అమేథీలో కలకలం

15 Jan, 2018 17:59 IST|Sakshi

లక్నో: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన నియోజకవర్గం అమేథీలో పర్యటిస్తున్న నేపథ్యంలో పోస్టర్ల యుద్ధానికి తెర లేచింది. రాహుల్‌ను రాముడిగా, ప్రధాని నరేంద్ర మోదీని రావణుడిగా పేర్కొంటూ ముద్రించిన పోస్టర్లు కలకలం రేపాయి. రావణుడు(మోదీ)పై రాముడు(రాహుల్‌) బాణాలు ఎక్కుపెట్టినట్టుగా పోస్టర్‌లో చూపించారు. స్థానిక కాంగ్రెస్‌ నాయకుడు అభయ్‌ శుక్లా ఈ పోస్టర్లు పెట్టారు.

‘భారతీయ జనతా పార్టీ చేస్తున్న అరాచక పాలనకు ముగింపు పలికి 2019లో రాహుల్‌ గాంధీ దేశంలో రాహుల్‌ రాజ్యం(రామ రాజ్యం) తీసుకొస్తార’ని పోస్టర్లపై ముద్రించారు. మరోచోట రాహుల్‌ను కృష్ణుడి అవతారంలో చూపిస్తూ పోస్టర్లు పెట్టారు. యోధుడు ప్రయాణం మొదలు పెట్టాడని ఈ పోస్టర్లపై రాశారు. కాంగ్రెస్‌ పోస్టర్లపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది.

అమేథీ ఎంపీ మిస్సింగ్‌
మరోవైపు అమేథీ ఎంపీ కనిపించడం లేదంటూ రాహుల్‌ గాంధీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. విద్య, ఆరోగ్యాలను విస్మరించారని.. అమేథీ నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారని పోస్టర్లపై ముద్రించారు. అభివృద్ధికి దూరమైన అమేథీ ప్రజలు ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.

సలోన్‌లో ఉద్రిక్తత
రాహుల్‌ గాంధీ పర్యటన నేపథ్యంలో సలోన్‌ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలు తమపై దాడి చేశారని బీజేపీ ఎమ్మెల్యే దాల్‌ బహదుర్‌ కోరి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు అమేథీ ఎమ్మెల్సీ దీపక్‌ సింగ్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు పోలీసులు కష్టపడాల్సివచ్చింది.

మరిన్ని వార్తలు