సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ప్రమాణంపై వివాదం..

17 Jun, 2019 20:24 IST|Sakshi

న్యూఢిల్లీ:   వివాదాలకు తెరలేపుతూ సంచలన వ్యాఖ్యలు చేసే భోపాల్‌ బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. కొత్తగా గెలిచిన లోక్‌సభ సభ్యులు సోమవారం పార్లమెంటులో ప్రమాణం స్వీకరించారు. ఈ సందర్భంగా సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ తన పూర్తి పేరుతో ప్రమాణం చేశారు. తన పేరు చివర ఆధ్యాత్మిక గురువు ‘స్వామి పూర్ణాచేతనానంద అవధేషానంద్ గిరి’ పేరును జోడించి ప్రమాణం చేశారు. దీనిపై  ప్రతిపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆమె తన పేరు చివరన ఆధ్యాత్మిక గురువు పేరుకు కూడా జోడించారని సభాపతి దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై స్పందించిన సాధ్వీ తన పూర్తి పేరు ఇదేనని, తన ప్రమాణ స్వీకార పత్రంలోనూ ఇదే పేరు మొదటగా చేర్చానని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రొటెం స్పీకర్‌ వీరేంద్రకుమార్‌.. రిటర్నింగ్‌ అధికారి జారీచేసిన ఎన్నికల సర్టిఫికెట్‌లోని వాస్తవంగా ఉన్న పేరునే పరిగణనలోకి తీసుకుంటామని, ఒకవేళ ప్రజ్ఞాసింగ్‌ తన పేరులో మార్పు చేసినట్టయితే.. ఎన్నికల సర్టిఫికెట్‌లోని పేరునే రికార్డుల్లో కొనసాగిస్తామని ప్రతిపక్ష సభ్యులకు హామీ ఇచ్చారు. ఆమె ప్రమాణంపై ఒకవైపు ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. మరోవైపు అధికార బీజేపీ ఎంపీలు ఆమెకు మద్దతుగా నిలుస్తూ.. కరతాళ ధ్వనులు చేశారు. ఈ క్రమంలో సంస్కృతంలో ప్రమాణం చేసిన స్వాధీ ‘భారత్‌ మాతా కీ జై’ అంటూ చివర్లో నినాదించారు. 

మరిన్ని వార్తలు