కుట్రదారులను తప్పించేందుకు యత్నం

2 Jan, 2019 17:14 IST|Sakshi

జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలి 

వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

విజయవాడ సిటీ: ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో అసలు కుట్రదారులను తప్పించే ప్రయత్నం తీవ్రంగా జరుగుతోందని వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసును కేవలం నిందితుడు జనపల్లి శ్రీనివాస్‌కే పరిమితం చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. ఎన్‌ఐఏ పరిధిలోని కేసును రాష్ట్ర పరిధిలో విచారణ చేపట్టి నీరుగారుస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో డీజీపీ చేసిన వ్యాఖ్యలు తప్పుడువనే విషయం బుధవారం విశాఖపట్నం సీపీ లడ్డా ప్రెస్‌మీట్‌తో వెల్లడైందన్నారు. విజయవాడలోని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాస్‌ ఒక్కడినే  కర్త, కర్మ, క్రియ అని చెప్పే విధంగా విశాఖపట్నం పోలీసు కమిషనర్‌ లడ్డా ప్రయత్నించారన్నారు.  కేసు రిజిస్టర్‌ చేసే సమయంలో ఐపీసీ సెక్షన్‌ 120 బి లేకుండా ఈ కేసులో కేవలం సెక్షన్‌ 307 మాత్రమే ఎందుకు నమోదు చేశారని నిలదీశారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు డీజీపీ ప్రెస్‌మీట్‌ పెట్టి..‘జగన్‌ అభిమానే దాడి చేశాడని’ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అది తప్పని మాత్రమే ఈ రోజు లడ్డా చెప్పారన్నారు. 

ఎన్‌ఐఏతో ఎందుకు విచారణ చేయించరు? 
ఎయిర్‌పోర్టులో ఏ నేరం జరిగినా నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) చట్టం పరిధిలోకి వస్తుందన్నారు. ఎన్‌ఐఏ పరిధిలోకి వచ్చే కేసు ఎందుకు రాష్ట్ర పరిధిలో పెట్టుకున్నారని నిలదీశారు. కేంద్ర పరిధిలో ఉన్న స్థలంలో జరిగిన ఘటనపై సెక్షన్‌ 61 ఎన్‌ఏఐ యాక్ట్‌ 2008 ప్రకారం, అలాగే సివిల్‌ ఏవియేషన్‌ యాక్ట్‌ 1982 సెక్షన్‌ 3ఏ కింద  కేసు నమోదు చేసి దానిని ఎన్‌ఐఏకి బదిలీ చేయాలన్నారు. పాడేరు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోముపై మావోయిస్టులు దాడి చేసి హత్య చేస్తే వెంటనే నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కి బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వైఎస్‌ జగన్‌ కేసును ఎందుకు అప్పగించడం లేదని నిలదీశారు. పై రెండు చట్టాలు డీజీపీకి తెలియవా? లేక కావాలనే తొక్కిపట్టారా? అని ప్రశ్నించారు. విచారణను చంద్రబాబు ప్రభావితం చేశారని, ఈ కేసును ఆలస్యం చేస్తే ఇందులో సాక్ష్యాలు ఆవిరవుతాయని హైకోర్టులో ఫిర్యాదు చేశామన్నారు.  ‘జగన్‌పై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకే ప్రధానిని ఆశ్రయించారని, మోదీ తలచుకుంటే జగన్‌ జైలుకే అని’ కుప్పంలో బుధవారం జరిగిన జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని చెప్పారు. చంద్రబాబు మీద 27 కేసులు ఇవాల్టికీ స్టే రూపంలో ఉన్నాయంటే...ఆ కేసులు ముందుకు వెళ్లకుండా ఆయన కోర్టును మేనేజ్‌ చేశారా? అని ప్రశ్నించారు.  న్యాయ వ్యవస్థ అంటే బాబుకు అంత చులకన భావమా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారం కింద పరిగణించాలన్నారు. వైఎస్‌ జగన్‌పై ఉన్న కేసులు గాలి బుడగ లాంటివని, ఎవరి కుట్రతో కేసులు పెట్టారో అందరికీ తెలిసిందేనని సుధాకర్‌రెడ్డి అన్నారు.  

మరిన్ని వార్తలు