-

రాహుల్‌కు ప్రశాంత్‌ కిషోర్‌ అభినందనలు

24 Dec, 2019 19:48 IST|Sakshi

కాంగ్రెస్‌ పాలిత  రాష్ట్రాల్లో ఎన్‌ఆర్‌సీని అమలుచేయవద్దు

సాక్షి, న్యూఢిల్లీ :  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కృతజ‍్క్షతలు తెలిపారు. మంగళవారం ట్విటర్‌ వేదికగా స్పందించిన ఆయన.. రాహుల్‌ గాంధీకి పలు సూచనలు చేశారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో సీఏఏ, ఎన్‌ఆర్‌సీను అమలు చేయమని ప్రకటించాలని రాహుల్‌ను కోరారు. ఆ మేరకు ఆయన చర్యలు తీసుకోవాలని విజ‍్క్షప్తి చేశారు. అలాగే చట్టాన్ని వ్యతిరేకిస్తూ సత్యగ్రహం కార్యక్రమాన్ని చేపట్టడాన్ని ప్రశాంత్‌ కిషోర్‌ అభినందించారు. అలాగే పార్లమెంట్‌లో చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే సరిపోదని, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాలని ఆయన సూచించారు.

కాగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో సత్యాగ్రహం చేపట్టిన విషయం తెలిసిందే. ‘ఐకమత్యం కోసం సత్యాగ్రహం’పేరుతో నిర్వహించిన ఈ ఆందోళనలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, రాహుల్, ముఖ్య నేతలు పాల్గొన్నారు. విద్వేషాలను పెంచుతూ దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. భరత మాత గొంతు అణచివేసేందుకు, రాజ్యాంగంపై దాడికి చేస్తున్న యత్నాలను ప్రజలు కొనసాగనివ్వబోరని హెచ్చరించారు.

ప్రశాంత్‌ కిషోర్‌ ఉపాధ్యక్షుడుగా వ్యవహిరిస్తున్న జేడీయూ మాత్రం పార్లమెంట్‌లో ఎన్ఆర్‌సీ, సీఏఏకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు నితీష్‌ కుమార్‌ తీసుకున్న నిర్ణయంపై పీకే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై నితీష్‌ మరోసారి ఆలోచన చేయాలని కూడా కోరారు.  మరోవైపు ఎన్‌ఆర్‌సీను దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలని ప్రశాంత్‌ కోరడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ ద్వంద వైఖరిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున​ విమర్శల వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళన నేపథ్యంలో నితీష్‌ వెనక్కి తగ్గారు. ఎన్‌ఆర్‌సీని అమలు చేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు