వీవీ ప్యాట్‌లపై హైకోర్టుకు! 

12 Dec, 2018 01:57 IST|Sakshi

కలిసి వెళ్లే ఆలోచనలో కూటమి పార్టీలు

నేటి కూటమి సమావేశంలో కోర్టుకు వెళ్లే అంశంపై నిర్ణయం 

ఉత్తమ్‌ లేదంటే భట్టిలకు శాసనసభాపక్ష నేత హోదా? 

సాక్షి, హైదరాబాద్‌: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను తారుమారు చేశారనే అనుమానంతో వీవీ ప్యాట్లతో అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్న ప్రజాకూటమి.. ఈ విషయంలో హైకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి కాంగ్రెస్‌ పార్టీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, కూటమి పక్షాన కలిసి కోర్టును ఆశ్రయించాలని కూటమి నేతలు యోచిస్తున్నారు. దీనిపై బుధవారం సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఓటర్ల జాబితా అవకతవకల నుంచి ఈవీఎం యంత్రాల నిర్వహణ వరకు ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై తమకు అనుమానాలున్నాయని మొదటి నుంచి చెబుతున్నామని, దీనిపై ఈసీ స్పందన కూడా అనేక అనుమానాలకు తావిస్తోందని టీపీసీసీకి చెందిన ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే సరైన మార్గమని భావిస్తున్నామని చెప్పారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఇప్పటికే న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్‌ ప్రక్రియ వీవీ ప్యాట్‌ల ద్వారా కొనసాగేంత వరకు కోర్టులో పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. కోర్టుకు ఎప్పుడు వెళ్లాలన్నది కూటమి నేతలంతా కలిసి నిర్ణయిస్తారని తెలిపారు.  

15 లేదా 16న సీఎల్పీ సమావేశం.. 
కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ఈ నెల 15 లేదా 16 తేదీల్లో జరగనుంది. తెలంగాణతోపాటు ఎన్నికలు జరిగిన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. దీంతోపాటు పార్లమెంట్‌ సమావేశాలు కూడా జరుగుతున్నందున పార్లమెంటుకు సెలవు రోజులైన శని, ఆదివారాల్లో కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి నేతలు వచ్చి సీఎల్పీ సమావేశాన్ని నిర్వహిస్తారని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. సీఎల్పీ నేతగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి లేదా ప్రచార కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్కలలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ పదవీ కాలం ఈ నెలలోనే నాలుగేళ్లు అవుతున్నందున ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలనుకుంటే సీఎల్పీ నేతగా అవకాశమివ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. లేదంటే ప్రచార కమిటీ చైర్మన్‌ హోదాలో ఎన్నికలను ఎదుర్కొన్న భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం మీద ఉత్తమ్, భట్టిలలో ఒకరు టీపీసీసీ అధ్యక్షుడు, మరొకరు సీఎల్పీ నేతగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

సీఈసీ స్పందించకపోతే కోర్టుకు: కుంతియా 
వీవీ ప్యాట్‌లపై కోర్టుకు వెళ్లే విషయమై ఉత్తమ్‌తోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా స్పందించారు. ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారుల సహకారం, డబ్బు బలంతోనే కేసీఆర్‌ విజయం సాధించారని, ఈవీఎంలను తారుమారు చేశారని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, సీఈసీ తమ ఫిర్యాదుపై స్పందించని పక్షంలో కోర్టుకు వెళతామని చెప్పారు. 

మరిన్ని వార్తలు