ట్విట్టర్‌ వేదికగా కాంగ్రెస్‌, బీజేపీల మధ్య వార్‌

21 Jul, 2020 17:13 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ, కేంద్రం మధ్యన పరస్పర ఆరోపణలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా రాహుల్..‌ గడిచిన ఆరు నెలల్లో కేంద్రం కరోనా మీద కాకుండా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అలజడి సృష్టించి.. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసిందంటూ ఆరోపించారు. ఈ క్రమంలో రాహుల్‌ ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ స్పందించారు. ఇది ఇలానే కొనసాగితే చివరకు కాంగ్రెస్.. ట్వీట్స్ పార్టీగా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సరిగా పనిచేయకపోవడం వల్లనే ఒక రాష్ట్రం తర్వాత మరోరాష్ట్రంలో అధికారం కోల్పోతుందన్నారు. ప్రజల నుంచి తిరస్కరణకు గురైన ఆ పార్టీ కేంద్రంపై లేనిపోని ఆరోపణలు చేస్తుందని, అయితే ఇందులోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించలేదన్నారు ప్రకాశ్‌ జవదేకర్‌. (కరోనాపై పోరు : రాహుల్‌ సెటైర్లు)

గత ఆరు నెలలుగా రాహుల్ గాంధీ సాధించిన అంశాలు తమకు తెలుసని అన్నారు ప్రకాశ్‌ జవదేకర్. గత ఆరు నెలల్లో రాహుల్‌ సాధించినవి.. ‘ఫిబ్రవరిలో ఢిల్లీ, షహీన్ బాగ్ అల్లర్లు.. మార్చిలో సింధియాతోపాటు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కోల్పోవడం.. ఏప్రిల్‌లో వలస కార్మికులను రెచ్చగొట్టడం.. మే నెలలో ఆ పార్టీ చారిత్రక ఓటమికి గురై ఆరో ఏట అడుగుపెట్టడం.. జూన్‌లో చైనాకు మద్దతివ్వడం.. జూలైలో రాజస్తాన్‌లో కాంగ్రెస్ పార్టీ నాశనం కావడం’ అని జవదేకర్ ఎద్దేవా చేశారు.

>
మరిన్ని వార్తలు