ద్రవిడ భాగ్య విధాత?

20 Mar, 2019 08:33 IST|Sakshi

డీఎంకే కాంగ్రెస్‌తో– అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు..

గెలుపుపై రెండు జట్ల ధీమా

కదనరంగం  తమిళనాడు

కిందటి పార్లమెంటు ఎన్నికల్లో పాలకపక్షం ఏఐఏడీఎంకే పొత్తుల్లేకుండా 37 సీట్లు కైవసంచేసుకుని తమిళనాట సంచలనం సృష్టించింది. అప్పుడు పార్టీ నాయకురాలు, ముఖ్యమంత్రి జయలలిత రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధిస్తే ప్రధాని కావచ్చనే ఆశతో ఇంతటి ఘనవిజయం సాధించగలిగారు. లోక్‌సభలో ఏ పార్టీకి మెజారిటీ రాదనే అంచనాతో ఆమె దేనితో పొత్తు లేకుండా నూరు శాతం విజయానికి గట్టి వ్యూహాలు అమలు చేసి సఫలమయ్యారు. 2014 ఎన్నికల్లో ‘మోదీకా లేక లేడీకా’ ఓటు అంటూ అన్నాడీఎంకే కొత్త నినాదం ఇచ్చింది. కశ్మీర్‌ నుంచి కర్ణాటక వరకూ ప్రజలను కుదిపేసిన మోదీ గాలి తమిళనాట పనిచేయలేదు. బీజేపీకి ఒకే సీటు దక్కింది. ప్రధాన ప్రాంతీయ పక్షాలైన ఏఐడీఎంకే, డీఎంకేలు రెండూ మొదటిసారిఏ జాతీయపక్షంతో పొత్తు లేకుండా ఆ ఎన్నికల్లో పోటీచేశాయి.

రెండేళ్లలో జయలలిత, డీఎంకే నేత ఎం.కరుణానిధి మరణించాక రాష్ట్ర రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. జనాకర్షణ  శక్తిæ ఉన్న నాయకురాలు జయ లేకపోవడంతో బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని అన్నాడీఎంకే నాయకత్వం నిర్ణయించింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే కాంగ్రెస్‌తో చేతులు కలిపి డీఎంకే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తోంది. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు కేటాయించి డీఎంకే నష్టపోయింది. కానీ, తండ్రి కరుణ లేని ఈ ఎన్నికల్లో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఒంటరిగా పోటీచేసే సాహసం చేయడం లేదు. అంతేకాదు, కాంగ్రెస్‌కు 9 సీట్లు కేటాయించారు. ఇంకా ముందుకెళ్లి బీజేపీయేతర కూటమికి మెజారిటీ సీట్లు దక్కితే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీయే ప్రధాని అని స్టాలిన్‌ పదేపదే చెబుతున్నారు. ఇలా అగ్రనేతల మరణంతో రెండు ముఖ్య ద్రవిడ పక్షాలు రెండు జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోక తప్పలేదు.

కాంగ్రెస్, బీజేపీతో రెండు పార్టీలూ జట్టు..
1967 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ, సీపీఎం సహా నాలుగు చిన్న జాతీయ పక్షాలతో కలిసి పోటీచేసిన డీఎంకే సొంతంగా మెజారిటీ సాధించి మొదటిసారి అధికారంలోకి వచ్చింది. తర్వాత 1971 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో డీఎంకే తొలిసారి పొత్తుపెట్టుకుని విజయం సాధించింది. 1977 లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీతో డీఎంకే చేతులు కలపగా, కాంగ్రెస్‌తో ఎంజీఆర్‌ నేతృత్వంలోని అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. 1980 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో డీఎంకే చేతులు కలిపింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో పాలకపక్షమైన అన్నాడీఎంకేతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుని విజయం సాధించింది. ఇలా రెండు ద్రవిడ ప్రాంతీయపక్షాలతో కాంగ్రెస్‌ సహా ఇతర చిన్న జాతీయపక్షాలు కలిసి పోటీ చేయడం ఆనవాయితీగా మారింది. 1990ల్లోనూ ఇదే పద్ధతి కొనసాగింది. 1980 తర్వాత కాంగ్రెస్‌ మళ్లీ డీఎంకేతో పొత్తుపెట్టుకున్నది 2004 లోక్‌సభ ఎన్నికల్లోనే. 1998 ఎన్నికల్లో ఏఐఏడీఎంకే మొదటిసారి బీజేపీతో పొత్తు పెట్టుకోగా, కాంగ్రెస్‌ ఈ రెండు ద్రవిడ పార్టీలతో సంబంధం లేకుండా ఒంటరి పోరాటం చేసింది. 1999లో వాజ్‌పేయి సర్కారుకు ఏఐఏడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మొదటిసారి బీజేపీతో డీఎంకే చేతులు కలిపింది. తర్వాత 2004లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని డీఎంకే లబ్ధిపొందింది. 2009లోనూ అత్యధిక సీట్లు సాధించింది. పదేళ్ల యూపీఏ భాగస్వామిగా కొనసాగింది. కానీ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు డీఎంకే, ఏఐడీఎంకేలతో పొత్తు లేకుండా పోటీ చేయడం విశేషం. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకే 44.3 శాతం ఓట్లతో 37 సీట్లు కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది.

