ప్రజలకు భరోసా కల్పించడమే నా సంకల్పం

9 Jan, 2019 08:44 IST|Sakshi

చరిత్రాత్మక ప్రజాసంకల్పయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్‌ వద్ద బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు..
ఆయన ఏమన్నారంటే..

యుద్ధం నారాసురుడు ఒక్కడితోనే కాదు..

  • ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పాలించాలనేది నాకున్న సంకల్పం. నా పాలన చూసి.. నాన్న ఫోటోతోపాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలన్నది నా ఆశ . నవరత్నాలను ప్రతి ఇంటికీ చేర్చి.. వాటి మేలును ప్రతి ఒక్కరికీ చెప్పండి. అవి జనంలోకి తీసుకెళితే.. చంద్రబాబు నాయుడు ఎంత డబ్బులిచ్చినా.. ప్రజలు ఓటు వేయరు. ఈ 14 నెలలు పేదవాడితోనే ఉన్నాను. వారి కష్టాలు వింటూనే.. వారికి భరోసా ఇస్తూనే నడిచాను. ప్రతి పేద వాడికి మంచి చేయాలనే తపన ఉంది. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ బిడ్డకు తోడుగా ఉండమని, ఆశీర్వదించమని కోరుతున్నాను. ప్రజాసంకల్పయాత్ర ఇంతటితో ముగుస్తున్నా.. పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.
     
  • ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది. మనం యుద్దం చేసేది నారాసురుడి ఒక్కడితోనే కాదు ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేయాలి. జిత్తులు మారిన చంద్రబాబు అనేక పొత్తులు పెట్టుకుంటాడు. ప్రజల దీవెనలతో చంద్రబాబు మోసాలను, అన్యాయాలను జయిస్తా.

చిలుకా గోరింకలు తలదించుకునేలా..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 23 ఎమ్మెల్యేలను చంద్రబాబు సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు. ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేసి నలుగురిని మంత్రులుగా చేశారు. ప్రత్యేక హోదాను ఖూనీ చేసి.. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేశాడు. టీడీపీ ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా కొనసాగారు. నాలుగేళ్లు హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు బీజేపీని పొగిడారు. ప్రత్యేక హోదాను వెటాకారం చేస్తూ అసెంబ్లీలో మాట్లాడారు. హోదా కోసం పోరాడితే జైల్లో పెట్టిస్తానని అంటారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని హోదా కోసం మాట్లాడేవారిని ప్రశ్నించారు. చిలుక, గోరింకలు తలదించుకునేలా టీడీపీ, బీజేపీ ప్రేమ కొనసాగింది. ఎన్నికలు వచ్చేటప్పటికీ రంగులు మారుస్తున్నారు. ఎన్నికలకు మూడు నెలలు ముందే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తారు. ఎన్నికల దగ్గరకు వచ్చే సమయానికి రాష్ట్ర సమస్యలను వదిలేసి మీడియా మేనేజ్‌మెంట్‌ చేస్తున్నారు. ప్రజలకు ఏం చెయ్యకపోయినా.. చేసినట్లు ఎల్లో మీడియా గ్లోబెల్‌ ప్రచారం చేస్తుంది.

చెడిపోయిన రాజకీయ వ్యవస్థని మార్చాలంటే..
చెడిపోయిన రాజకీయ వ్యవస్థని మార్చాలంటే జగన్‌కు మీ అందరి దీవెనలు కావాలి. రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తాం. కలెక్టర్లు ఏడు నియోజకవర్గాలకే బాధ్యుడిగా ఉంటే.. ప్రజలకు అందుబాటులో ఉంటారు. కలెక్టర్ల వ్యవస్థను పూర్తిగా ప్రజల వద్ద తెచ్చేందుకు ఏపీలో 13 జిల్లాల స్థానంలో 25 జిల్లాలను ఏర్పాటుచేస్తాం. సమస్యలు పరిష్కరించేందుకు గ్రామ సచివాలయాలు ఏర్పాటుచేస్తాం. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామానికి చెందిన పది మందికి ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను గుర్తించేటప్పుడు.. పార్టీలను చూడం. అర్హత ఆధారంగానే లబ్ధిదారులను గుర్తిస్తాం. ప్రతి గ్రామంలోనూ 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటరీగా నియమిస్తాం. గ్రామ వాలంటీర్లకు రూ. 5వేల చొప్పున జీతాలు ఇస్తాం. ప్రతి ప్రభుత్వ పథకం మీ ఇంటికి వచ్చేవిధంగా చూస్తాం. రేషన్‌ బియ్యం సైతం డోర్‌ డెలివరీ చేస్తాం. 

జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా..

  • గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా రాజ్యం నడుస్తుంది. రేషన్‌కార్డు, ఇల్లు సహా.. చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదైనా మంజూరు చేయాలంటే మీరు ఏ పార్టీ వారని అడుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందురులో పెన్షన్‌కోసం వృద్ధులు కోర్టుకు వెళ్లే దారుణమైన పరిస్థితి నెలకొంది. గ్రామ స్వరాజ్యం లేని జన్మభూమి కమిటీలను నడుపుతున్నారు.

అంబులెన్స్‌ లేక.. గర్భిణీ బస్సులోనే ప్రసవించారు

  • విజయనగరం జిల్లా గరివిడి మండలంలో ఓ ఘటన నాకు ఎదురైంది. గర్భిణీ పురిటి నొప్పులు వస్తున్నాయని ఫోన్‌ చేస్తే.. టైర్‌ పంక్చర్‌ అయిందని 108 సిబ్బంది చెప్పారు. అంబులెన్స్‌ లేకపోవడంతో ఆ గర్భిణీ బస్సులోనే ప్రసవించారు.
     
  • రాష్ట్రంలో పేదవాడికి వైద్యం అందడం లేదు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. ఉద్దానంలో 4వేల మంది కిడ్నీ బాధితులుంటే.. ప్రభుత్వం 1400 మందికి మాత్రమే సాయం చేస్తుంది. 370 మందికి మాత్రమే పెన్షన్లు అందుతున్నాయి. డయాలసిస్‌ పేషెంట్‌లకు ముష్టి వేసినట్లు 2500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. 

బినామీలో కోసం విద్యారంగాన్ని బాబు నాశనం చేశాడు

  • కవిటి మండలంలో అమ్మాయిలు చదివే జూనియర్‌ కాలేజీల్లో బాత్‌రూమ్‌లు లేకపోవడం దారుణం. చంద్రబాబు తన బినామీల కోసం విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబు ముక్యమంత్రి అయ్యాక ఆరువేల ప్రభుత్వ పాఠశాలలు మూయించివేశారు. ఎస్సీ, బీసీ, ఎస్టీల హాస్టళ్లను మూసివేయించారు. మధ్యాహ్న భోజన పథకానికి ఆరు నెలలుగా బిల్లులు చెల్లించలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలానికి చెందిన గోపాలన్న నన్ను కలిశారు. అక్కడ ఫ్లెక్సీలో ఉన్న వ్యక్తి తన కొడుకు అని, తాను ఫీజులు కట్టలేకపోవడంతో ఇంజినీరింగ్‌ చదువుతున్న తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.

డ్వాక్రా మహిళలను కోర్టు మెట్లు ఎక్కించారు..

  • విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలను కోర్టు మెట్లు ఎక్కించారు. డ్వాక్రా సంఘాల మహిళలపై బ్యాంకు సిబ్బంది దాడులు చేస్తున్నారు. వడ్డీలు కట్టేందుకు అక్కాచెల్లమ్మలు తాళిబోట్లు తాకట్టు పెట్టే దుస్థితి నెలకొంది. 2016 నుంచి డ్వాక్రా సంఘాల వడ్డీలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది.

ఉద్యోగాలు లేవు.. ఉన్న ఉద్యోగాలు గోవిందా..

  • చంద్రబాబు హయంలో ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి లేదు. నిరుద్యోగ యువత నిరాశలో ఉన్నారు. బాబు వచ్చాడు కానీ.. జాబు రాలేదని నిరుద్యోగులు నన్ను కలిశారు. విభజన సమయానికి లక్షా 42వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో 90వేల మేర ఖాళీలు ఏర్పడ్డాయి. మొత్తం దాదాపు 2లక్షల 20వేల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగాన్ని కుడా భర్తీ చేయలేదు.
  • 30వేల ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా.. గృహ నిర్మాణ శాఖలో 3500మంది ఉద్యోగాలు గోవిందా.. గోపాలమిత్ర ఉద్యోగాలు గోవిందా.. ఆయూష్‌లో పనిచేస్తున్న 30వేల మంది ఉద్యోగాలు గోవిందా.. మధ్యాహ్నం భోజనం పథకంలో పనిచేస్తున్న 85వేల మంది ఉద్యోగాలు గోవిందా..

బెంగళూరులో కాఫీ.. చెన్నైలో ఇడ్లీ సాంబార్‌..!

  • రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంటే.. చంద్రబాబు మాత్రం రాజకీయాలే ముఖ్యమనుకుంటున్నారు. జాతీయ రాజకీయాలంటూ చంద్రబాబు బెంగళూరుకు వెళ్లి.. కుమారస్వామితో కాఫీ తాగారు. కానీ కర్ణాటక పక్కనే ఉన్న అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి ఆయనకు గుర్తుకురాలేదు. మరోవైపు చంద్రబాబు  చెన్నై వెళ్లి స్టాలిన్‌తో ఇడ్లీ సాంబార్‌ తిన్నారు. కానీ పక్కనే ఉన్న తన సొంత జిల్లా చిత్తూరు రైతుల గురించి ఆయన పట్టించుకోరు. విమాన చార్జీలు ప్రభుత్వమే భరిస్తోంది కదా అని ఆయన పశ్చిమ బెంగాల్‌ వెళ్లి మమతను కలుస్తారు. కానీ, ఆయనకు రాష్ట్రంలోని రైతుల దుస్థితి కనిపించడం లేదు.
     
  • వైఎస్సార్‌ హయాంలో ఏపీలో 42.70 లక్షల హెక్టార్ల పంటసాగు ఉంటే..చంద్రబాబు హయాంలో 40 లక్షల హెక్టార్లకు పడిపోయింది. అందుకే ఏపీలో పర్జలు చంద్రబాబును ‘నిన్ను నమ్మం బాబు’ అంటున్నారు. నాబార్డ్‌ నివేదిక ప్రకారం దేశంలోనే రైతు అప్పుల విషయంలో ఏపీ రెండో స్థానంలో ఉంది. రుణమాఫీ పేరుతో చద్రబాబు చేసిన దగాకు వడ్డీలు పెరిగిపోయి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వడ్డీలేని రుణాలు కూడా రైతులకు అందడం లేదు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. తన హెరిటేజ్‌ కోసం చంద్రబాబు దళారీలకు కెప్టెన్‌ అయ్యారు. రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి.. మూడింతలు ధరలు పెంచి తన హెరిటేజ్‌లో చంద్రబాబు అమ్ముతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకు తెరవలేదు. పలాస జీడిపప్పు రైతులు కేజీ 650 రూపాయలకు కూడా అమ్ముకోలేకపోతున్నారు. చంద్రబాబు మాత్రం హెరిటేజ్‌లో జీడిపప్పు కిలో 1100 రూపాయలకు అమ్ముతున్నారు. 

రైతు శివన్న గురించి..

  • అనంతపురంలో శివన్న అనే రైతు కలిశారు. శివన్న పొలంలో వేరుశనగ వేశానని చెప్పాడు. పంట ఎలా ఉందని అడిగితే.. బాబు రాగానే కరువు వచ్చిందన్నారు. అనంత పర్యటనకు చంద్రబాబు వచ్చినప్పుడు సాయం అడిగామన్నారు. కరువుతో ఎండిపోతున్నాం సాయం చేయమంటే.. చంద్రబాబు అయ్యో నాకు కరువు గురించి తెలియదు అని అధికారులపై మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో  వ్యవసాయం కుదేలైన పరిస్థితిని కళ్లకు కట్టేలా శివన్న చెప్పారు. రెయిన్‌ గన్‌లతో ప్రభుత్వం రైతులను మభ్యపెట్టిన తీరును శివన్న నాకు వివరించారు. అందుకే రైతులు నిన్న నమ్మం బాబు అంటున్నారు.

ప్రజల గుండె చప్పుడును నా గుండె చప్పుడుగా మార్చుకున్నా

  • పాదయాత్రలో ఎంతమందిని కలిశాం.. ఎంతమందికి భరోసా ఇచ్చామన్నదే ముఖ్యం
  • నాలుగున్నరేళ్లలో బాబు పాలన ఎంత ఘోరంగా ఉందో ప్రజలు చెప్పారు.
  • కరువు, నిరుద్యోగం వీటికి తోడు చంద్రబాబు మోసం ప్రజల పాలిట శాపంగా మారింది.
  • ప్రజాసంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను.
  • ప్రజల గుండె చప్పుడును నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను. 
  • 14 నెలలుగా 3648 కిలోమీటర్లు నేను నడిచినా.. నడిపించింది ప్రజలు.. పైనున్న దేవుడు.

ఇచ్ఛాపురం: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చాపురం పాత బస్టాండ్‌ బహిరంగ సభ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఇడుపులపాయలోని దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్‌ ఘాట్‌) నుంచి 2017 నవంబర్‌ 6వ తేదీన జననేత చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. మొత్తం 341 రోజుల పాటు సాగిన ప్రజాసంకల్పయాత్ర.. 134 నియోజకవరాగలు, 231 మండలాలు, 2,516 గ్రామాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల గుండా సాగింది. జననేత 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఇప్పటివరకు 123 సభల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.. పాదయాత్రలో అఖరి బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. 

ఇచ్ఛాపురం: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయసంకల్ప స్తూపాన్ని అవిష్కరించారు.  అక్కడి ఆయన ఇచ్ఛాపురం పాత బస్టాండ్‌ వద్ద జరిగే సభాస్థలికి బయలుదేరారు. ఇప్పటికే లక్షలాది మందితో సభాస్థలి కిక్కిరిసింది. జై జగన్‌ నినాదాలతో ఆ ప్రాతమంతా మారుమోగుతోంది.

ఇచ్ఛాపురం: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయసంకల్ప స్తూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న సర్వమత ప్రార్థనల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఇచ్ఛాపురం చేరుకున్న అశేష ప్రజానీకం అడుగడుగునా వైఎస్‌ జగన్‌కు నీరాజనం పలుకుతున్నారు.


ఇచ్ఛాపురం: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్ఛాపురంలోని విజయసంకల్ప స్తూపాన్ని అవిష్కరించే క్షణం కోసం జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇచ్ఛాపురంతోపాటు పరిసర ప్రాంతాల్లో జనసందోహం నెలకొంది. 16వ నెంబర్‌ జాతీయరహదారి కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు. పైలాన్‌ వద్దకు వైఎస్‌ జగన్‌ రాకకోసం లక్షలాది మంది జనం ఎదురు చూస్తున్నారు. ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాలు జగన్‌ నినాదాలతో మారుమోగుతున్నాయి.

ఇచ్ఛాపురం: బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన విజయసంకల్ప స్థూపం (పైలాన్‌)ను ఇచ్ఛాపురంలో కాసేపట్లో వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున అక్కడికి తరలివచ్చారు. పైలాన్‌ను వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించే అపురూప క్షణాల కోసం తామంతా వేచిచూస్తున్నామని వైఎస్సార్‌ సీపీ నాయకులు తెలిపారు. స్థూపాన్ని ఆవిష్కరించిన తర్వాత కాలినడకన పాత బస్టాండ్‌ వద్దకు చేరుకుని భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు.

తిరుపతి: వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైన సందర్భంగా యువజన విభాగం నేత భూమన అభినయ రెడ్డి నేతృత్వంలో తిరుపతిలోని అలిపిరి వద్ద పార్టీ శ్రేణులు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కుసుమ కుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నేతలు ఇమామ్, రాజేంద్ర, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు: వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు నేపధ్యంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. వైఎస్ సర్కిల్లో దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాజా విష్ణు వర్దన్ రెడ్డి, నరసింహులు యాదవ్, తెర్నకల్ సురేందర్ రెడ్డి, రెహమాన్, మద్దయ్య, మున్నా తదితరులు పాల్గొన్నారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా పాణ్యం నియోజకవర్గంలోని షరీన్ నగర్లో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు విశ్వేశ్వర్‌ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, ఫిరోజ్, బెల్లం మహేశ్వర రెడ్డి, సులోచన, శ్రీనివాసులు, విక్రమ్, డేవిడ్‌లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలతో అభిషేకం, కేక్ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.

అనంతపురం: వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు రాయదుర్గం మండలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి ఉడేగొళం మధ్యనేశ్వర స్వామి దేవాలయం వరకు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనయుడు కాపు ప్రవిణ్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూడేరు మండలం పి. నాగిరెడ్డిపల్లిలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. విడపనకల్లు మండలం డోనేకల్లులో వైస్సార్సీపీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.  

చిత్తూరు: ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు సందర్భంగా వైఎస్సార్‌ సీపీ నేతలు పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్, రాహుల్ రెడ్డి,లీనారెడ్డిలు, ఇతర కార్యకర్తలు గాంధీ సర్కిల్‌లో కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా, వైఎస్ జగన్‌కు సంఘీభావం తెలియచేస్తూ పీలేరు, కలికిరి, కలకడ, వైవి పాలెం,గుర్రంకొండ, వాల్మీకి పురం మండలాలలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

వైఎస్సార్: జిల్లాలోని ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైన సందర్భంగా సుండుపల్లి జెడ్‌పీటీసీ హకీం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైన సందర్భంగా రాయచోటి వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా బీసీ ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.  

అనంతపురం: వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా ఎస్‌ కే యూనివర్సిటీ సమీపంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు, ఆకుతోటపల్లి గ్రామస్థుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. 101 టెంకాయలు కొట్టి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.

నెల్లూరు: వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతమైన సందర్భంగా రూరల్ వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు పిండి సురేష్, బొబ్బల శ్రీనివాస్ యాదవ్, కాకి వెంకటేశ్వర్లు భారీ కేక్‌ను కట్ చేశారు. మూడు నెలల్లో రాజన్న రాజ్యం రాబోతోందని, జిల్లాలో కచ్చితంగా 10 సీట్లు గెలుస్తామని బొబ్బల శ్రీనివాస్ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా వైఎస్సార్ సీపీ విద్యార్ధి విభాగం నాయకులు విష్ణు వర్దన్ రెడ్డి, మేర్లపాక వెంకటేష్, సందీప్‌, రాజేష్, యశ్వంత్, బన్నీ,నాగరాజులు నాయుడుపేటలోని శ్రీ పోలేరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, 101టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.  

విజయనగరం: ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు విజయనగరం నుంచి  భారీగా జనం తరలి వస్తున్నారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు నెల్లిమర్ల వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త బడుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో నెల్లిమర్ల నియెజకవర్గం నుంచి భారీగా వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు.

ఇచ్ఛాపురం: వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్రగా బయలుదేరి లొద్దపట్టి చేరుకున్నారు. అక్కడ వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. వైఎస్సార్‌ సీపీ నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. జననేతతో కలిసి నడవటానికి పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు అక్కడకు చేరుకున్నారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్న దారులన్నీ జనసంద్రంగా మారాయి. 

వైఎస్సార్: వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా కడప జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, ఎమ్మెల్యే అంజాద్ బాషా, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్‌లు పాల్గొన్నారు.

గుంటూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం అయిన సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో 3648 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైన రోజు పాదయాత్ర విజయవంతం కావాలని స్వామివారికి మొక్కుకున్నారు. పాదయాత్ర విజయవంతం కావడంతో కార్యకర్తలు స్వామి వారికి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కు చెల్లించుకున్నారు.

చిత్తూరు:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు కేక్ కటింగ్‌, అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

ఇచ్ఛాపురం : విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు పాడేరు సమన్వయ కర్త విశ్వేశ్వర రాజు ఆధ్వర్యంలో గిరిజనులు భారీగా ఇచ్ఛాపురానికి తరలి వచ్చారు.పాడేరు, జీకే వీధి, జీ మాడుగుల, కొయ్యురు మండలాల నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు భూసరి క్రిష్ణా రావు, లకే రత్నభాయ్,కోడా సురేష్‌, గాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం : పెందుర్తి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయ కర్త అదీప్‌ రాజ్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు కారు ర్యాలీ ద్వారా ఇచ్ఛాపురానికి బయలుదేరారు.

జననేతకు జేజేలు
సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిన రాజన్న తనయుడికి జనం జేజేలు పలికారు. సాక్షి టీవీ కేఎస్సార్‌ లైవ్‌ షోలో పలువురు మాట్లాడుతూ... జననేతకు అభినందనలు తెలిపారు. పాదయాత్రతో వైఎస్‌ జగన్‌ చరిత్ర సృష్టించారని హైదరాబాద్‌కు చెందిన రాజ్యలక్ష్మి అనే మహిళ పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, కత్తితో దాడి చేసినా ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేయడం మామూలు విషయం కాదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర తర్వాత జనసమ్మోహనరెడ్డిగా మారిపోయారని విస్సన్నపేటకు చెందిన జయకర్‌ ప్రసంశించారు. ప్రజాసంకల్పయాత్ర విజయసంకల్పయాత్రగా మారడంలో ఎటువంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని కడపకు చెందిన డాక్టర్‌ రాజగోపాల్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.

చివరిరోజూ అదే ఉత్సాహం: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియా నుంచి చివరిరోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ ప్రారం​భించారు. జననేత వెంట నడిచేందుకు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిందరినీ చిరునవ్వుతో పలకరించి ముందుకు సాగారు. చివరిరోజు పాదయాత్ర మొదలు పెట్టడానికి ముందు వైఎస్‌ జగన్‌ వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. జననేత  పాదయాత్ర సాగుతున్న దారిలో యువత కోలాహలం కన్పిస్తోంది.

దారులన్నీ జనసంద్రం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌ కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్‌ ఘాట్‌) నుంచి 2017 నవంబర్‌ 6న వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర 341 రోజుల తర్వాత బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. జన నాయకుడి జైత్రయాత్రకు సంఘీభావంగా తరలివెళుతున్న జనంతో దారులన్నీ జనసంద్రంగా మారాయి.

మరిన్ని వార్తలు