లోక్‌సభలో ప్రజ్ఞా వివాదస్పద వ్యాఖ్యలు

27 Nov, 2019 20:06 IST|Sakshi

న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజ్ఞా లోక్‌సభలో మాట్లాడుతూ.. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించారు. అయితే ప్రజ్ఞా వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. వివరాల్లోకి వెళితే.. బుధవారం లోక్‌సభలో ఎస్పీజీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ రాజా మాట్లాడుతూ.. మహాత్మా గాంధీని ఎందుకు చంపాడనే దానిపై నాథురామ్ గాడ్సే చేసిన ప్రకటనను  ఉదహరించారు. ఈ సమయంలో రాజా ప్రసంగానికి ప్రజ్జా అడ్డుతగిలారు. ‘దేశభక్తి గురించి మీరు సలహాలు ఇవ్వకండి’ అంటూ వ్యాఖ్యానించారు. 

ప్రజ్ఞా వ్యాఖ్యలతో లోక్‌సభలో ఒక్కసారిగా గందరగోళం చోటుచేసుకుంది. ఆమె వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. దీంతో బీజేపీ సభ్యులు కూడా ప్రజ్ఞాను తన స్థానంలో కూర్చోవాల్సిందిగా సూచించారు. అనంతరం ప్రజ్ఞా వ్యాఖ్యలను స్పీకర్‌ రికార్డుల నుంచి తొలగించారు. గతంలో కూడా ప్రజ్ఞా.. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. విపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడం, బీజేపీ సైతం ప్రజ్ఙా వ్యాఖ్యలకు మద్దతుగా నిలవకపోవడంతో అప్పుడు ఆమె క్షమాపణ చెప్పారు.

కాగా, రాజా మాట్లాడుతూ.. మహాత్మా గాంధీపై 32 ఏళ్లుగా తాను కోపం పెంచుకున్నానని, అందుకే ఆయన్ని చంపానని గాడ్సే ఒప్పుకున్నాడని  రాజా చెప్పారు.  భద్రత అనేది రాజకీయ కారణాలతో కాదని.. వారికి ఉన్న బెదిరింపులను బట్టి కల్పించాల్సి ఉంటుందని, మాజీ ప్రధానులు ఎస్పీజీ భద్రతను తొలగించడంపై హోం మంత్రి అమిత్‌ షా పునరాలోచించాలని కోరారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా