మీడియా కథనాలపై కాంగ్రెస్‌ స్పందన

12 Jun, 2018 10:32 IST|Sakshi
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఆశీర్వదిస్తున్న ప్రణబ్‌ ముఖర్జీ

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ బుధవారం ఢిల్లీలోని తాజ్‌ప్యాలెస్‌ హోటల్‌లో ఇఫ్తార్‌ విందు ఇవ్వనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఆహ్వానం పంపలేదన్న వార్తలు నిన్నంతా మీడియాలో హల్‌ చల్‌ చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా స్పందిస్తూ ఆ పుకార్లను తోసిపుచ్చారు. 

‘ప్రణబ్‌కు ఆహ్వానం పంపాం. ఆయన దానిని అంగీకరించారు. మీడియా ఇకనైనా అత్యుత్సాహం ప్రదర్శించటం ఆపితే మంచిది’ అని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇటీవల నాగపూర్‌లో ఆరెస్సెస్‌ నిర్వహించిన ఓ కార్యక్రమానికి వెళ్లిన ప్రణబ్‌పై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఇస్తున్న ఇఫ్తార్‌ విందుకు ప్రణబ్‌కు ఆహ్వానం అందలేదని వార్తలొచ్చాయి. 

ఈ విందులో పాల్గొనేందుకు ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం, జేడీయూ తిరుగుబాటు నేత శరద్‌యాదవ్, ఎన్సీపీ అధినేత పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులకు ఆహ్వానాలు అందినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దాదాపు మూడేళ్ల తర్వాత కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న ఇఫ్తార్‌ కావటం, పైగా రాహుల్‌ అధ్యక్షుడు అయ్యాక నిర్వహిస్తున్నది కావటంతో ఈ ఇఫ్తార్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్డీఏ వ్యతిరేక శక్తులను కూడగలుపుకుని 2019 ఎన్నికల్లో ముందుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది.

మరిన్ని వార్తలు