మండలి చైర్మన్‌ తీరు మార్చుకోవాలి

22 Dec, 2018 02:10 IST|Sakshi

ఎమ్మెల్సీల ఫిరాయింపులపై ముందుగా మా ఫిర్యాదు పరిశీలించాలి

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ 

హుస్నాబాద్‌: శాసన మండలి చైర్మన్‌ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఆ పదవినే అగౌరవపరుస్తున్నారని, ఆయన తీరు మార్చుకోవాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ నుంచి గెలిచి, టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని తాము మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కానీ టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన వారికి వెంటనే నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు.

ముందు తమ ఫిర్యాదుపై చర్యలు తీసుకున్న తర్వాత, టీఆర్‌ఎస్‌ sఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్‌కుమార్, దామోదర్‌రెడ్డి, ప్రభాకర్‌లు తమ వర్గాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని మండలి చైర్మన్‌కు లేఖ ఇచ్చారని, కానీ అలాంటి అధికారం చైర్మన్‌కు లేదని అన్నారు.

రాజకీయంగా విలువలు పడిపోయాయన్నారు. ఎంపీటీసీగా కూడా గెలవలేని ఆకుల లలితకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పదవులను కాంగ్రెస్‌ ఇచ్చిందని, అయినా లలిత పార్టీకి ద్రోహం చేశారని మండి పడ్డారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి న కేసీఆర్, ఇంత వరకు కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేయించకుండా అహంకారంతో వ్యవహరి స్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు తెలంగాణ విభజన చట్టంలోని అంశాలపై ఏనాడూ కేంద్రాన్ని ప్రశ్నించలేదని, చివరి పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఉనికిని చాటుకునేందుకు, కేంద్ర మంత్రులను కలుస్తున్నట్లు డ్రామా ఆడుతున్నారని అన్నారు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ట్రైబ ల్‌ యూనివర్సిటీ సా«ధించుకోలేని పరిస్థితిలో ఉన్నారని, సిరిసిల్ల, గజ్వేలుకు మూడు నెలల్లో రైల్వే లైన్‌ తెస్తామని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలను ప్రజలు జాతీయ దృక్పథంతో చూడాలని పొన్నం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞత చాటాలని కోరారు. 

మరిన్ని వార్తలు