పవన్‌.. చంద్రబాబు మేకవన్నె పులి

9 Apr, 2019 05:46 IST|Sakshi

సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి  

సినీనటుడు శివాజీ ఊసరవెల్లి 

బాబు, రాధాకృష్ణ  చీకటి రంగు బయటపడింది 

సాక్షి,హైదరాబాద్‌:  చిరంజీవి ఇంట్లో ఆడపిల్లల్ని టీడీపీ నేతలతో తిట్టించి అవమానపరచిన ఏపీ సీఎం చంద్రబాబుకు పవన్‌కల్యాణ్‌ ఎలా సపోర్ట్‌ చేస్తున్నారని సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి నిలదీశారు. చంద్రబాబు మేకవన్నె పులి అన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. వైఎస్‌ జగన్‌పై పవన్‌కల్యాణ్‌ తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని కోరారు. సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ జగన్‌ దుర్మార్గుడని నిరూపిస్తే తాను శాశ్వతంగా పవన్‌ ఫొటో మెడలో వేసుకుని తిరుగుతానన్నారు.  

ఊసరవెల్లి..శివాజీ. 
చంద్రబాబు, జగన్‌ పట్ల హీరో శివాజీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాడని పోసాని తప్పుబట్టారు.  గతంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా శివాజీ మాట్లాడిన పలు వీడియో క్లిప్‌లను పోసాని ప్రదర్శించి ఆయనది నోరా.. తాటిమట్టా అంటూ దుయ్యబట్టారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే శివాజీ పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  శివాజీ టీవీ9 రవిప్రకాశ్‌ను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా దూషించాడో తనకు తెలుసన్నారు. మా కులాలు ఒక్కటేనని, అందుకే తనకు టీవీ9లో అంత ప్రచారం వస్తోందని శివాజీ ఎన్నోసార్లు తనకు చెప్పారన్నారు.   

జగన్‌కు విజన్‌ ఉంది.. 
జగన్‌కు ఓ విజన్‌ ఉందని, వచ్చే ఎన్నికల్లో ఆయన సీఎం కావడం ఖాయమని పోసాని స్పష్టం చేశారు. జగన్‌ వల్లనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. జగన్‌ చాలా మంచివాడన్న విషయం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరికీ తెలుసని, బాబు ఎంత దుర్మార్గుడో స్వయంగా ఆయన మామ, ఏపీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ చెప్పారన్నారు. సీఎం అయిన తర్వాత జగన్‌ అవినీతికి పాల్పడితే కచ్చితంగా తాను ఇదే వేదికపైనుంచి నిలదీస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు ఈ రెండు విషయాలపై ఎన్నిసార్లు కప్పదాట్లు వేశారో ఏపీ ప్రజలందరికీ తెలుసని పోసాని వివరించారు. 

ఏపీలో వీరికేం పని? 
దేవెగౌడ, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, ఫరూఖ్‌ అబ్దుల్లాలకు ఏపీలో ఏం పనని పోసాని నిలదీశారు. మోదీతో, కేసీఆర్‌తో సన్నిహితంగా ఉన్నన్ని రోజులు వాళ్లిద్దరూ బాబుకు మంచివాళ్లేనని, స్నేహం బెడిసికొట్టిన తర్వాత చెడ్డవారయ్యారన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి రాత్రికి రాత్రి .. ఎక్కడి ఆస్తులు అక్కడే వదిలేసి భయంతో విజయవాడకు పారిపోయి వచ్చి.. ఆంధ్రాకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబని విమర్శించారు. దేశంలో దాదాపు అందరి నేతలతో  చంద్రబాబు కలిశాడని, జగన్‌ మాత్రం తాను నమ్ముకున్న సిద్ధాంతంతో ఒంటరిపోరు చేస్తున్నారని తెలిపారు. 

బాబు, రాధాకృష్ణ రంగు తేటతెల్లం.. 
చంద్రబాబు, రాధాకృష్ణ ఇద్దరూ మాట్లాడుకున్న ఓ వీడియోను చూపించిన పోసాని వారిద్దరి అసలు రంగు బయటపడిందని వెల్లడించారు. ప్రజలకు ఎన్టీఆర్‌ పేరు గుర్తులేకుండా చేసేందుకు వీరిద్దరూ ఘోరమైన కుట్ర పన్నారని విమర్శించారు. వృద్ధురాలైన లక్ష్మీపార్వతిపై ఆంధ్రజ్యోతి పత్రికలో, టీవీ5 ఛానల్‌లో అభాండాలు వేశారని, ఆమెపై అలాంటి ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ ఇల్లాలు లక్ష్మీపార్వతిపై ఆ రకమైన దుష్ప్రచారం చేస్తే టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జయప్రద, రోజా, కవిత తదితరులకు చంద్రబాబు తమ పార్టీలో ఉన్నప్పుడు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదని చెప్పారు. ఇక లోకేశ్‌ బీచ్‌లలో ఆయన అమ్మాయిలతో కలసి మందు కొడుతూ ఉన్న ఫొటోలను చూపించారు. ఇప్పుడున్న నాయకులందరిలో జగన్‌ మాత్రమే ఉన్నతమైన లక్షణాలు కలిగినవాడని, ఈసారి ఆయనకు ఓటు వేసి ముఖ్యమంత్రిగా చూడాలని ఏపీ ప్రజలకు పోసాని విజ్ఞప్తి చేశారు.    

మరిన్ని వార్తలు