నేతలకు పట్టని ‘నేచర్‌’ సమస్యలు

25 Jun, 2019 18:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘50 లక్షల జనాభా కలిగిన మెట్రోపాలిటన్‌ నగరం చెన్నై తాగునీరు కోసం తల్లడిల్లుతోంది. బిహార్‌లో వీచిన వడగాడ్పులకు ఇప్పటివరకు 150 మంది మరణించారు. దక్షిణాఫ్రికాలో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐ గుప్తా ఇంట్లో ఇటీవల జరిగిన పెళ్ళిలో 4000 కిలోల చెత్త మహాకూడింది’ గత కొన్ని వారాల్లో చోటుచేసుకున్న ఈ పరిణామాలన్నీ పర్యావరణ సమస్యకు సంబంధించినవే. రానున్న రోజుల్లో దేశం ఎంతటి పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందో ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. అయినా ఇంతటి తీవ్రమైన అంశం ఎందుకు రాజకీయ నాయకులకు పట్టదో అర్థం కాదు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాకిస్థాన్‌ నుంచి పన్నుల వరకు పలు అంశాలు ప్రస్థావనకు వచ్చినప్పటికీ పర్యావరణ సమస్య మాత్రం పెద్దగా రాలేదు. ఏ ఎన్నికల సందర్భంగా కూడా ఈ సమస్యలు ప్రస్తావనకు రావు. క్యాన్సర్, టీబీ, ఎయిడ్స్, డయాబిటీస్‌ లాంటి రోగాలన్నింటి వల్ల చనిపోతున్న వారి కంటే వాయు కాలుష్యం వల్ల ఎక్కువ మంది మరణిస్తున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2020కల్లా దేశంలోని 21 నగరాల్లో భూగర్భ జలాలు ఇంకిపోతాయని ‘నీతి ఆయోగ్‌’ సంస్థ అంచనాలు. 2030 సంవత్సరం నాటికి దేశంలోని 40 శాతం నగరాలు మంచినీటికి కటకట లాడుతాయని అంచనాలు తెలియజేస్తున్నాయి. రానున్న ముప్పు నుంచి బయటపడాలంటే ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. తాత్కాలిక ప్రయోజనాలు, అవసరాల మీద రాజకీయ నాయకులకు అంతటి దూరదష్టి ఉండడం కష్టమే.

మరిన్ని వార్తలు