రాజకీయం క్రికెట్‌ లాంటిది.. ఏమైనా జరగొచ్చు..!

15 Nov, 2019 09:32 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తరుణంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయం క్రికెట్‌ ఆటాలాంటిదని.. ఎప్పుడు ఏమైనా జరగొచ్చని అన్నారు. మ్యాచ్ ఓడిపోతామని కొన్నిసార్లు అనుకుంటాం కానీ ఫలితం మరోలా ఉంటుందన్నారు. చివరికి ఎవరికో ఒకరికి మంచి ఫలితం లభిస్తుందని చెప్పుకొచ్చారు. గురువారం రాత్రి ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్డాడుతూ.. తాను ఢిల్లీ రాజకీయాలపై దృష్టి సారించానని, మహారాష్ట్రలో ఏం జరుగుతుందో తెలియదని  పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా.. గతంలో ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులు ఆగబోవన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా తమ అభివృద్ధి విధానాలను కొనసాగిస్తారని అన్నారు. అలాగే బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రానందున శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నయని చెప్పారు.
 
288 స్థానాలున్న మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు సొంతం చేసుకున్నారు.  అధికారం చేపట్టడానికి కావాల్సిన 145 స్థానాలు ఏ పార్టీకీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో ఇదివరకే రాష్ట్రపతి పాలనను కేంద్రం అమలు చేసింది. దీంతో రాజకీయాలు ఉత్కంఠగామారాయి.  
 

మరిన్ని వార్తలు