నిర్మల.. యాక్సిడెంటల్‌ మినిస్టర్‌! 

19 May, 2020 03:35 IST|Sakshi

రాహుల్‌ను విమర్శించే అర్హత ఆమెకు లేదు: మాజీ ఎంపీ పొన్నం

సాక్షి, హైదరాబాద్‌: పేద ప్రజల కోసం, వలస కార్మికుల కోసం ప్రతిరోజూ తపిస్తూ తన వంతు మనోధైర్యాన్ని ఇస్తూ అండగా నిలుస్తున్న ఎంపీ రాహుల్‌ గాంధీని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సీతారామన్‌ అనుకోకుండా ఆర్థిక మంత్రి అయ్యారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, రాహుల్‌ను విమర్శించడం మానుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఆమె బయటకు వచ్చి వలసకార్మికులను చూస్తే వారు పడుతున్న కష్టాలు ఏంటో అర్థమవుతాయని, ఏసీ గదుల్లో కూర్చుని ప్రెస్‌మీట్లు పెడితే ఏం తెలుస్తాయని పొన్నం ఎద్దేవా చేశారు. రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ దేశ ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ ప్యాకేజీలతో పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కరోనా మాటున దేశంలో ఉన్న కీలక రంగాలను ప్రైవేట్‌ పరం చేసేందుకు కుట్ర చేస్తూ లబ్ధి పొందాలని కేంద్రం చూస్తోందని ఆయన ఆరోపించారు.  

మరిన్ని వార్తలు