ప్రజా సంకల్ప యాత్ర రేపు పునఃప్రారంభం

11 Nov, 2018 04:07 IST|Sakshi

విజయనగరం జిల్లా మక్కువ నుంచి జనంతో మమేకం 

ఇప్పటిదాకా 3,211.5 కిలోమీటర్లు నడిచిన వైఎస్‌ జగన్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ 17 రోజుల విరామం అనంతరం ఈ నెల 12 నుంచి ప్రజా సంకల్ప యాత్రను పునఃప్రారంభించబోతున్నారు. హైదరాబాద్‌ నుంచి ఆయన 11న బయలుదేరి అదే రోజు రాత్రికి పాదయాత్ర శిబిరానికి చేరుకుంటారు. మరుసటి రోజు సోమవారం ఉదయం నుంచి పాదయాత్రను కొనసాగిస్తారు. విశాఖపట్టణం విమానాశ్రయంలో గత నెల 25వ తేదీన జగన్‌పై హత్యాయత్నం జరిగాక హైదరాబాద్‌లో చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇవ్వడంతో పాదయాత్రకు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే.

జగన్‌ గాయం నుంచి కోలుకోవడంతో పాదయాత్రకు బయలు దేరనున్నారు. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో గత ఏడాది నవంబర్‌ 6వ తేదీన ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించిన జగన్‌.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు యాత్ర కొనసాగుతుందని ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ నుంచి పాదయాత్ర పునఃప్రారంభం అవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

11 జిల్లాల్లో యాత్ర పూర్తి 
వైఎస్‌ జగన్‌ ఇప్పటి వరకు వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్టణం జిల్లాల్లో  ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేశారు. అనంతరం విజయనగరం జిల్లా శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసి సాలూరు నియోజకవర్గంలో ఉన్నారు. ఈ జిల్లాలో ఇంకా పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలు మిగిలి ఉన్నాయి. ఇవి పూర్తయ్యాక చివరి జిల్లాగా శ్రీకాకుళంలో ప్రవేశిస్తారు. ఏడాదిగా మొత్తం మీద జగన్‌ 3,211.5 కిలోమీటర్ల దూరం నడిచారు.

>
మరిన్ని వార్తలు