గాడిదలపై పాక్‌ పార్టీల దాడులు

21 Jul, 2018 18:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జూలై 17వ తేదీ, కరాచీ నగరంలో గుర్తుతెలియని దుండగులు ఓ గాడిదను చిత్ర హింసలకు గురిచేశారు. ఇష్టమొచ్చినట్లు ముష్ఠి ఘాతాలు తగిలించారు. ముక్కు రంధ్రాలను గట్టిగా చిదిమారు. పక్క టెముకలు విరిగేలా తన్నారు. కన్ను కింద రక్తం కారేలా గీరారు. దాని శరీరంపై ‘నవాజ్‌’ అని అక్షరాలు రాసివెళ్లారు. రోడ్డుపక్కన పడిపోయి ఆ గాడిద బాధను భరించలేక మెలితిరిగి పోతుంటే చూసిన ఓ బాటసారి దాన్ని ఎలాగైనా ఆదుకోవాలనుకున్నారు. ఎలా ఆదుకోవాలో తెలియలేదు. దాన్ని ఫొటోలుతీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసి చేతనైన వాళ్లు ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తికి స్పందించి.. ‘అయేషా చుండ్రిగర్‌ ఫౌండేషన్‌ (ఏసీఎఫ్‌)’ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ కార్యకర్తలు ఆ గాడిదను వెటర్నరీ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లి వైద్య చికిత్స చేయించారు. కాస్త కోలుకున్నప్పటికీ ఇప్పటికీ అది నిలబడలేక, నడవలేక పోతోంది.

ఈ నెల 25వ తేదీన జరగనున్న పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ ఎన్నికలకు ఈ గాడిదకు ప్రత్యక్ష సంబంధం ఉంది. దేశ ప్రధాని పదవి కోసం ఉవ్విళ్లూరుతున్న ఇమ్రాన్‌ ఖాన్, తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన నవాజ్‌ షరీఫ్‌ మద్దతుదారులను ఏమీ తెలియని గాడిదలని, మూర్ఖులని, వెదవలని తిట్టారు. అంతే, ఆ రోజు నుంచి గాడిదల మీద దాడులు జరుగుతున్నాయి. ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పార్టీ ‘తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌’ కార్యకర్తలు ఈ దాడులకు పాల్పడుతున్నారని నవాజ్‌ షరీఫ్‌కు చెందిన ‘పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్‌)’ పార్టీ కార్యకర్తలు ఆరోపించగా, తమకు ఈ దాడులతో సంబంధం లేదని, సానుభూతి కోసం నవాజ్‌ షరీఫ్‌ కార్యకర్తలే ఈ దాడులు జరిపి తమ మీద ఆరోపణలు చేస్తున్నారని ఖాన్‌ కార్యకర్తలు వాదిస్తున్నారు. తాము దాడులు చేస్తే గాడిదపై ‘నవాజ్‌’ అని పేరు కూడా ఎందుకు రాస్తామని షరీఫ్‌ పార్టీ కార్యకర్తలు వాదిస్తున్నారు. అందులోనే సానుభూతి ఉందని అవతలి వారంటున్నారు. ఇందులో ఏ పార్టీ వారు ఒకరికొకరు తీసిపోరు. గాడిదలపై దాడులు చేసే మూర్ఖత్వం వారిది.

ఈ నెల 25వ తేదీన నాలుగు ప్రాంతీయ అసెంబ్లీ స్థానాలతోపాటు జాతీయ అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో నవాజ్‌ షరీఫ్, ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీల మధ్యనే పోటీ ఎక్కువగా ఉంది. బిల్వాల్‌ భుట్టో నాయకత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీకి ప్రజల మద్దతు అంతగా కనిపించడం లేదు. నవాజ్‌ షరీఫ్‌ పార్టీయే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలు తెలియజేస్తుండగా, అవినీతి కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న నవాజ్‌ షరీఫ్‌కు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ, సైన్యం కుట్ర పన్నుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘మొహమ్మద్‌ అలీ జిన్నా’ వారసులం తామంటే, ‘అల్లమా ఇక్బాల్‌’ వారసులమని తామని, అక్బర్‌ వారసులమంటే తాము బాబర్‌ వారసులమంటూ ఇరు పార్టీల వారు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. వారు ఎవరి వారసులైనా ప్రజల వారసత్వం మాత్రం వారికి అసలే లేదు.

వాస్తవానికి ఇరు పార్టీల వారికి ప్రజలంటే ప్రేమగానీ, ఓటర్లంటే గౌరవంగానీ బొత్తిగా లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం వారి హక్కనుకుంటారు. గెలిపించడం ప్రజల ఖర్మ అంటారు. గెలిస్తే ప్రధాని పదవిలో వెలగబెడతాం అంటారు. ఓడిపోతే ఏ సౌదీ అరేబియాకో, మరో దేశానికి వెళ్లి వచ్చే ఎన్నికలకు వస్తామంటారు. వారు ప్రజలను నిజంగా గాడిదలనుకుంటారు. అలాగే చూస్తారు. 2009లో తాలిబన్లు ఓ గాడిదకు పేలుడు పదార్థాలు కట్టి అఫ్ఘానిస్థాన్‌లోని సైనిక శిబిరంలోకి పంపించారు. ఆ పేలుడులో ఆ గాడిద వెంటనే చచ్చి పోయింది. అంతటి భాగ్యం కూడా పాకిస్థాన్‌ గాడిదలకు లేదు.
(పాక్‌ ఎన్నికలపై లాహోర్‌ మానవ హక్కుల కార్యకర్త రిమ్మెల్‌ మొహిద్దిన్‌ అభిప్రాలకు అక్షరరూపం)

మరిన్ని వార్తలు