జనగామ టికెట్‌ పొన్నాలకే..

17 Nov, 2018 09:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎట్టకేలకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పంతం నెగ్గించుకున్నారు. పార్టీ అధిష్టానంతో పోరాడి జనగామ టికెట్‌ను ఆయన సాధించారు. జనగామ నుంచి పొన్నాల బరిలోకి దిగుతారని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌  కుంతియా స్పష్టం చేశారు. కోదండరామ్‌ పెద్ద మనుసు చేసుకుని జనగామ పోటీ నుంచి తప్పుకున్నారన్నారు.

శుక్రవారం అర్ధరాత్రి 12 తర్వాత కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య నాంపల్లిలోని టీజేఎస్‌ కార్యాలయంలో భేటీ అయ్యారు. జనగామ సీటు విషయంలో ప్రొఫెసర్ కోదండరామ్‌తో చర్చలు జరిపారు. అనంతరం కుంతియా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల నాడి కోదండరాంకు బాగా తెలుసని, అది తమకు బాగా లాభిస్తుందని అన్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా కోదండరామ్‌తో ప్రచారం చేయిస్తామని తెలిపారు.

ప్రజాకూటమి కన్వీనర్‌గా ఆయనే వ్యవహరిస్తారని వెల్లడించారు. కేసీఆర్‌కు ఐదేళ్లు పాలించమని అధికారం అప్పగిస్తే చేతకాక ముందే ప్రభుత్వాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనను అంతమొందిచటమే లక్ష్యంగా టీజేఎస్‌, టీడీపీ, సీపీఐలతో జట్టు కట్టామని పేర్కొన్నారు. మేనిస్టోలోని అంశాలను తూ.చ తప్పుకుండా అమలు చేస్తామని ప్రకటించారు. మహాకూటమిలో భాగంగా టీడీపీ 14, టీజేఎస్‌ 8, సీపీఐ 3, కాంగెస్ర్ 94 చోట్ల  పోటీ చేస్తుందని కుంతియా వెల్లడించారు.

మరిన్ని వార్తలు