గెలుపుపై ఎవరి లెక్కలు వారివే..
కిందటి లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీలకు లభించిన ఓట్లను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడిపే పాలకపక్షాలపై జనంలో వ్యతిరేకత ఎంత మేరకు ఉందన్న దానిపైనే అన్నా డీఎంకే కూటమి విజయం ఆధారపడి ఉంది. అన్నాడీఎంకే నుంచి చీలిన టీటీవీ దినకరన్‌ పార్టీ ఏఎంఎంకే ఈ ఎన్నికల్లో పెద్దగా ఓట్లు చీల్చుకోకపోతే ఈ కూటమికే ఎక్కువ ప్రయోజనకరమని అంచనా. సినీ నటుడు విజయకాంత్‌ నాయకత్వంలోని డీఎండీకే వల్ల ఈ కూటమికి ఎంత లాభమో చెప్పడం కష్టం. జయలలిత మరణానంతరం ఆమె సన్నిహితురాలు వీకే శశికళ జైలుకెళ్లాక ఆమె చేతుల నుంచి పాలకపక్షాన్ని బయటకు తీసుకురావడంలో బీజేపీ కీలకపాత్ర పోషించింది. అన్నాడీఎంకేలోని ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి, డిప్యూటీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం ఏకం కావడానికి కూడా కేంద్ర సర్కారే కారణం. ఈ నేపథ్యంలో పాలకపక్షంతో కుదిరిన పొత్తు బీజేపీ సీట్లు పెరగడానికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. 2014లో ఏడు సీట్లకు పోటీచేసిన బీజేపీ ఈసారి ఐదు సీట్లకే పోటీచేస్తోంది. తమిళనాడులో ప్రధాని మోదీ కన్నా రాహుల్‌గాంధీకే ఎక్కువ జనాదరణ ఉందని ఇటీవల సర్వేలు చెబుతున్నాయి. అలాగే స్టాలిన్‌ నాయకత్వంలో డీఎంకేకు కూడా ప్రజా మద్దతు గతంలో కంటే పెరిగింది. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలోని ఏఐడీఎంకే సర్కార్ల పాలనపై తమిళ ప్రజలు అసంతృప్తితో ఉంటే డీఎంకే–కాంగ్రెస్‌ కూటమి అత్యధిక సీట్లు గెలుచుకునే అవకాశాలుంటాయి. ఓటరు తీర్పు ఎటు మొగ్గు చూపుతుందో చూడాల్సిందే.

ఎంకే స్టాలిన్‌: కార్యకర్తల ఆశలు..
డీఎంకే నేత, మాజీ సీఎం ఎం.కరుణానిధి కుమారుడు, రాజకీయ వారసుడైన స్టాలిన్‌ది 20 ఏళ్ల వయసు నుంచే డీఎంకేలో చురుకైన పాత్ర. 14 ఏళ్ల కుర్రాడిగా 1967 ఎన్నికల్లో డీఎంకే తరఫున ఆయన ప్రచారం చేశారు. 1984లో అసెంబ్లీకి మొదటిసారి పోటీచేసి ఓడిపోయినా 1989లో గెలుపొందారు. మద్రాసు నగర మేయర్‌గా ఎన్నికై పేరు సంపాదించారు. డీఎంకే నాయకులు, కార్యకర్తల్లో పట్టు సంపాదించారు. మదురైలో స్థిరపడిన ఆయన ఎంకే అళగిరితో పోలిస్తే సౌమ్యుడు. కిందటి ఆగస్ట్‌లో తండ్రి మరణం తర్వాత డీఎంకే అధ్యక్షునిగా స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికకావడానికి కారణం ఆయన సామర్థ్యంపై కార్యకర్తలకు ఉన్న విశ్వాసమే.

పళనిస్వామి: ప్రభావం ఎంత?
ఏఐడీఎంకే ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి రెండేళ్ల క్రితం పదవి చేపట్టారు. జయలలిత తర్వాత సీఎం పదవి చేపట్టిన పన్నీర్‌సెల్వం 72 రోజులకు రాజీనామా చేశాక పళనిస్వామికి అవకాశం లభించింది. రాష్ట్రంలో ప్రధాన బీసీ కులాల్లో ఒకటైన గౌండర్‌ వర్గానికి చెందిన పళనిస్వామికి ఇంకా పాలనపై పట్టు చిక్కలేదు. కేంద్ర సర్కారు కనుసన్నల్లో నడుస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. శశికళ మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు బలమైన వర్గం లేదు. ఈ ఎన్నికల్లో వ్యక్తిగతంగా ఆయన జనంపై పెద్దగా ప్రభావం చూపించే స్థితిలో లేరు.

పన్నీర్‌సెల్వం: పట్టు అంతంతే..
జయలలితకు గతంలో న్యాయపరమైన చిక్కులు ఎదురైనప్పుడు, జైలుకెళ్లే పరిస్థితి ఏర్పడినప్పుడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ద్వారా వార్లల్లోకి ఎక్కిన నేత ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌). శశికళ సామాజికవర్గానికే (తేవర్‌) చెందిన ఈయన జయలలితకు అత్యంత విధేయుడని పేరు. మూడు వేర్వేరు సందర్భాల్లో మొత్తం 15 నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఈయనకు పార్టీపై పెద్దగా పట్టులేదు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే సత్తా ఉన్నట్టు ఇంత వరకు నిరూపించుకోలేదు.

డీఎంకే కూటమి
కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం,ముస్లింలీగ్‌ సహా 9 పార్టీలు.

ఏఐడీఎంకే కూటమి
బీజేపీ, డీఎండీకే, పీఎంకే,మరికొన్ని చిన్న పార్టీలు.

లోక్‌సభలో తమిళ పార్టీల బలాబలాలు
37ఏఐఏడీఎంకే
01పీఎంకే
01బీజేపీ

మరిన్ని వార్తలు