తూతూమంత్రంగా ఓటర్ల నమోదు: పొన్నం

19 Sep, 2018 02:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ తూతూమంత్రంగా సాగుతోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని, ఇందుకు బాధ్యులెవరో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలో దాదాపు 2.20 లక్షల ఓట్లు, కరీంనగర్‌ అసెంబ్లీ పరిధిలో 90 వేల ఓట్లు గల్లంతయ్యాయని తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందని, ఈ విషయాన్ని అనేకసార్లు కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేశారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా స్పందించాలని ఆయన కోరారు. వీఆర్వో ఉద్యోగ పరీక్ష కోసం 12 లక్షల మంది దరఖాస్తు చేస్తే వారిని పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లేందుకు కనీస రవాణా సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు.

నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేయలేని బస్సులు టీఆర్‌ఎస్‌ నిర్వహించిన కొంగరకలాన్‌ సభకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. హిందూ మహిళలకు మంగళసూత్రం చాలా పవిత్రమైందని, అలాంటి మంగళసూత్రాన్ని తీసి పరీక్షకు వెళ్లాలని నిబంధన విధించడం దారుణమన్నారు. ఈ విషయంలో దోషులైన వారికి శిక్ష పడాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు