ప్రణబ్‌ ప్రధాని అభ్యర్థి కావొచ్చు

11 Jun, 2018 02:34 IST|Sakshi

మోదీకి మద్దతు లేకుంటే ఆరెస్సెస్‌ ఆలోచన అదే: శివసేన నేత సంజయ్‌ రౌత్‌

ఖండించిన ప్రణబ్‌ కూతురు  

ముంబై: 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం రాకపోతే.. ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీకి బదులు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ఆరెస్సెస్‌ ముందుకు తెచ్చే అవకాశం ఉందని శివసేన సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నాయకుడైన ప్రణబ్‌ ముఖర్జీ ఈ నెల 7న నాగ్‌పూర్‌లో జరిగిన ఆరెస్సెస్‌ కార్యక్రమానికి హాజరై ప్రసంగించడం తెలిసిందే. ఆరెస్సెస్‌ అసలు ప్రణబ్‌ను ఎందుకు ఆహ్వానించిందో సాధారణ ఎన్నికల అనంతరం కానీ స్పష్టత రాదని శివసేనకు చెందిన సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఆదివారం ఆయన ముంబైలో మాట్లాడుతూ ‘పరిస్థితి చూస్తుంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచేలా లేదు.

హంగ్‌ ఏర్పడిన పక్షంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీకి ఇతర పార్టీలు మద్దతివ్వకపోతే, ప్రణబ్‌ ముఖర్జీని ప్రధాని అభ్యర్థిగా ఆరెస్సెస్‌ ముందుకు తెచ్చే అవకాశం ఉంది. ఆయనైతే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటారు’ అని అన్నారు. అయితే సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలను ప్రణబ్‌ కూతురు, కాంగ్రెస్‌ నాయకురాలు శర్మిష్ట ముఖర్జీ ఖండించారు. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తన తండ్రికి లేదని ఆమె స్పష్టం చేశారు. సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలపై శర్మిష్ట ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘సంజయ్‌ రౌత్‌.. మా నాన్న రాష్ట్రపతిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి ఆయన రారు’ అని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు