కులపిచ్చితో కాదు.. కేసీఆర్‌ను చూసి ఓట్లేశారు : పోసాని

12 Dec, 2018 10:38 IST|Sakshi
పోసాని కృష్ణమురళి (ఫైల్‌ ఫొటో)

ఆంధ్రలో వైఎస్‌ జగనే సీఎం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలు కులపిచ్చితో కాకుండా సీఎం కేసీఆర్‌ సంక్షేమాన్ని చూసి ఓట్లేశారని సినీనటుడు పోసాని కృష్ణమురళి అభిప్రాయపడ్డారు. ఇదే విధంగా ఆంధ్రాలో ఉన్న కమ్మవారు.. మంచి నిజాయితీ ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం పోసాని తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడారు.

‘ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సైంధవుడిగా వచ్చారు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చుపెట్టారు. సైంధవుడు-2గా లగడపాటి రాజగోపాల్‌ వచ్చారు. అయినా కేసీఆర్‌ చేసిన సంక్షేమమే ఆయనను గెలిపించింది.  ప్రజాస్వామ్యం వైపు ఉండే గద్దర్‌.. ఈ ఎన్నికల్లో కూటమి తరఫున రావడం చూసి షాకయ్యాను. కేసీఆర్‌ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. కేసీఆర్‌ ఏం చెప్పాడో ఆ మంచి పనులను చేశారు. కాళేశ్వరం పూర్తైతే సగం తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రి, మూడేళ్లలో ప్రజలకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆరే. ఆయనపై చేసిన విమర్శలను ప్రజలు తిప్పికొట్టారు. ఏపీలో తహసీల్దార్‌పై దాడి జరిగితే చంద్రబాబు పట్టించుకోలేదు. అదే కేసీఆర్‌ అనాథ బాలికకు అన్యాయం జరిగితే న్యాయం చేశారు. 

జగన్‌పై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు పరామర్శించలేదు. కనీసం పలకరించలేదు కదా.. జగన్‌ కుటుంబంపై ఎదురు దాడి చేశారు. బాలకృష్ణ అంత పవర్‌ ఫుల్‌ అయితే సుహాసిని గెలిచి ఉండేది. లగడపాటి గురించి మాట్లాడుకోవడం అనవసరం. కేసీఆర్‌, కేటీఆర్‌ల్లో సీఎం ఎవరైనా మంచి పాలన అందిస్తారు. 

ఏపీలో కేసీఆర్‌ పోటీ చేసినా.. నేను జగన్‌కు మద్దతిస్తా..
ఏపీలో జరిగే ఎన్నికల్లో వంద శాతం వైఎస్‌ జగన్‌ గెలుస్తారు. ఆయన చేపట్టిన పాదయాత్రకు భారీ ఆదరణ లభిస్తోంది. ఇంత ప్రజాదరణ దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్‌, వైఎస్సార్‌లకు కూడా రాలేదు. జగన్‌ పరిపక్వత గల నాయకుడు. ఆయన గెలిస్తే కుల పిచ్చి, రౌడీయిజం, దోపిడీలుండవు. రాష్ట్రం బాగుపడుతుంది. ఒకవేళ కేసీఆర్‌ ఏపీలో పోటీ చేసినా.. నా మద్దతు జగన్‌కే ఉంటుంది. ఆయన అవినీతి చేయలేదు. అన్యాయంగా ఇరికించారు. ఎంత మంది పోటీలో ఉన్నా ఏపీ​కి కాబోయే సీఎం వైఎస్‌ జగనే.

ఓటుకు నోటు కేసులో ఆ వాయిస్‌ ఎవరిదీ?
ఓటుకు నోటు కేసులో ఉన్నది చంద్రబాబు వాయిస్‌ కాదా? రూ.50 లక్షలు రేవంత్‌ పట్టుకొచ్చి రెడ్‌హ్యాండేడ్‌గా దొరకలేదా? చంద్రబాబు కూడా ఆ వాయిస్‌ నాది కాదని చెప్పలేదు. అది ఆయన వాయిస్‌ అని జనాలు అంతా నమ్మారు కాబట్టే తెలంగాణ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారు.  వైఎస్సార్‌సీపీకి మద్దతుగా కేసీఆర్‌ ప్రచారం చేస్తే.. అద్భుతం‌. అఖండ విజయం వరిస్తోంది. కేసీఆర్‌ అంటే ఆంధ్రలో చాలా మందికి అభిమానం. చాలా ఓట్లు పడతాయి. రాష్ట్రాన్ని విడగొడుతున్నారని, కేసీఆర్‌పై కోపం పెంచుకున్నారు కానీ.. కేసీఆర్‌ సీఎంగా చేసిన పనులు చూసి అభిమానిస్తున్నారు.

ఆయన రాజకీయ నాయుకుడే కాదు..
ప్రజల్లోకి వచ్చి జనాల్లో మాట్లాడి గెలిస్తేనే నేను రాజకీయ నాయకుడిగా పరిగణిస్తా. అడ్డదారిలో మంత్రి అయిన నారాలోకేశ్‌ నా దృష్టిలో రాజకీయ నాయకుడే కాదు. ఆయన తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు కాబట్టే టీడీపీ ఆ రెండు సీట్లన్న గెలుచుకుంది. వైఎస్‌ జగన్‌ను పదేపదే రెచ్చగొడితేనే ఆయన పవన్‌ కల్యాణ్‌ను విమర్శిస్తున్నారు.  వైఎస్‌ జగన్‌ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల మధ్యకు వెళ్లారు. ఆయనను ఊరికే పవన్‌ కల్యాన్‌ విమర్శించడం ఎందుకు?’ అని పోసాని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు