జేసీతో విభేదాలు.. సీఎంను కలిసిన ఎమ్మెల్యే

19 Jul, 2018 17:55 IST|Sakshi
ప్రభాకర్‌ చౌదరి, చంద్రబాబు నాయుడు (పాత చిత్రం)

సాక్షి, అమరావతి : అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి బట్టబయలు కాగా, వివాదం మరింత ముదరకుండా చూసేందుకు పార్టీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఓ ఎమ్మెల్యేను పిలిపించి నేరుగా మాట్లాడి గొడవలుంటే సర్దుకుపోవాలని సర్దిచెప్పడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరు నేతలెవరంటే ఒకరు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి కాగా, మరొకరు పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి. గత కొంతకాలం నుంచి కొనసాగుతున్న వర్గపోరు నేపథ్యంలో ప్రభాకర్‌ చౌదరి సీఎం చంద్రబాబును కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రమ్మన్నందుకే వచ్చి ఆయనను కలిసినట్లు తెలిపారు. జేసీ దివాకర్‌రెడ్డితో వివాదాలు ఉంటే సర్దుకుపోవాలని చంద్రబాబు తనకు సూచించినట్లు ప్రభాకర్‌ చౌదరి చెప్పారు.

జేసీ దివాకర్‌రెడ్డితో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, కేవలం రాజకీయంగా మాత్రమే విభేదాలున్నాయని చంద్రబాబుకు వివరించగా.. ప్రజల కోసం మీ ఇద్దరూ కలిసి పనిచేయడంపై దృష్టిసారించాలని చెప్పారు. ఎంపీ జేసీనే తనపై సీఎంకు ఫిర్యాదు చేసి ఉంటారన్న ఆయన.. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయని పేర్కొన్నారు. 1996లో తాను మున్సిపల్‌ చైర్మన్‌గా చేసినప్పుడు అనంతపురంలో రోడ్ల నిర్మాణ విషయంలో కొన్ని రాజకీయ విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని ప్రభాకర్‌ చౌదరి అంగీకరించారు. పార్లమెంట్‌ సభ్యుడి (ఎంపీ)గా ఆయన పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే అధికారం జేసీ దివాకర్‌రెడ్డికి ఉందన్నారు. అదే విధంగా తన నియోజకవర్గ అభివృద్ధి కూడా తనకు ముఖ్యమేనని ఎమ్మెల్యే అన్నారు.

మరిన్ని వార్తలు