తూత్తుకుడి హింస.. రాజకీయ దుమారం

22 May, 2018 19:06 IST|Sakshi
స్టెరిలైట్‌ కాపర్‌ ఫ్యాక్టరీ వద్ద దృశ్యాలు.. ఇన్‌సెట్‌లో కమల్‌, మంత్రి జయకుమార్‌, స్టాలిన్‌లు

సాక్షి, చెన్నై: తూత్తుకుడి స్టెరిలైట్‌ ఫ్యాక్టరీ మూసివేత ఆందోళనల అంశం రాజకీయ మలుపు తీసుకుంది. మంగళవారం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఆంక్షలు విధించి రెచ్చగొట్టారని, పైగా వారిపై అమానుషంగా పొట్టనబెట్టుకున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే పరిస్థితి అదుపు తప్పటంతోనే పోలీసులు కాల్పులు చేపట్టినట్లు మంత్రి జయకుమార్‌ వెల్లడించారు. మృతులకు నష్టపరిహారం అందిస్తామన్న ఆయన ప్రకటనపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. 

డీఎంకే అధినేత స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ...‘ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాల్సిందిపోయి.. ఈ ప్రభుత్వం వారి ప్రాణాలను బలిగొంది. అవినీతిని ప్రొత్సహించటం కాదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ ఫ్యాక్టరీ మూత పడాల్సిందే. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. తూత్తుకుడి పరిస్థితుల నేపథ్యంలో రేపు కర్ణాటకలో జరగబోయే కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి స్టాలిన్‌ హాజరు కావటం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు కీలక నేతలతో స్టాలిన్‌ తూత్తుకుడిలో పర్యటించే అవకాశం ఉంది.

మరోవైపు ఈ పరిణామాలపై నటుడు, మక్కళ్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ కూడా స్పందించారు. ‘పౌరుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయింది. వాళ్లేం నేరగాళ్లు కాదు. ప్రజా హక్కులను కాపాడాల్సింది పోయి పొట్టనబెట్టుకుంది. జంతువులను కాల్చి చంపినట్లు చంపారు.  శాంతియుత ఆందోళనను హింసాత్మకంగా మార్చింది ప్రభుత్వమే. ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రేపు తూత్తుకుడికి వెళ్తాను. తక్షణమే ఫ్యాక్టరీని మూసేయాలి’ ఆయన డిమాండ్‌ చేశారు.

వివాదం... 1996లో స్టెరిలైట్‌ ఫ్యాక్టరీని స్థాపించారు. ఏడాదికి 4 లక్షల మెట్రిక్‌ టన్నుల కాపర్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ఈ ఫ్యాక్టరీ మాత్రం రెట్టింపు ఉత్పత్తి చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. 2013 మార్చిలో వేలాది మంది ప్రజలు ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడ్డ కాలుష్యాలు భూగర్భ జలాలను కలుషితం చేయటం, విషపూరిత వాయువుల కారణంగా గొంతు ఇన్‌ఫెక్షన్‌, శ్వాస సంబంధిత వ్యాధులతో వేలాది మంది ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. దీంతో ఫ్యాక్టరీని మూసేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే నేషన్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ ఆదేశాలతో తిరిగి ఫ్యాక్టరీ తెరుచుకుంది. అదే ఏడాది ఎడీఎంకే చీఫ్‌ వైకో సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేయగా, పర్యావరణానికి, ప్రజలకు చేసిన నష్టానికి 100 కోట్ల జరిమానా విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే యాజమాన్య సంస్థ వేదాంత గ్రూప్ మాత్రం ‘ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు ఎక్కడా ఉల్లంఘించటం లేదు’ అని వాదించి ఆ జరిమానా నుంచి తప్పించుకుంది. అంతేకాదు ఇప్పుడు ఫ్యాక్టరీ మూసివేత డిమాండ్‌ ఊపందుకున్న వేళ..  తమ ఫ్యాక్టరీ ద్వారా పరోక్షంగా 25 వేల మందికి, ప్రత్యక్షంగా 3 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు వాదిస్తోంది. అయితే స్థానిక ప్రజలు ఇది ప్రమాదకరమని, తక్షణమే మూసేసే దిశగా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. అయినా లాభం లేకుండా పోయింది. చివరకు లైసెన్స్‌ రెన్యువల్‌కు ఫ్యాక్టరీ యాజమాన్యం యత్నిస్తుందన్న వార్తలు బయటకు పొక్కటంతో ఈ ఆందోళనలు తీవ్ర తరం అయ్యాయి.

మరిన్ని వార్తలు