‘అదంతా డ్రామా’

13 Mar, 2018 20:51 IST|Sakshi
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్

పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

అసెంబ్లీలో ప్రభుత్వ తీరుపై  ఫైర్‌

సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణ అసెంబ్లీలో సోమవారం జరిగిన ఘటనను ఓ డ్రామాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కౌన్సిల్ చైర్మన్‌ స్వామిగౌడ్‌ చేత సీఎం కేసీఆర్ నాటకం ఆడిస్తున్నారని ఆరోపించారు. చైర్మన్‌కు దెబ్బతగలడం నిజమైతే ఆ వీడియోను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు.

చైర్మన్‌ ఒకవైపు కూర్చుంటే మరో వైపు ఉన్న కంటికి ఎలా దెబ్బ తగిలిందని నిలదీశారు. నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందని, తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసిందని మండిపడ్డారు.

అప్పుడు హరీష్‌ చేయలేదా?
గతంలో గవర్నర్ ప్రసంగ సమయంలో హరీశ్‌రావు బెంచీల మీద దూకుతూ వెల్‌లోకి దూసుకెళ్లలేదా అని గుర్తు చేశారు. ఆయన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే వ్యవహరించిందా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై స్పందించని స్పీకర్ మమల్ని సస్పెండ్‌ చేయడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. స్పీకర్ విధుల నిర్వహణలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. పార్లమెంట్‌లో కేసీఆర్ కూతురు స్పీకర్ ముఖం మీద ప్లకార్డులు ప్రదర్శిస్తోందని, ఇక్కడ మేం మాత్రం నిరసన చేపట్టొద్దా.. ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు.

బడ్జెట్‌లో రైతులు, గిరిజనుల గురించి ప్రస్తావన లేదని, ప్రధాన అంశాలు లేవని మేము చెప్పడానికి వెళితే మాపై 50 మంది పోలీసులతో దాడి చేయించారన్నారు. చివరి బడ్జెట్ సమావేశంలో..  సమాధానాలు ఇవ్వొద్దనే ఉద్దేశంతో మాపై సస్పెన్షన్ వేటు వేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్‌ లాంటి నియంతలు అధికారంలోకి రావద్దంటూ ఈ సందర్భంగా ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’  అనే నినాదాన్ని ఇచ్చారు.

మరిన్ని వార్తలు