ప్రకాశంలో  జగన్నినాదం..

19 Mar, 2019 08:10 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాజకీయ ఉద్ధండులను  రాష్ట్రానికి  అందించిన ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల పోరు వన్‌సైడ్‌ వార్‌గా మారిందనే చెప్పవచ్చు. జిల్లాలో ఒక్క సీటుతో మొదలైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  ప్రస్థానం ఎనిమిదేళ్లలో క్లీన్‌ స్వీప్‌ చేసే విధంగా మారింది. జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అత్యధికంగా 6 సీట్లు కైవసం చేసుకోగా టీడీపీ 5 సీట్లకే పరిమితమైంది. నవోదయం పార్టీ ఎమ్మెల్యేగా ఒకరు గెలిచారు.

ఈ సారి సీనియర్‌ నాయకులతో పాటు, యువనాయకులు భారీగా వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రతో ప్రజలకు చేరువకావడం, ఆయన ప్రకటించిన ‘నవరత్నాలు’ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి బాటలు వేసేవిలా ఉండడంతో జనం  వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపారు. దీంతో జిల్లాలో వైఎస్సార్‌సీపీ పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న టీడీపీ నాయకులు సైతం పోటీ చేయడానికి జంకుతున్న పరిస్థితి నెలకొంది.

జిల్లా వ్యాప్తంగా పట్టున్న మాగుంట శ్రీనివాసులరెడ్డి, సీనియర్‌ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మానుగుంట మహీధరరెడ్డి లాంటి నాయకులు పార్టీకి మరింత ఉత్తేజం తీసుకువచ్చారు. ప్రజాక్షేత్రంలో ఉండే ఆమంచి కృష్ణమోహన్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబులు కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. విద్యావంతులుగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్‌ లాంటి నాయకులు పార్టీలో చేరడం కలిసొచ్చే అంశం. ఈ ఎన్నికల్లో 12 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉండగా టీడీపీ నైరాశ్యంలో ఉంది.

తెలుగుదేశం పార్టీ అధికారంలో  ఉన్న ఐదేళ్లల్లో నీటి ప్రాజెక్టులతో పాటు మిగిలిన అభివృద్ధి పనులు నిలిచి పోయాయి. వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోవడంతోపాటు రామాయపట్నం పోర్టు కేవలం శిలాఫలకానికే పరిమితమైంది. తాగునీరు, కిడ్నీ బాధితుల సమస్యలు పట్టించుకోకపోవడంతోపాటు ఉద్యాన కళాశాల,ట్రిపుల్‌ఐటీ ఏర్పాటు కాగితాలకే పరిమితమయ్యాయి. ఎన్నికలలో ఇచ్చిన హామీలు  నేరవేర్చక పోవడంతో  చంద్రబాబు సర్కార్‌పై ప్రజలలో తీవ్ర వ్యతిరేక వచ్చింది. దీంతో ప్రకాశంలో ప్రజల మద్దతుతో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ దిశగా పయనించే పరిస్థితులు ఉన్నాయి. 

వంచించిన చంద్రబాబు
ఎన్నికల సమయంలో వందలాది హామీలిచ్చిన చంద్రబాబు అధికార పీఠమెక్కాక హామీలను గంగలో కలిపారు. ప్రధానంగా వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టు పూర్తి.. ఫ్లోరైడ్‌కు సమస్యకు పరిష్కారం.. రామాయపట్నం పోర్టు తదితర హామీలిచ్చారు.ఇంకా కనిగిరి, దొనకొండలలో  పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలు.. మైనింగ్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తానని చెప్పారు.  వీటిలో ఏఒక్క హామీని నెరవేర్చలేదు. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం ఉంది. ఒంగోలు, దర్శి, కొండేపి, కనిగిరి, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు అసెంబ్లీ స్థానాలు ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో  ఉండగా, సంతనూతలపాడు, పర్చూరు, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గాలు బాపట్ల పార్లమెంట్‌ పరిధిలో ఉన్నాయి. ఇక కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలో ఉంది.

ఓటర్ల వివరాలు
పురుషులు : 12,43,411  
మహిళలు : 12,51,823   
ఇతరులు :149   
మొత్తం :24,95,383

... ఒంగోలు నియోజకవర్గం 
మంత్రి పదవిని వదిలేసి, ప్రజలను ఇంటి మనుషులుగా చూసే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో నిలవగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ టీడీపీ తరపున బరిలో దిగుతున్నారు. బాలినేని నియోజకవర్గంలో పర్యటించి జగన్‌ నవరత్నాలతో పాటు  జగన్‌ ముఖ్యమంత్రి అయితే జరిగే అభివృద్ధిని ప్రజలకు వివరించారు. టీడీపీ అభ్యర్థి జనార్థన్‌ అబివృధ్ది పనులలో కమీషన్లు పుచ్చుకుని సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి.   

... కందుకూరు 
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా  మాజీ మంత్రి మహీధరరెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో వెఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు  టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీడీపీ నేత, ఎమ్మెల్యే దివి శివరాంతో విభేదాల కారణంగా వారు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. మహీధరరెడ్డి స్థానికంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటారనే నమ్మకం ప్రజల్లో ఉంది.  

...ఎర్రగొండపాలెం (ఎస్సీ)
పశ్చిమ ప్రకాశంలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో విద్యావంతుడైన ఆదిమూలపు సురేష్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. యర్రగొండపాలెంలో వైఎస్సార్‌సీపీ మరింత బలంగా ఉంది. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన డేవిడ్‌ రాజు ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు. అయితే టీడీపీ టికెట్‌ డేవిడ్‌ రాజుకు దక్కలేదు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా అజితారావ్‌ బరిలోకి దిగారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి సురేష్‌  గత నాలుగేళ్లు గా ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు.

... కనిగిరి 
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బుర్రా మధుసూధన్‌ యాదవ్‌ పోటీలో ఉండగా  తెలుగుదేశం పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కదిరి బాబూరావు కానీ, ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి కానీ బరిలోకి దిగే అవకాశముంది.  జిల్లాలో బీసీలకు సీటు కేటాయించాలని నిర్ణయించిన జగన్‌ గత ఎన్నికలలో బుర్రాకు సీటు కేటాయించారు. ఈ ఐదేళ్ల కాలంలో ప్రజా సమస్యల పై పోరాటం చేస్తూ ఉన్నారు. టీడీపీ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కదిరి బాబూరావు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం, స్థానిక సమస్యల గురించి పట్టించుకోకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.  టీడీపీ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారోనని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.

... పర్చూరు 
పర్చూరు నియోజకవర్గంలో  వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా  ఎన్టీఆర్‌ అల్లుడు, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేస్తుండగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.  రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా దగ్గుబాటికి మంచి పేరుంది.  సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న సాంబశివరావు దేవరపల్లి భూముల విషయంలో దళితులను ఇబ్బంది పెట్టడంతో వారు  ఆగ్రహంతో ఉన్నారు.  

... దర్శి 
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా విద్యావంతుడు, విద్యాసంస్థల అధినేత మద్దిశెట్టి వేణుగోపాల్‌ బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు తనయుడు సిద్దా సుధీర్‌ పోటీలో ఉండే అవకాశం ఉంది.  

... గిద్దలూరు  
వైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్నా రాంబాబు వైఎస్సార్‌సీపీ నుంచి బరిలో ఉన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి టీడీపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అశోక్‌ రెడ్డి సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదు.  వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి రాంబాబు అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లే  వ్యక్తిగా పేరుంది.  

... చీరాల
వైఎస్సార్‌సీపీ అభ్యర్థ్దిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి పోటీ చేస్తున్నారు. ఆమంచి అన్ని వర్గాలలో మంచి పట్టున్న నేత. టీడీపీలో పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడంతో చంద్రబాబు  కరణం బలరాంను అభ్యర్థిగా నిలిపారు. 

... అద్దంకి 
 వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సీనియర్‌ నాయకుడు బాచిన చెంచుగరటయ్య పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌  తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటిపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్సీ కరణం బలరాంతో వర్గ విబేధాలు ఉన్నాయి.  

... మార్కాపురం 
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి తనయుడు కుందూరు నాగార్జునరెడ్డి పోటీలో ఉండగా టీడీపీ అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి  పోటీ చేస్తున్నారు. నారాయణరెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.  

... కొండేపి (ఎస్సీ)
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత వైద్యులు వెంకయ్య పోటీలో ఉండగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి పోటీ చేస్తున్నారు. 

సంతనూతలపాడు(ఎస్సీ)
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా టీజేఆర్‌ సుధాకర్‌బాబు, టీడీపీ తరఫున విజయ్‌కుమార్‌ బరిలో ఉన్నారు.  

-బిజివేముల రమణారెడ్డి, సాక్షి ప్రతినిధి, ఒంగోలు 

మరిన్ని వార్తలు