మోదీ విదేశీ పర్యటనలు ఖరారు

29 May, 2019 19:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపడుతున్న నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం చేయబోయే విదేశీ పర్యటనలు కూడా దాదాపు ఖరారయ్యాయి. తొలి పర్యటనగా మాల్దీవులకు వెళ్లనున్న ఆయన ఈ ఏడాది ఇద్దరు అగ్రదేశాల అధినేతలను కలవనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో మోదీ రెండుసార్లు ద్వైపాక్షిక భేటీలో పాల్గొనే అవకాశముందని సమాచారం. సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

ఈ సమావేశాలకు హాజరుకానున్న మోదీ.. ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందే జూన్‌ 28, 29న జపాన్‌లో జరగబోయే జి20 సదస్సులోనూ వీరిద్దరూ సమావేశం కానున్నారు. ఇక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అక్టోబరులో భారత పర్యటనకు రానున్నట్లు సమాచారం. అక్టోబరు 11న మోదీతో జిన్‌పింగ్‌ అనధికారిక భేటీలో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. దీనికంటే ముందే జూన్‌ 13,14న కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరయ్యే మోదీ.. జిన్‌పింగ్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. 

మరిన్ని వార్తలు