శివసేనకు చెక్‌.. బీజేపీతో కలిసిన రాజ్‌ఠాక్రే..!

5 Jan, 2020 12:13 IST|Sakshi

 సంచలనంగా మారిన రాజ్‌ఠాక్రే, మోదీ, ఫడ్నవిస్‌ పోస్టర్‌

సాక్షి, ముంబై : సంచలన రాజకీయాలకు ఇటీవల వేదికగా నిలిచిన మహారాష్ట్రలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీకి ఆమడదూరంలో ఉండే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్‌ఎన్‌ఎస్‌) చీఫ్‌ రాజ్‌ ఠాక్రే కేంద్ర ప్రభుత్వంతో జట్టు కట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్‌ ఠాక్రే, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో కూడిన పోస్టర్లు  పాల్గాడ్‌లో వెలవడం తీవ్ర సంచలనంగా మారింది. స్థానిక బీజేపీ కార్యకర్తలు ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వంలోని మంత్రులకు శాఖలు కేటాయించిన రోజునే ఈ పరిణామం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే హిందుత్వవాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, ఎన్సీపీతో కూటమిగా ఏర్పడ్డ శివసేనకు చెక్‌ పెట్టేందుకు బీజేపీ, ఎమ్‌ఎన్‌ఎస్‌ కలుస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రానున్న జిల్లాపరిషత్‌ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో ఎమ్‌ఎన్‌ఎస్‌-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని, వీరి కూటమి తరఫున రాజ్‌ఠాక్రే ప్రచారం చేస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఉద్ధవ్‌ ఠాక్రే కాంగ్రెస్‌తో కలవడంపై ఎమ్‌ఎన్‌ఎస్‌ తొలినుంచి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇరు పార్టీలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరిన్ని వార్తలు