పరువూ పాయె...సీట్లూ పాయె....

1 Jun, 2018 18:45 IST|Sakshi
ప్రధాని మోదీ, బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : పది రాష్ట్రాల పరిధిలోని నాలుగు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో గురువారం వెలువడిన ఫలితాల్లో కేంద్ర పాలకపక్ష భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెల్సిందే. ముఖ్యంగా బిహార్‌లో పాలకపక్ష బీజేపీతో అంటకాగిన జేడీయూ మరీ నష్టపోయింది. జోకిహట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో జేడీయూ ఓడిపోయింది. లాలూ ప్రసాద్‌ నాయకత్వంలోని ఆర్జేడీ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది. లాలూ పార్టీతోని తెగతెంపులు చేసుకొని బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి జేడీయూ పరాజయం కావడం వరుసగా ఇది మూడవసారి. గత మార్చి నెలలో అరారియా లోక్‌సభకు  జరిగిన ఎన్నికల్లో జెహనాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో కూడా రాష్ట్రీయ జనతాదళ్‌ యూ అభ్యర్థులే విజయం సాధించారు. ఈ మూడు ఎన్నికలను కూడా బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది.

ముఖ్యంగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌ (29) చేతుల్లో ఈ పరాభవాన్ని చవిచూడటం నితీష్‌ కుమార్‌కు మింగుడు పడని విషయం. నాలుగు పశుదాణా కేసుల్లో లాలూకు జైలు శిక్ష పడిన నేపథ్యంలో తేజస్వీ యాదవ్‌ ఆర్జేడీ పార్టీ బాధ్యతలు స్వీకరించారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైలుకు వెళ్లినప్పటికీ ప్రజల్లో ఆయన ప్రతిష్ట దెబ్బతినలేదని తెలుస్తోంది. పైగా రాజకీయ కక్ష సాధింపులకు లాలూ బలయ్యారన్న సానుభూతి కూడా ప్రజల్లో కనిపిస్తోంది. జోకిహట్‌ నియోజకవర్గంలో తాము ఓడిపోవడానికి ఇతర కారణాలున్నాయని జేడీయూ వాదిస్తోంది.

ఏదీ ఏమైనా ఇది నితీష్‌ కుమార్‌ ప్రతిష్టకు సంబంధించిన విషయమని ఒప్పుకోక తప్పదు. బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకోవడానికి ముందు అన్ని ప్రతిపక్షాలను నడిపించగల సమర్థుడైన నాయకుడని పేరు తెచ్చుకున్న నితీష్, బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి నష్టపోతున్నారు. ఆయన ప్రధాని అయ్యే అవకాశం ఉన్న నాయకుడని కూడా పేరు పొందారు. ఇప్పుడు ఆయనకిదంతా గతించిన చరిత్ర. బీజేపీతో పొత్తు కారణంగా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగే అవకాశాన్ని కోల్పోయిన నితీష్‌ కుమార్‌ రాష్ట్రంలో కూడా బీజేపీ–జేడీయూ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మునుపటిలాగా కాకుండా ఇప్పుడు ఆయనపై బీజేపీ ఒత్తిడి ఎక్కువగా ఉంది. 2019లో జరిగే ఎన్నికల్లో కూడా రాష్ట్రం నుంచి ఆ పార్టీనే ఎక్కువ సీట్లను తీసుకొని జేడీయూకు తక్కువ సీట్లను కేటాయించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు