టీఆర్‌ఎస్‌లో ఇమడలేకపోతున్నా

3 Nov, 2017 13:50 IST|Sakshi

త్వరలో కాంగ్రెస్‌ పార్టీతో చేరతా

మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు ఆయనే స్వయంగా చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ పార్టీలో ఇమడలేకపోతున్నానని వాపోయారు. కేసీఆర్ పాలన నిజాం ఏలుబడిని తలపిస్తోందని విమర్శించారు. సచివాలయానికి రాకుండా ఉన్న ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.

ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌ రెడ్డి.. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రోత్సాహంతో పోట్ల నాగేశ్వరరావు పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గత ఐదారురోజులుగా వీరిద్దరితో ఆయన భేటీ అయ్యారు.  పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరితే పార్టీ పరంగా జిల్లాస్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఆయన అనుచరులు భావిస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2009లో స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన పోట్ల 2015 వరకు టీడీపీ తరఫున కొనసాగారు. 2016లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. టీడీపీలో సీనియర్‌ నాయకుడిగా, పలుసార్లు సుజాతనగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన పార్టీలో రాష్ట్రస్థాయి పదవులు పొందారు.

మరిన్ని వార్తలు