కూటమికి చంద్ర'గ్రహణమే'!

12 Dec, 2018 05:03 IST|Sakshi

ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్‌

బాబు కారణంగానే ఓడామంటూ విమర్శలు

ఘోరపరాజయంపై పార్టీలో అంతర్మథనం

బాబు ప్రచారం చేసిన చోట్ల పరాభవం

హైదరాబాద్‌ శివార్లలో టీడీపీ గల్లంతు  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల షాక్‌ నుంచి కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాకూటమి తేరుకోలేకపోతోంది. ‘అంతా బాగుందన్న పరి స్థితుల్లో.. ఎక్కడ దెబ్బతిన్నాం?’ అన్న ప్రశ్నే వారికి తొలిచివేస్తోంది. ‘ఎవరైనా ఓడించారా? ఒక తప్పుడు నిర్ణయంతో మనల్ని మనమే ఓడించుకున్నామా?’ అనే అంతర్మథనం సాగుతోంది. గట్టి పోటీ ఇవ్వడం నుంచి.. ఒక దశలో గెలుస్తామని భావించిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతినడమే వారి షాక్‌కి ప్రధాన కారణం. అయిదో వంతు కూడా రాని సీట్లతో.. సంఖ్యా పరంగానే కాకుండా ఎలా చూసినా ఇది మింగుడు పడని ఓటమే! ప్రాంతాలుగా గమ నించినా, జిల్లాలుగా విశ్లేషించుకున్నా, సామాజిక వర్గాలుగా లెక్కేసుకున్నా... ప్రజా కూటమిది మహాఓటమి. పాలకపక్షం టీఆర్‌ఎస్‌ జోరుకు విపక్ష కూటమి కకావికలైంది. ఇంతటి ఘోర పరాజయానికి కారణాల అన్వేషణ మొదలైంది. కూటమిని బలోపేతం చేస్తుందనుకున్న తెలుగుదేశంతో పొత్తు, ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర తమను నిలువునా ముంచిందనే భావన పార్టీ నేతల్లో వ్యక్తమౌతోంది. ఫలితాల సరళి కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తోంది. టీడీపీకి తెలంగాణలో ఇంకా బలముందని, ఆంధ్ర ఓటర్లు ఆదరిస్తారను కున్నా.. వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ కూటమికి పెద్ద దెబ్బే తగిలింది. శివారు రంగారెడ్డి నియోజకవర్గాల్ని కలుపుకొని ఉండే హైదరాబాద్‌ మహానగర్‌ ఫలితాలే ఇందుకు నిదర్శనం. 

ఖమ్మం టు శేరిలింగంపల్లి
ఆయన కట్టానని చెప్పుకున్న ‘సైబరాబాద్‌’ లోని సైబర్‌టవర్స్‌ ఉన్న శేరిలింగంపల్లితో సహా.. బాబు రోడ్‌షోలు, సభలు పెట్టిన చోటల్లా కూటమికి ఓటమి తప్పలేదు. ఖమ్మం పట్టణం నుంచి కుత్బుల్లాపూర్‌ వరకు ఆయన సాగించిన ప్రచార ప్రస్థానంలో అంతటా ఓటమే. ఇలాం టిదేదో జరుగుతుందనే అభిప్రాయం కాంగ్రెస్‌లోనూ కొందరికి ముందు నుంచే ఉంది. కానీ, బహిరంగంగా చెప్పలేక పోయారు. ఆర్థికవనరులు సమకూర్చే కారణం చూపి,  రాహుల్‌గాంధీనే చంద్రబాబు బుట్టలో పడేయ డంతో.. కింది స్థాయిలో వ్యతిరే కత ఉన్నా బయ టకు చెప్పలేకపోయారు. టీడీపీతో మనం జట్టు కట్టడం వల్ల లాభపడకపోగా నష్టపోతా మనే బల మైన అభిప్రాయముండి కూడా తామేమీ చేయలేక పోయామని ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితం అనుభవిస్తున్నామనే బాధ ఎక్కువ మంది కాంగ్రెస్‌ వాదుల్లో వ్యక్తమౌతోంది. ముఖ్య నేతలు ఓడిపోవడం పార్టీ శ్రేణులనూ నిరాశలోకి నెట్టింది.

బాబొక చెల్లని రూపాయి
సమకాలీన రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోయిన నాయకుడిగా చంద్రబాబుకున్న పేరు.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు వచ్చిన సానుకూలతను, కూటమి విజయావకాశాల్ని దెబ్బతీసింది. ‘ఇంకా బాబు  పెత్తనమా? ఇక రాష్ట్రం ముందుకెళ్లనట్లే’ అనే నిర్లిప్తత తెలంగాణ సగటు పౌరుల్లో ఈ పొత్తుతోనే మొదలైంది. బలమైన కారణాలు లేకుండా అసెంబ్లీని రద్దుచేసి కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లడం, ఒకే విడతలో 105 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఖరారు చేయడం తమకు అనుకూలిస్తోందని కాంగ్రెస్‌ ఉత్సా హంతో ఉన్న సమయంలో.. టీడీపీ వారితో జట్టు కట్టింది. ఈ అంశాన్ని తెలంగాణ సమాజం జీర్ణించు కోలేకపోయింది. ప్రసార మాధ్యమాల్లో ప్రచారం, బద్ధ వ్యతిరేకులతో కలవడం ద్వారా కూటమికి ప్రచారం వచ్చినా.. ప్రతి కూలించిన అంశాలే ఎక్కువ. నిర్దిష్టంగా కాంగ్రెస్‌ను తిట్ట డానికి ఏమీ లేని స్థితిలో కేసీఆర్‌కు చంద్రబాబు ఒక గొప్ప అవకాశంలా దొరి కారు. తన ప్రసంగాల్లోనూ సంక్షేమ, అభివృద్ది అంశాలతోపాటు.. చంద్రబాబుపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ‘బాబు ఎక్కడ కాలు పెట్టినా అంతే సంగతులు’,  ‘కాళేశ్వరం కావాలా? శనేశ్వరం కావాలా? మీరే తేల్చుకొండ’ంటూ కేసిఆర్‌ వేసిన ప్రశ్న జనంలో ఆలోచనల్ని రేకెత్తించింది. 

పరాకాష్టకు చేరింది..
దేశంలోనే అతిపెద్ద అవినీతి పరుడుగా విమర్శల నెదుర్కొంటున్న బాబుతో చేతులు కలపడం వల్లే కాంగ్రెస్‌ అవకాశాలు మరింత సన్నగిల్లాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇక, హైదరాబాద్‌ను తానే ప్రపంచ పటంలోకి తెచ్చానని, సైబర్‌సిటీ కట్టానని, చివరకు దివంగత సీఎం వైఎస్సార్‌ ఆలోచన అయిన ఔటర్‌ రింగు రోడ్డు అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌హైవే వంటివీ తానే తెచ్చానని చంద్రబాబు రాహుల్‌ గాంధీ సమక్షంలోనే చెప్పుకోవడం పరాకాష్ట. ఏపీలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల్ని పార్టీ మార్పించి, అందులో కొందరికి మంత్రిపదవులిచ్చి ఎన్ని విమర్శలొచ్చినా కిమ్మనని బాబు, ఇక్కడ అలా పార్టీ మారినవారందరినీ ఓడించమని పిలుపునివ్వడం చూసి ప్రజలు కేసీఆర్‌ ఆరోపణల్ని గట్టిగా నమ్మి కూటమిని తిరస్కరించారు. 

ఒకటొకటిగా బయటపడ్డ కుట్రలు..
‘ఏపీలో వ్యవస్థల్ని కుప్పకూల్చి, ప్రజల్ని వంచించి దోచుకొచ్చిన రూ. వందల కోట్ల ధనాన్ని ఇక్కడ కుమ్మరిస్తున్నారు తస్మాత్‌ జాగ్రత్త’ అంటూ ఇక్కడి అధికార పార్టీ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అది నిజమే అనిపించేలా, ప్రచారంతో సహా ఎన్నికల ఖర్చంతా తామే భరిస్తున్నట్టు, ప్రచారానికి హెలికాప్టర్లనూ తమ నేతే సమకూరుస్తున్నట్టు, కాంగ్రెస్‌లో కొందరు అభ్యర్థుల్నీ.. బాబే ఖరారు చేస్తు న్నట్టు ఆయన వర్గీయులు, అనుకూల మీడియా సంకేతాలు ఇచ్చింది. తెలంగాణలో ప్రభుత్వపు ఒంటెత్తుపోకడ నచ్చక, కాంగ్రెస్‌ వైపు ఏకీకృతం కావాలని భావించిన ఒకట్రెండు బలమైన సామాజిక వర్గాలు కూడా బాబు ‘ఆధిపత్యం’ కారణంగా.. కూటమికి దూరమయ్యారు. సర్వేల పేరుతో కొందరు చేసిన నానా యాగీ, బాబుకు అనుకూలంగా పనిచేసే కొన్ని ప్రసారమాధ్యమాలు ఉన్నవీ లేనివీ కల్పించి ప్రజాక్షేత్రంలో సృష్టించిన ‘అయోమయం’ కాంగ్రెస్‌ వర్గీయుల్లో లేని భ్రమల్ని కల్పించింది. నందమూరి వంశీయుల్ని తన ఎదుగుదలకు వాడుకునే తత్వంతో చంద్రబాబు వేసిన ఓ చౌకబారు ఎత్తుగడ కూడా ఫలించలేదు. 

మరిన్ని వార్తలు