టీమిండియా కాషాయ జెర్సీ వెనుక బీజేపీ?

27 Jun, 2019 08:50 IST|Sakshi
అబు అజ్మీ.. టీమిండియా క్రికెటర్లు ధరించనున్న ఆరెంజ్‌ జెర్సీ

న్యూఢిల్లీ/ముంబై: వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా ఆరెంజ్‌ (కాషాయ) రంగు జెర్సీలను ధరించనుంది. అయితే టీమిండియా ఆరెంజ్‌ జెర్సీ ధరించడం వెనుక మోదీ ప్రభుత్వ ఒత్తిడి ఉందని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఆరోపించాయి. ఆదివారం టీమిండియా ఇంగ్లాండ్‌తో తలపడనున్న మ్యాచ్‌లో ఆరెంజ్‌ జెర్సీలను ధరించనుంది. కనీసం రెండు రంగుల జెర్సీలను తమ వెంట తెచ్చుకోవాలని ఐసీసీ అన్ని దేశాలను కోరింది. అందులో భాగంగానే టీమిండియా రెండు జెర్సీలతో ఇంగ్లండ్‌ వెళ్లింది.

దేశం మొత్తాన్ని కాషాయికరణ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని మహారాష్ట్రకు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ ఆరోపించారు. అసెంబ్లీ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘క్రికెటర్లు ధరించే జెర్సీలకు ఆరెంజ్‌ రంగు పులుముతున్నారు. జాతీయ పతాకంలో మూడు వర్ణాలను నిర్ణయించిన వ్యక్తి ముస్లిం అని మోదీ గుర్తుపెట్టుకోవాలి. జెర్సీలకు మరో రంగు ఎంచుకోవాల్సి వస్తే త్రివర్ణాన్ని ఎంచుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ప్రతిదాన్ని కాషాయికరణ చేయాలకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పద’ని అబు అజ్మీ అన్నారు.

ఈ వాదనను బీజేపీ ఎమ్మెల్యే రామ్‌ కదమ్‌ వ్యతిరేకించారు. జెర్సీ రంగుపై రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాషాయ రంగును ఎందుకు అంతగా వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఆరెంజ్‌ జెర్సీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని శివసేన నేత, మహారాష్ట్ర మంత్రి గులాబ్‌రావ్‌ పాటిల్‌ అన్నారు. ఆటలకు, రాజకీయాలకు ముడి పెట్టడం సరికాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు