అన్నొస్తున్నాడు..

13 Apr, 2018 06:53 IST|Sakshi

14 నుంచి జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర

జననేత రాక కోసం వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎదురుచూపులు

పాదయాత్ర విజయవంతానికి సిద్ధం

సాక్షి,అమరావతిబ్యూరో: రాష్ట్రంలో పెరుగుతున్న అవినీతి.. అధికార పార్టీ నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర జిల్లాకు వచ్చేస్తోంది. ఈ నెల 14 నుంచి జిల్లాలో యాత్ర ప్రవేశిస్తుంది. జిల్లాలో 20 రోజులకుపైగా కొనసాగే ఈ పాదయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జిల్లా స్థాయి నేతలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాలతోపాటు జిల్లాలోని మిగిలిన నియోజవర్గాల్లో పాదయాత్ర చురుగ్గా సాగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 14న గుంటూరు జిల్లా నుంచి వారధి మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తారు.

అక్కడ నుంచి  విజయవాడ నగరం మీదుగా మొదలయ్యే పాదయాత్ర  తొలివారం షెడ్యూల్‌  నూజివీడు నియోజకవర్గం వరకు కొనసాగుతుంది. పాదయాత్ర జిల్లాలోని కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వ పెద్దల పక్షపాత ధోరణిని ఎండగట్టేందుకు పార్టీ నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పాదయాత్ర, బహిరంగ సభలు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడిది తదితర ఏర్పాట్లలో జిల్లా స్థాయి నాయకులు తలమునకలయ్యారు. కృష్ణా జిల్లా పార్టీ పరిశీలకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాదయాత్ర విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు..

భరోసా కల్పించేలా..
నాలుగేళ్లగా పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి వందలాది మైళ్లు నడిచి వస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పల్లెలన్నీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాయి. మహానేత పాలనలో స్వర్ణయుగాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రజానీకం.. మరోసారి రాజన్న పాలన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మహానేత వారసుడిగా జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వం వహించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. జగన్‌ సీఎం అయితే నవరత్నాలతో పాటు సంక్షేమం వెల్లివిరుస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. తమ బతుకుల్లో సంతోషం చూడాలన్న జననేత సంకల్పం నెరవేరాలని పేదలు కోరుకుంటున్నారు.  ఆప్యాయత, అనురాగాలు జోడించి ఆయన అడుగుల్లో అడుగులు వేయాలని ఎదురు చూస్తున్నారు.

కార్యకర్తల్లో ఉత్సాహం.....
జిల్లాలో ప్రవేశించనున్న ప్రజా సంకల్ప యాత్రకు స్వాగతం పలికేందుకు నాయకులు ఏర్పాట్లు చేçస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వ పెద్దల వైఖరిని తూర్పారబట్టేందుకు జగనన్న వస్తున్నాడని నాయకులు ప్రచారం చేస్తుండగా.. పాదయత్ర కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపుతుంది.  కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు.

టీడీపీలో కలవరం
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర టీడీపీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తోంది. పాదయాత్ర యాత్ర అనంతరం టీడీపీ పునాదులు కదిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రత్యేకహోదా అంశంలో వైఎస్‌ఆర్‌ సీపీ వ్యూహానికి తలకిందులైన టీడీపీ నాయకులపై నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు