఆరెస్సుకు’ అనుకుంటా బాలమల్లు నడూళ్లున్న చింతచెట్టు కాడికచ్చిండు.
‘ఏందోయ్‌ బాలమల్లు.. గట్ల మస్తు ఉషారుగత్తన్నవేంద’ని చింతచెట్టు నీడల బండమీద కూసోనున్న ఓదెలు మెల్లగ పల్కరిచ్చిండు.

‘గిప్పట్ల ఎంపీ ఎలచ్చన్లు జర్గుతన్నయ్‌ గదా. ఎలచ్చన్ల రాట్టంలున్న పదేడు సీట్లకు పదారు టీఆరెస్సు, ఒకటేమో టీఆరెస్సు హిమ్మతిచ్చిన ఎంఐఎం పార్టీ గెల్సుకుంటయట. గట్ల ఒక్కసీటు సుత పతిపక్ష పార్టీకి రాదట. ఎమ్మెల్యే ఎలచ్చన్ల తీర్గనే ఎంపీ ఎలచ్చన్ల సుత గులాబీ పార్టీకి ఎదురే లేకుంటున్నదట. ఎవల్ని అడిగిన, ఏ టీవీ, ఏ పేపరోళ్లు సర్వే జేసిన గదే ముచ్చట జెప్తండ్ల’న్నడు బాలమల్లు.

‘గట్లనా. సీఎం కేసీయార్‌ సుత మీటింగ్లు బెట్టి చెప్తుంటే ఊరికే గట్ల చెప్తండనుకున్న. గిదంత నిజమేనన్న మాట. గట్లయితే పతిపక్ష పార్టీకి పుట్టగతులుండయ్‌ కద’ న్నడు ఓదెలు.
‘అవునోయ్‌ ఓదెలు. నీ ఎర్కకు నువ్వే జెప్పు. గీ ఎంపీ ఎలచ్చన్లు సురు గాంగనే సీఎం కేసీయార్‌ గా పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్‌ పెట్టి ఏం జెప్పిండు? టీఆరెస్సుకు తిరుగు లేదన్నడ లేదా. అన్నిచోట్ల ఎలచ్చన్ల గెల్సి గులాబీ జెండా ఎగురెయ్యాలని ఎమ్మెల్లేలకు ఎర్క జెప్పిండు గదా. గప్పటి నుంచే టీఆరెస్సుల చేరుడు సురైందనుకో’ అన్నడు బాలమల్లు.

‘అవుమల్ల. యాదికచ్చిందోయ్‌ బాలమల్లు. ముందుగాల్న కాంగ్రెసెమ్మెల్లేలు గులాబీ గూట్ల చేరుడు సురుజేసిండ్లు. ఆ నంక ఒకలెన్క ఒకలు గులాబీ కండ్వ కప్పుకోవడాన్కి పోటీ పడ్తండ్రనుకో. ఇప్పటికి సుత ఏ ఊళ్ల జూసిన గట్లనే ఉన్నద’న్నడు ఓదెలు.

‘అవుగని.. ఇంతకు ముందుగాల్న జర్గిన ఎమ్మెల్సీ ఎలచ్చన్ల సుత గట్లనే జర్గింది కదా. పోటీ పెట్టద్దని సీఎం కేసీయార్‌ చెప్పిన సుత కాంగ్రెసోళ్లు ఇనకపాయిరి. ఆఖర్కి ఏం జర్గింది, టీఆరెస్సోళ్లే గెలిసిండ్లు కదా’ అని గప్పటి నుంచి గాళ్లిద్దరి ముచ్చట్లినుకుంట ఓదెలు దాపుకు ఇంకో బండ మీద కూసోనున్న రామసామన్నడు.

‘గది సరేగని, ఢిల్లీల ఈసారి గద్దె ఎక్కెటోళ్లు ఎవరంటవ’ని అమాయకంగా అడిగిండు రామసామి.
‘ఇగో రామసామి. దునియా మొత్తం ఎట్లున్న మనరాట్టంలైతే టీఆరెస్సు గెలుసుడు ఖాయంగా కనిపిత్తంది. జెనాల్నీ ఎవల్నడిగిన సుత కారు గుర్తుంటండ్లు. ఇంకో ముచ్చట జెప్తలేలు. గట్ల పదేడు ఎంపీ సీట్లు గెల్సి ఢిల్లీల చక్రం తిప్పడాన్కి సీఎం కేసీయార్‌ ఫీలాన్ల మీదున్న’డన్నడు బాలమల్లు.

‘అగ్గో గట్లెట్ల్లయితది, పదేడు సీట్లు గెలిత్తెనె ఢిల్లీల రాజరికం ఏలుడైతద’ని ఎర్కడిగిండు ఓదెలు.
‘నీ అనుమానం నిజమేనోయ్‌ ఓదెలు. పదేడు మంది ఎంపీలను గెలిత్తే టీఆరెస్సు ఏం జెత్తదో ఇనుకోండ్లని పూస గుచ్చినట్లు ఎర్క జెప్పుక’చ్చిండు బాలమల్లు. ‘గిప్పుడు దునియలున్న ఏ పార్టీకి సుత మెజార్టీ ఎంపీ సీట్లు రావట. గీ ముచ్చట సర్వేలల్ల తేలిందట. గట్ల ఏ పార్టీకి మెజార్టీ రాకపోయే సరికి పాంతీయ పార్టీలన్ని కల్సి ఓ జట్టు కడ్తయట. గట్ల ఓ మంచి పార్టీ లీడర్నీ పెదానమంత్రిగా ఎన్నుకుంటరట. గది ముచ్చటన్న మాట’ అని అర్టిపండు తోలు ఒల్సి చేతిల పెట్టినట్లు ఇడమర్సి చెప్పిండు బాలమల్లు. 

‘గట్లైతే మంచిదే. మనకు మంచే జరుగుతది కద’ని రామసామి అనే సరికి, గంతట్లనే ఓదెలు కల్గజేస్కోని ‘ఏహే..కేసీయార్‌ మాటంటే మాటే. గందుకనే ఎక్కడ మీటింగులు పెట్టిన ఇస్కబోత్తే రాలనంత జనమత్తండ్ల’న్నడు ఓదెలు.‘మీలే జూత్తండ్లు గదా. కేసీయారు ఎక్కడ మీటింగు పెట్టిన జెనం లక్షలల్ల ఎగబడ్తండ్లనుకో’ అన్నడు రామసామి.

‘అవుమల్ల. ఎట్లైన పదేడు సీట్లు గెలుత్తం కాని గట్ల గెలుసుడు కాదు. ఒక్కో ఎంపీకి మూడు నాల్గు లచ్చలల్ల మెజార్టీ రావాల్ననీ కేసీయార్‌ కాలుకు బట్ట కట్టకుండా తిర్గుతండ’న్నడు ఓదెలు.
‘అరె.. మెజార్టీ రాకుంటేంజెత్తది జెప్పు. గెల్సేటోళ్లకే ఎంపీ టికెట్‌ ఇచ్చి నిలబెట్టిండు. మస్తు మెజార్టీతోని గెలిపియ్యనీకి మంత్రులు, ఎమ్మెల్సీలకు, పెద్ద లీడర్లకు పెద్దరికమిచ్చి గెలిపించే పనప్పగించిండు. ఇగ మీలన్నట్లు గులాబీ కండ్వ కప్పుకోనీకి గుంపుల కొద్ది ఎగబడ్తండ్లు. మొత్తానికైతే గులాబీ జెండా ఎగురుడు ఖాయ’మన్నడు బాలమల్లు.

‘అవుమల్ల. ఆంధ్రల జెగన్‌ పార్టీ, తెలంగాణల టీయారెస్సు రెండు పార్టీలు మస్తు ఎంపీ సీట్లు గెల్సుకుని రెండు రాట్టాలల్ల మంచి పనులు జేత్తమంటండ్లు. గంతమంచిగ ఇసారం జేసిన గా జెగన్‌ పార్టీకి మస్తు మెజార్టీచ్చి గెలిపియ్యాల్ననీ ఆంధ్రల మనకు ఎర్కున్నోళ్ళకు గట్టిగ ఎర్కజెప్దాం. ఇక్కడ  టీయారెస్సుని గెలి పించుకుందా’మని బాలమల్లు అనేసరికి, అందరూ ముచ్చట్లు బందుపెట్టి ఎవలిండ్లకాళ్లు ఎల్లిపోయిండ్లు.– గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి– వరంగల్‌

మరిన్ని వార్తలు