టీడీపీకి ఓటేస్తే రాష్ట్రం సర్వనాశనం

19 Mar, 2019 08:43 IST|Sakshi

చంద్రబాబును మించిన అవినీతిపరుడు, అసమర్థుడు, వెన్నుపోటుదారుడు ఎవరున్నారు?

కొత్తగా ఏం చెప్పాలని ఆయనపై సినిమా తీయాలి?

పిల్లనిచ్చిన మామనే చంపినోడికి జగన్‌ ఓ లెక్కా! 

చంద్రబాబుకు కనీస విలువలు లేవు..అన్ని కులాల్ని తిట్టిన వ్యక్తి 

ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతాడు

‘ముఖ్యమంత్రిగారూ.. మీరు మాటిచ్చారు’ సినిమాపై అనామకుడు లెటర్‌ రాస్తే నోటీసిస్తారా? 

బాబుకు ఈసీ ఏమైనా వత్తాసు పలుకుతుందా! 

ఎన్నికల సంఘం నోటీసుపై మండిపడ్డ పోసాని

ఆంధ్రప్రదేశ్‌లోని కమ్మవాళ్లతో సహా అన్ని కులాల వారికి చెబుతున్నా. చంద్రబాబు దొంగ, అబద్ధాల మనిషి, అవినీతిపరుడు. ఆయనకు ఓటేయొద్దు. కనీస విలువలు లేవు. అన్ని కులాల్ని తిట్టిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఎవరైనా ఓటేస్తే కమ్మ రాజ్యానికి ఓటేసినట్లే. ఈ సారి పొరపాటున టీడీపీకి ఓటేశారో ఆంధ్రప్రదేశ్‌ కమ్మ సామ్రాజ్యమవుతుంది. రాష్ట్రం నాశనమవుతుంది.

భారతదేశ ఓటర్లందరికీ ఉపయోగపడే సినిమా ’ముఖ్యమంత్రి గారూ, మీరు మాటిచ్చారు’.. ప్రజల్ని చైతన్యవంతం చేసేలా ఈ సినిమా పోస్టర్‌ ఉంటుంది. ఓటును కొనేవాడు కుక్కతో సమానం, మద్యం పంపిణీ చేసేవాడు పందితో, కులం కార్డు ఉపయోగించే వాడు లోఫర్‌తో, వెన్నుపోటు పొడిచే వాడు బ్రోకర్‌తో, నీతిగా సేవ చేసేవాడు దేవుడితో సమానం అనే సందేశం ఉంటుంది.

ప్రజా జీవితంలో ఉంటే తప్పుడు పనులు చేసినప్పుడు విమర్శించరా? నేను నా సినిమాలో చంద్రబాబును విమర్శించలేదు. నాలుగేళ్లు మోదీ కాళ్లు పట్టుకున్నావ్, ఇప్పుడేమో అదే మోదీని తిడుతున్నావ్‌? రాహుల్‌ గాంధీని, సోనియా గాంధీని ఆ వేళ తిట్టావ్‌. ఈ రోజు ఆలింగనం చేసుకుంటున్నావు. నీకు అనుకూలంగా ఉంటే మంచివాళ్లు, లేదంటే చెడ్డవాళ్లు.

సాక్షి, అమరావతి : టీడీపీకి ఓటేస్తే రాష్ట్రం సర్వ నాశనమవడం ఖాయమని, ఫలానా వ్యక్తి తనకు వ్యతిరేకమంటే వాళ్ల జీవితాల్ని నాశనం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అలవాటేనని ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళీ ధ్వజమెత్తారు. ఆయనను మించిన అవినీతిపరుడు, అసమర్థుడు, వెన్నుపోటుదారుడు ఎవరూ లేరన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసని, అలాంటి వ్యక్తిని అపఖ్యాతి పాలుచేసేందుకు సినిమా తీయాల్సిన అవసరమే లేదన్నారు. అధికారం కోసం ఏమైనా చేసే చంద్రబాబు సాక్షాత్తూ పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను చంపించారని, అలాంటి వ్యక్తికి వైఎస్‌ జగన్‌ ఓ లెక్కా! అని దుయ్యబట్టారు. బాబు మళ్లీ గెలిస్తే వచ్చేది కమ్మ రాజ్యమేనని వ్యాఖ్యానించారు. తాను నిర్మిస్తున్న సినిమా ఏంటో తెలుసుకోకుండా, ఎవరో టీడీపీ అభిమాని ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం వ్యక్తిగతంగా హాజరవ్వాలని తనకు నోటీసు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తే ఆయన్ను వ్యక్తిగతంగా పిలుస్తారా? అని నిలదీశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోసాని ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..
 
బాబు దొంగని ప్రజలకు తెలియదా! మళ్లీ సినిమా ఎందుకు? 
చంద్రబాబును తిట్టడానికి బుద్ధున్నోడు ఎవడైనా సినిమా తీయాలా? ఆయన ఎలాంటి వాడో ప్రజలకు తెలియదా? చంద్రబాబు దొంగని, వెన్నుపోటుదారుడని, ఎన్టీఆర్‌ను చంపాడని, ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియోలతో సహా అడ్డంగా దొరికిపోయాడని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు 23 మందిని సంతలో పశువుల్లా కొనుగోలు చేశాడని.. ఎస్సీ, ఎస్టీలను ఘోరంగా తిట్టాడని, ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటారా? అన్నాడని తెలియదా?. ఒరేయ్‌! దళితులకు మీకెందుకురా రాజకీయాలు.. అని వాళ్ల ఎమ్మెల్యేలతో తిట్టిస్తాడు కదా? ఇలాంటివన్నీ ప్రజలకు తెలుసు కదా? మళ్లీ సినిమా తీయడం దేనికీ? కాపుల్ని, బ్రాహ్మణుల్ని, నాయీ బ్రాహ్మణుల్ని, మాలల్ని, మాదిగల్నీ, చివరకు కమ్మవాళ్లను వదిలిపెట్టలేదు కదా చంద్రబాబు? ఓటర్లను తప్ప చంద్రబాబు ఎవ్వర్నీ వదిలిపెట్టడు. ఫలానా వాడు తనకు వ్యతిరేకమంటే వాడి జీవితాన్ని నాశనం చేస్తాడు. అన్ని దుర్మార్గాలూ చేసి తనకు తెలియదంటాడు. జగన్‌పై దాడి చేయిస్తాడు, తనకు తెలియదంటాడు. కోడి కత్తి అంటాడు. ఇంతటి దుర్మార్గుడైన ముఖ్యమంత్రి గురించి ఎవడైనా సినిమా తీస్తారా? ఇవన్నీ ప్రజలకు తెలిసినవే కదా.
 
చంద్రబాబు అబద్ధాల మనిషి  
నేను చిలకలూరిపేటలో పోటీ చేసినప్పుడు.. చిరంజీవికి ఓటేస్తే కాపులకు వేసినట్టని, కాపులొస్తే కమ్మవాళ్లను బతకనివ్వరని టీడీపీ వాళ్లు అన్నట్లు ఓ అమ్మాయి స్వయంగా నాకు చెప్పింది. ఆ రోజున చిరంజీవి ఇంట్లో ఆడవాళ్లను కూడా వదిలిపెట్టకుండా ఘోరంగా తిట్టించాడు. ఎవర్నీ వదల్లేదు. నాలుగేళ్లు మోదీ కాళ్లు పట్టుకున్నావ్, ఇప్పుడేమో అదే మోదీని తిడుతున్నావ్‌? రాహుల్‌ గాంధీని, సోనియా గాంధీని ఆ వేళ తిట్టావ్‌. ఈ రోజు ఆలింగనం చేసుకుంటున్నావు. నీకు అనుకూలంగా ఉంటే మంచి వాళ్లు, లేదంటే చెడ్డవాళ్లు.  

ప్రజల్ని చైతన్యం చేసేలా..
ఒక వ్యక్తినో, పార్టీనో దృష్టిలో పెట్టుకుని ‘ముఖ్యమంత్రి గారూ.. మీరు మాటిచ్చారు’ సినిమా  తీయలేదు. ’ఆపరేషన్‌ దుర్యోధన’ మాదిరిగా ఎవరి గెటప్‌లు లేకుండా తీశా. ఈ సినిమా ఏంటో తెలుసుకోకుండా చిత్తూరుకు చెందిన మోహన్‌రావు అనే వ్యక్తి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి సినిమాను ఆపమన్నాడట. ఇంతవరకు తొలి ప్రతి బయటకు రాకుండానే నేనేదో చంద్రబాబును తిట్టడానికి ఈ సినిమా తీశాడని ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం నోటీసులిచ్చింది. 

ఎన్టీఆర్‌పై సినిమా తీస్తే ఏమన్నాడో తెలుసా! 
ఎన్టీఆర్‌పై ‘మండలాధ్యక్షుడు’ సినిమా తీశారు. మీ గెటప్‌ పెట్టి సినిమా తీశారంటే.. అవునా! అచ్చం నాలాగే చేశారట కదా! అని ఆయన చాలా తేలిగ్గా తీసుకున్నారు. నాయకుడంటే ఆయన. నువ్వు (చంద్రబాబు) ఎందుకు చెడ్డ పనులు చేయాలి.. ఆనక వాడు సినిమా తీస్తున్నాడేమో, వీడు తిడుతున్నాడేమో.. నెట్‌లోనో, వెబ్‌సైట్‌లో పెడతారేమోనని భయపడుతూ తీసేయించండని ఎందుకు హకుంలు జారీ చేయిస్తావు? నువ్వెందుకు తప్పు పనులు చేయాలి? ఎందుకు వెన్నుపోట్లు పొడవాలి? చేయాల్సిన పనులు చేస్తావు.. ఎవరన్నా ప్రశ్నిస్తే అంతుచూస్తానంటావు? మేనిఫెస్టోలో అబద్ధాలు చెప్పే కదా ముఖ్యమంత్రివయ్యావు. 

వైఎస్సార్‌సీపీ అభిమానినని రమ్మంటున్నారా? లేక చంపడానికా? 
ఎన్నికల సంఘం తీరు నచ్చలేదు. అసలు నేను సినిమా తీస్తున్నానని చెప్పలేదు. అందులో ఏముందో ఎవరికీ తెలియదు. ఆ మోహనరావు చెప్పిన సినిమా టైటిల్‌కు నా సినిమాకు సంబంధం లేదని సమాధానమిస్తే నన్ను ఈ నెల 20న అమరావతిలోని ఈసీ కార్యాలయానికి స్వయంగా వచ్చి సంజాయిషీ ఇమ్మంటారు. అసలు నేను ఎందుకు రావాలి? నేను వైఎస్సార్‌సీపీ అభిమానినని రమ్మంటున్నారా? లేదంటే దారిలో నన్ను చంపడానికి ఏమైనా ప్లాన్‌ చేశారా? చంద్రబాబు ముందు నిల్చోబెడతారా? నా వివరణ ఇచ్చాక కూడా ఇదేం తీరు? ఇదంతా చూస్తుంటే ఎన్నికల సంఘం కూడా చంద్రబాబుకి అనుకూలంగా వంతపాడుతుందా? అని భావించాల్సి వస్తోంది. లెటర్‌ రాసిన వాడిని అడగాల్సిన ప్రశ్నలు నన్ను అడిగితే నేను ఏం సమాధానం చెప్పగలను.
 
ఎన్నికల కోడ్‌ నీకు అడ్డం రాదా? 
విడుదల కాకుండానే సినిమా ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తుంది. నువ్వు (ముఖ్యమంత్రి) మైకు పట్టుకుని ప్రత్యర్ధుల్ని ఇష్టంమొచ్చినట్లు తిడుతున్నప్పుడు ఎన్నికల కోడ్‌ అడ్డు రాలేదేం? ఎవరు మంచి వాళ్లైతే వాళ్లకు ఓట్లేయమని చెబితే తప్పేమిటీ? నేను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానిని. జగన్‌కు ఓటు వేయమని చెబుతా.. తప్పేముంది అందులో? జగన్‌ ఎప్పుడైనా భూ కబ్జాలు చేశాడా? బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని సుజనా చౌదరి మాదిరి ఎగ్గొట్టాడా? తెలుగుదేశం వాళ్లు ఎంత మంది బ్యాంకులకు ఎగనామం పెట్టారు? సీబీఐ ఎంత దరిద్రంగా తయారైందో చూశాం కదా? అందుకే కదా అందర్నీ ఇటీవల మార్చింది. ప్రతిపక్ష నాయకుడు జగన్‌ను కోడికత్తితో పొడిచినోడి జేబులోంచి ఎలాంటి మడతా లేకుండా లెటర్‌ను తీసిన ఘనులు, పోలీసులున్న రాష్ట్రం మనది. 

నీ కొడుకులా నేను అవినీతిపరుడినా? 
నేనేమీ రౌడీ షీటర్‌నో, అవినీతిపరుడినో, భూకబ్జాదారుడినో, సుజనా చౌదరిలాగా బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టినవాడినో కాదు. నాపై ఏ కేసూ లేదు. చంద్రబాబు కొడుకు లోకేష్‌ మాదిరిగా అవినీతిపరుడ్ని అసలే కాదు. నీ కొడుకు మాదిరిగా తాగుబోతును, తిరుగుబోతును కాదు. మరెందుకు రావాలి నేను స్వయంగా.

ఈ సినిమా సీఎంకు, సామాజిక కార్యకర్తకు మధ్య జరిగే సంభాషణ  
నేను నిజాయితీగా ఉన్నందున ఎవర్నైనా ప్రశ్నిస్తా. చంద్రబాబులా తప్పు పనులు చేయలేదు. నేను తీసిన సినిమా చంద్రబాబుపైన కాదు. ముఖ్యమంత్రికీ, ఒక సామాజిక కార్యకర్తకు మధ్య జరిగే సంభాషణ ఇది. ముఖ్యమంత్రిగా చాలా సార్లు ప్రమాణం చేశారు కదా, ఎన్నికల ప్రణాళికలో చాలా వాగ్దానాలు చేశారు, మీరెందుకు నెరవేర్చలేదు? అని సామాజిక కార్యకర్త ప్రశ్నిస్తాడు. ఇంతలో ఒక రైతు వచ్చి రుణమాఫీ చేయకపోవడం వల్ల ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతూ చనిపోయిన రైతు రాసిన లేఖను ఇస్తాడు. ఆ లేఖను పట్టుకుని సామాజిక కార్యకర్త కోర్టుకు వెళతాడు. అదీ కథ. ఇందులో ఏ వ్యక్తినో, పార్టీనో, రాష్ట్రాన్నో పేర్కొనలేదు. అయినా సినిమాను విడుదల చేయాలో వద్దో నిర్ణయించేది ఎన్నికల సంఘం కాదు, సెన్సార్‌ వాళ్లు. వాళ్లు నిర్ణయిస్తారు. ఎన్నికల సంఘం ఇదే మాదిరిగా వ్యవహరిస్తే నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా. ఎలాంంటి ఆధారాలు లేకుండా నన్ను రమ్మని పట్టుబడుతున్నారంటే స్వతంత్ర వ్యవస్థ అయిన ఎన్నికల సంఘం విశ్వసనీయతనే సామాన్య ప్రజలు శంకించాల్సి వస్తుంది. ఎన్నికల సంఘం చెప్పిన తేదీన నేను హాజరుకావడం లేదు. 

మరిన్ని వార్తలు