ప్రజ్ఞాకు ఈసీ నోటీసులు

21 Apr, 2019 04:23 IST|Sakshi

భోపాల్‌: మాలేగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలు, భోపాల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌కు ఎలక్షన్‌ కమిషన్‌ శనివారం నోటీసులు జారీ చేసింది. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన ఐపీఎస్‌ అధికారి హేమంత్‌ కర్కరేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులిచ్చింది. ప్రజ్ఞాతో పాటు బీజేపీ భోపాల్‌ యూనిట్‌ అధ్యక్షుడు వికాస్‌ విరానీకి నోటీసులు ఇచ్చినట్లు భోపాల్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుదామ్‌ చెప్పారు. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ప్రజ్ఞా వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించామని, దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ (ఏఆర్‌వో) ను కోరామన్నారు. శనివారం ఉదయం ఆయన ఈ నివేదికను అందించారని.. దీనిపై ప్రజ్ఞా, వికాస్‌లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఏఆర్‌వో ఇచ్చిన నివేదికను ఎలక్షన్‌ కమిషన్‌కు పంపనున్నామని వెల్లడించారు. కాగా, గురువారం భోపాల్‌లో బీజేపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ప్రజ్ఞామాట్లాడుతూ.. తన శాపం వల్లనే హేమంత్‌ చనిపోయారని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు