టైమ్‌ వేస్ట్‌ : కేశినేని కామెంట్లపై పీవీపీ

18 Mar, 2019 15:19 IST|Sakshi

సాక్షి, విజయవాడ: వైఎస్ఆర్ హయాంలో స్వర్ణాంధ్రప్రదేశ్‌ను చూశామని, మళ్ళీ అటువంటి పాలన రావాలంటే వైఎస్ జగన్ వల్లే సాధ్యం అవుతుందని వైఎస్సార్‌సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ అన్నారు. రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థులు కొక్కిలిగడ్డ రక్షణనిధి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, భవకుమార్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ స్థానికుడిగా ఇక్కడి అన్ని సమస్యలు తనకు తెలుసునని, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధే తన ధ్యేయమని తెలిపారు. రాజధాని ప్రాంతంగా విజయవాడను మరింత అభివృద్ధి చేయాల్సి వుందన్నారు. ప్రగతి వైపు పరుగు అనే నినాదంతో ముందుకు సాగుతామన్నారు. తనపై కేశినేని నాని చేసిన విమర్శలకు సమాధానం చెప్పడం సమయం వృధా చేయడమే అన్నారు.


విజయవాడలో వైఎస్ఆర్ హయాంలో 150 కోట్లతో మాల్ నిర్మించి 700 మందికి ఉపాధి కల్పించినట్టు చెప్పారు. తాను ఏ ప్రభుత్వంతోనూ కలిసి పనిచేయలేదని, లబ్ది పొందలేదని స్పష్టం చేశారు. విజయవాడ నగరానికి బయట ప్రాంతాల నుంచి పెట్టుబడిదారులు రావాల్సిన అవసరం ఉందన్నారు. సినీపరిశ్రమను విజయవాడకు రావాలని కోరతానని అన్నారు. కాగా, పొట్లూరి వరప్రసాద్ సమక్షంలో మైనార్టీ, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పలువురు వైఎస్సార్‌సీపీలో చేరారు.

నమ్మకంతో ఉన్నారు: మల్లాది విష్ణు
ప్రజలు వైఎస్సార్‌సీపీపై పూర్తి విశ్వాసంతో వున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి  మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు పాలనలో జరిగిన మోసంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోందని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో టీడీపీకి అధికారాన్ని అప్పగిస్తే రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్ అని ప్రశంసించారు.


ఐదేళ్ళలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని వైఎస్సార్‌సీపీ విజయవాడ తూర్పు అభ్యర్థి బొప్పన భవకుమార్ విమర్శించారు. విజయవాడలో కనీసం రెండు ఫ్లైఓవర్ లను పూర్తి చేయలేని అసమర్ధ ప్రభుత్వం ఇదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ సంక్షేమ పాలనను మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారని రక్షణనిధి అన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు చాలా కష్టాలు పడ్డారని, ఈ ఎన్నికలతో చంద్రబాబు దుష్ట పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు