దీదీ.. వద్దు నీ దాదాగిరీ!

13 Feb, 2019 08:54 IST|Sakshi
యూత్‌ ఫర్‌ డెమోక్రసీ పేరిట వెలిసిన పోస్టర్‌

మమతకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు

సాక్షి, న్యూఢిల్లీ :  ఢిల్లీ రాష్ట్ర సమస్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నేడు చేపట్టనున్న దీక్షకు మద్దతుగా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సంఘీభావం తెలపనున్నారు. దీని కోసం ఆమె నేడు ఢిల్లీకి రానున్నారు. అయితే ఆమె రాకపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ కొందరూ ఢిల్లీ వీధుల్లో పోస్టర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆమె ధర్నా పాలిటిక్స్‌ను గుర్తు చేస్తూ విమర్శలు గుప్పించారు. ‘దీదీ.. ఈ ప్రజాస్వామ్య భారత దేశంలో మిమ్మల్ని సాధరంగా ఆహ్వానిస్తున్నాం. కానీ దయచేసి మీరు మీ దాదాగిరీని మాత్రం ఇక్కడకు తీసుకురావద్దు’ అని పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఇక ఈ పోస్టర్ల అన్నిటిని ‘సేవ్‌ యూత్‌ డెమోక్రసీ’ అనే పేరిట ఏర్పాటు చేసినట్లుంది.

ఇటీవల ‘సేవ్‌ కంట్రీ, సేవ్‌ డెమోక్రసీ’ పేరిట మమత.. కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో  మూడు రోజుల పాటు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.  కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ నివాసంపై సీబీఐ అధికారుల దాడులను నిరసిస్తూ ఆమె చేపట్టిన ఈ దీక్షను సుప్రీం తీర్పుతో విరమించారు. ఇక కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక పక్షాలన్నిటినీ ఒకే వేదికపై తీసుకొచ్చి మెగా ర్యాలీ కూడా నిర్వహించారు. 

మరిన్ని వార్తలు