‘సింధియా’ రాజీనామాపై ప్రశాంత్‌ కిషోర్‌ ట్వీట్‌

11 Mar, 2020 09:46 IST|Sakshi
ప్రశాంత్‌ కిషోర్‌(ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్‌ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ స్పందించారు. గాంధీ కుటుంబాన్ని విమర్శించే వారు... జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడటాన్ని అతిపెద్ద కుదుపుగా ఎలా భావిస్తారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు.. ‘‘ఇంటి పేరు కారణంగా... కాంగ్రెస్‌ అధినాయకత్వాన్ని తప్పుబట్టేవారు... ఇప్పుడేమో సింధియా పార్టీని వీడితే.. పార్టీకి ఇదొక ఝలక్‌ అంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వాస్తవం ఏమిటంటే.. జ్యోతిరాదిత్య సింధియా కూడా ఇంటిపేరు కారణంగానే మాస్‌ లీడర్‌, రాజకీయవేత్త, పాలకుడిగా ఉన్నారు’’అని ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సింధియా విజయాలకు కేవలం కుటుంబ చరిత్రే కారణమని జ్యోతిరాదిత్య అనుచరులు భావించడం సరికాదన్న ఉద్దేశంతో ఆయన ఈవిధంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. (బీజేపీలో సింధియాలు.. సింధియాలో బీజేపీ )

కాగా గ్వాలియర్‌ రాజకుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా... మంగళవారం కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్లుగా పార్టీకి సేవలందించిన ఆయన.. ఇకపై మరింత మెరుగ్గా ప్రజాసేవ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా 2001లో విమాన ప్రమాదంలో మరణించడంతో.. గుణ లోక్‌సభ స్థానానికి 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి జ్యోతిరాదిత్య భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తరువాత వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ విజయంలో కీలకపాత్ర వహించిన జ్యోతిరాదిత్యకి సీఎం పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అనుభవజ్ఞుడైన కారణంగా కమల్‌నాథ్‌కి దక్కింది. ఎంపీగా 2019లో ఓటమి చవిచూడడంతో పార్టీ జ్యోతిరాదిత్యని పక్కన పెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడినట్లు తెలుస్తోంది.(ఆ విషయం చరిత్రే చెబుతోంది: మహానార్యమన్‌)

ఇక అనేక ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన గ్వాలియర్‌ రాజమాత విజయరాజే.. ఆ తర్వాత జనసంఘ్‌లో చేరిన విషయం తెలిసిందే. జనసంఘ్‌ వ్యవస్థాపక సభ్యురాలిగా ఉన్న ఆమె ఏనాడు ఓటమిని చవిచూడలేదు. ఇక ఆమె కుమారుడు మాధవరావు బీజేపీ నుంచి పోటీ చేసి 26 ఏళ్లకే ఎంపీ అయ్యారు. అయితే అనతికాలంలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరి.. కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈ క్రమంలో... ఇన్నాళ్లుగా తండ్రి వారసత్వాన్ని కొనసాగించిన జ్యోతిరాదిత్య ప్రస్తుతం పార్టీని వీడారు. ఇక ఆయన మేనత్తలు వసుంధర రాజే(రాజస్తాన్‌ మాజీ సీఎం), యశోధర బీజేపీలో ఉన్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు