మా పార్టె లేదాయె.. నేనెవ్వలకు వోటెయ్యాలె?

30 Mar, 2019 11:47 IST|Sakshi

బాతాఖానీ

‘ఏవున్నదక్కో.. ఇల్లు సర్దుకున్న ఎల్లిపోతా వున్న.. ఈ వూల్లె నాకింక ఏవున్నదక్కో..’  అని రాగవెత్తుకొని పాడ్కుంటండు కట్టెమిషిని రంనయ్య. యెప్పుడో ముప్పయేల్ల కింద మేం బెట్టిన శివాజి యూతు క్లబ్బు తోటి గీ యెలశ్చన్ల యేమేం జెయ్యాల్నొ ఇచారించుకుందామని కమెటి మెంబర్లందరం కట్టెమిషిని కాడి యాపశెట్టు కాడికచ్చినం. గీడికి రాంగనె నవ్వారు మంచం మీద గూసొని రంనయ్య పాట పాడవట్టిండు.
మమ్ముల సూడంగనె ‘ఎట్టా బత్కుతు.. ఎల్లా బత్కు తు తెలంగాన జిల్లల్లోన’ అని మల్లో రాగం దీసిండు.

‘ఏందిరో రంనన్నా.. గిసొంటి పాటల్వాడుతన్నవ్‌. పోలిసోల్లు ఇంటె లోపలవెడ్తరు. అసలె కర్నారం జిల్ల’ యెచ్చరించినట్టె జెప్పిండు మా వూరి కవి నాగరాజు.
‘అయిన నీకేవైందయ్యో? రోడ్మీద కట్టెమిషినుంది. పిల్వంగనె అచ్చె పోరగండ్లున్నరు. పెద్దపెద్దోల్లు సుత నీ దగ్గర్కె అచ్చి మీటింగులు వెడ్తరు. నువ్వు దల్సుకుంటె యెమ్మెల్లె, యెంపీలు సుత ఈడి కెల్లె యెలశ్చన్లు నడిపిత్తరు... గివ్వన్నుండంగ అన్నల పాటలు పాడవడ్తివ’ని దెప్పి పొడిసిండు క్లబ్బు కమెటి మెంబర్‌ లచ్చన్న.

అందర్నోపారి జూసిన రంనయ్య.. ‘గిన్నేండ్ల సంది గీ వూల్లెనె ఉంటన్రు గద. మా తెల్దేశం పార్టి సింబల్లేకుండ ఎలశ్చన్లు జర్గినయా?’ అన్నడు కోపంగ.
‘వోహో.. నీ బాద గదానయో.. మీ తెల్దేశం పార్టిని కేసియారు పొలిమేర్లకు పంపిండు గద. గెల్వని శీటుకు కోట్లిచ్చుకుంట మూడేండ్ల కిందట రేవంతం దొర్కిన కాడికెల్లి పట్నమే ఇడిశిపెట్టి.. ‘గీవూల్లె నాకింగ ఏవున్నదక్కో..’ అనవట్టె. మొన్న అసంబ్లి ఎలశ్చన్ల తెలంగానల ఏవన్న చెయ్యాల్నని వుషారు లెక్కలు జేస్తే మల్లోసారి తర్మిగొట్టిరి..’ గప్పట్ల జర్గిన సంగతుల్ని పూసగుచ్చినట్లు జెప్పె రాగుల్దుబ్బల రమ్నారావు.

‘మా ప్రెశిడెంట్‌ ఏడికన్న పోనియ్యి. ఎలశ్చన్ల ఎవ్వల కోటెయ్యాలె? బ్యాలెట్‌ మీద సైకిలి గుర్తే లేకపాయె. అరె మనం పోటీ జేత్తలేం. మీరు గా పలానా పార్టికి ఓటెయ్యిర్రి అంటెనన్న యేత్తం. మొన్న అసంబ్లి ఎలశ్చన్ల కాంగిరెస్‌కు ఎయ్యిమంటె నేనైతె ఏశిన, గంతకు ముందు బార్తీయ జన్త పార్టి అంటె మా ఇంట్లున్న ఆరోట్లు అటె గుద్దితిమి. అంతకు ముందు కమ్మునిస్టులకు ఓటియ్యిమన్న ఏస్తిమి. మరి గిప్పుడు ఏంజెయ్యాల్లో జెప్పకపాయిరి. పోటీలో లేకపాయిరి..’ కడుపులున్నదంత గక్కిండు రంనయ్య.

‘గిదంత జూస్న రమ్నరావుకు తిక్కరేగింది. ‘అరె తీ.. నీ బాదేంది. గాడ ఆంద్రల్నె మీ శెంద్రాలుబాబుకు కుట్రలు, కుతంత్రాలు జెయ్యనీకే టైం లేదాయె. నల్లికుట్ల మాటలు మాట్లాడుకుంట తిర్గుతన్న సుత జనం నమ్ముతలేరాయె. ఇగ గీడికచ్చి, పోట్జేసి పొడిశేడ్దేవుంది? మొన్న అసంబ్లి ఎలశ్చన్ల ఏదో శేద్దావని తెలంగానల యేలు వెట్టి, కాంగిరేసును గుడ నాశినం జేసి పాయె. గిప్పుడు గా కాంగిరేసోల్లు సుత శెంద్రల్‌బాబంటె ఇషం పామును జూసినట్టు ఆమెడ దూరముర్కవట్టిరి. సైకిలి గుర్తం మ్మీద పోటి శేద్దామంటె లీడర్లు, క్యాడెర్‌ లేదాయె. గందుకె తెలంగానల వద్లేసుకున్నడు. ఇగ ఆంద్రల జగన్‌ గెలుత్తండని దెల్సి పిస్సపిస్స అయితండు. పవన కల్యానం, కేయేపాలు, మందలగిరి లోకేశెం తోటి కుట్రలు జేపిత్తండు. నువ్వేమొ ఇంక శెంద్రాలుబాబు అనవడ్తి’వని గురాయించి జూసిండు.

‘యేదొ యెన్టి రామరావు అప్పట్నుంచి తెల్దేశం జెండ కిందనె వుంటి. గిప్పుడు పాల్రమెంట్‌ ఎలశ్చన్ల అసల్కు పోటే శేత్తలేర నే సర్కి యెన్టి రామరావు పెట్టిన తెల్దేశం బత్కు ఎట్లయిపాయె అన్కొన్న. శెంద్రాలు యెన్టీయార్‌ను ఎన్కపోటు వొడ్చి జివునం లేకుంట జేస్న గుడ.. ఆయిన వెట్టిన పార్టి బతుకుందనుకున్నం. వోట్లకు నోట్ల కేస్ల మూడేండ్ల కిందటే అరస్టయితమని దెల్సి పెట్టబేడ సదుర్కపోయె. గిప్పుడు గాడ గుడ తెల్దేశం దుక్నం బంజేస్తడంటన్రు.. నోట్లె నోట్లెనె అనుకుంట..’ బయిటికననే అందర్కి ఇనబడెటట్లు అన్నడు రంనయ్య.

‘ఉట్టిగ మాటల్తోటి టయం వేస్టు జెయ్యకుండ ఇగ గా యూతు క్లబ్బు మీటింగేదొ మొదలువెట్టున్రి..’ అన్నడు సైకిల్‌ స్టాండు రవి.యాబైల వడుతున్న యూతు మెంబెర్లవంత మినెట్‌ బుక్సుతోటి యాప శెట్టుకిందికి పోయినం.– పోలంపల్లి ఆంజనేయులు,సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌

మరిన్ని వార్తలు