ప్రత్తిపాటి @ ప్రజాధనం లూటీ

4 Apr, 2019 13:26 IST|Sakshi

సాక్షి, గుంటూరు :  మన నియోజకవర్గ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వచ్చింది. ఇక ప్రతి మండలంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని నాలుగేళ్ల క్రితం చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు భావించారు. ప్రత్తిపాట్టి పుల్లారావుకు నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు పదవి వచ్చిన దగ్గర నుంచి అవినీతి జడలు విప్పింది.

ఊరూవాడా అక్రమాలు జోరు పెరిగింది. నీరు– చెట్టు పథకం మంత్రితోపాటు ఆయన అనుచరులకు వరంగా మారింది. అధికారం అండ ఉండడంతో పత్తి కొనుగోలులో గోల్‌మాల్‌ చేశారు. అవినీతి తోడేళ్లుగా మారి గ్రావెల్‌ను మింగేస్తూ.. అందినకాడిని మట్టి బొక్కేశారు. అగ్రిగోల్డ్‌ బాధితుల ప్రాణాలు ఆరిపోతుంటే.. ఆ సంస్థ భూములు అన్యాయంగా చెరబట్టారు.

అక్రమాలపై ప్రశ్నించి జర్నలిస్టుల కలాల కంఠానికి ఉరి బిగించారు. మంత్రి భార్య రాజ్యాంగేతర శక్తిగా మారి ప్రజలను పీడించారు. అన్ని శాఖల అధికారులను గుప్పిట్లో పెట్టుకుని కమీషన్లు దండుకున్నారు. ఇలా ఐదేళ్ల పాలనలో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారు. మొత్తంగా చిలకలూపేట నియోజకవర్గంలో అభివృద్ధికి పాతరేసి.. అవినీతి, అక్రమాలు, అరాచకాల కోటగా మార్చేశారు.   

అగ్రిగోల్డ్‌ భూముల కొనుగోలు... 
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో అగ్రిగోల్డ్‌ భూమి ఉంది. గతంలో వెంచర్లు వేసి భూమి అభివృద్ధి చేయటానికి సంస్థ వీటిని కొనుగోలు చేసింది. ఈ భూమి అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌ల్యాండ్‌ డైరెక్టర్‌ కనుకొల్లు ఉదయదినాకర్‌ పేరుపై రిజిస్టర్‌ అయ్యింది. అగ్రి గోల్డ్‌ భాగస్వామి అయిన ఇతని వద్ద నుంచి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి తేనె వెంకాయమ్మ (ప్రత్తిపాటి వెంకటకుమారి) 2015 జనవరి 19వ తేదీన ఖాతా నంబర్‌ 525, సర్వే నంబర్లు 104–6, 104–5,104–4,104–3,104–1,103–2ల ప్రకారం మొత్తం 6.19 ఎకరాలను కొనుగోలు చేశారు.

తిరిగి గతేడాది ఏప్రిల్‌ 17వ తేదీ అగ్రి ప్రాజెక్టు సంస్థకు చెందిన బండా శ్రీనివాసబాబు నుంచి సర్వే నంబర్‌ 101–1లోని 5.44 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అదే రోజు అంటే ఏప్రిల్‌ 17వ తేదీ మంత్రిప్రగడ విజయ్‌కుమార్‌ వద్ద నుంచి సర్వే నంబర్లు 104–1,104–2,104–3 ద్వారా 2.60 ఎకరాలు, సర్వే నంబర్‌ 104–4లో ఉన్న 0.57 ఎకరాలను కొనుగోలు చేశారు. మొత్తం అగ్రిగోల్డ్‌కి చెందిన 14.81 ఎకరాల భూమిని మంత్రి సతీమణి పేరుపై కొనుగోలు చేశారు.

ఇలా కొనుగోలు చేసిన మొత్తం భూమిని అదే ఏడాది జూన్‌ 4వ తేదీన గుంటూరుకు చెందిన కామేపల్లి వెంకటేశ్వరరావుకు, పెదకాకాని మండలం, ఉప్పలపాడుకు చెందిన చెరుకూరి నరసింహారావులకు విక్రయించారు. అగ్రి గోల్డ్‌ భూమిని రహస్యంగా భాగస్వాములు వేరే వ్యక్తులకు ఎకరా రూ.32 లక్షలకు అమ్మటానికి వ్యవహారం నడిచింది. ఇందుకు సంబంధించిన వేర్వేరు వ్యక్తులతో అగ్రిమెంటు కూడా రాయించుకున్నారు. విషయం తెలిసిన మంత్రి వీరిని బెదిరించి అగ్రిమెంట్లు రద్దు చేయించారు.

తాను కేవలం ఎకరాకు రూ.20 లక్షలు మాత్రమే ఇస్తానని చెప్పటంతో గత్యంతరం లేక నష్టానికి మంత్రికి భూములు అమ్మారు. భూములు కొన్న మంత్రి జూన్‌లో ఇవే భూములను ఎకరాకు రూ.52 లక్షలకు విక్రయించారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు మంత్రికి లాభంగా దక్కాయి.

అక్షరం గొంతు నొక్కి
చిలకలూరిపేట పట్టణానికి చెందిన విలేకరి ఎంవీఎన్‌ శంకర్‌పై(హత్యకు గురైనప్పుడు ఆంధ్రప్రభ ఆర్‌సీ ఇన్‌చార్జి) 2014 నవంబర్‌ 25వ తేదీన  తెలుగు యువత  పట్టణ మాజీ అధ్యక్షుడు మద్దిబోయిన శివ, మరో  ముగ్గురు దాడి చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతి శంకర్‌ మృతి చెందాడు. తొలుత ఆధారాలు లేవని కేసు మూసివేసేందుకు ప్రయత్నించగా.. జర్నలిస్టు సంఘాలు పోరాటం చేయడంతో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వీరు కేవలం పాత్రధారులు మాత్రమే. సూత్రధారులను మాత్రం అరెస్టు చేయ లేదు. 

సీసీఐలో భారీ కుంభకోణం 

2014–15 కాలంలో ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్‌ యార్డుల ద్వారా ఈ కుంభకోణం జరిగింది. విశాఖపట్టణం నుంచి గుంటూరు వచ్చిన సీబీఐ అధికారుల బృందం సీసీఐ కార్యాలయంలో విచారణ నిర్వహించింది. అప్పట్లో జరిగిన పత్తి కుంభకోణంలో దాదాపు రూ.540 కోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని విచారణలో వెల్లడైంది.

టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళలో సీసీఐ రాష్ట్ర వ్యాప్తంగా 43 మార్కెట్‌ యార్డుల్లో పత్తికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా రైతుల నుంచి సీసీఐ పత్తి కొనుగోలు చేయాలి. అయితే ముందే రైతుల నుంచి వ్యాపారులు, దళారీలు పత్తి క్వింటాకు రూ. 3 వేలలోపు కొని రూ. 4 వేలు, రూ.4100 చొప్పున సీసీఐకి విక్రయించారు. కొనుగోలు చేసిన పత్తిని మార్కెట్‌ యార్డులకు తీసుకురాకుండా గ్రామాల నుంచే నేరుగా జిన్నింగ్‌ మిల్లులకు తరలించారు.

ఈ వ్యవహారంలో సీసీఐ బయ్యర్లు, మార్కెటింగ్‌ శాఖ అధికారులు, వ్యాపారులు, దళారులు కుమ్మక్కై భారీ అవినీతికి పాల్పడ్డారు. గ్రామాల నుంచి వ్యాపారులు నేరుగా కొనుగోలు చేసిన పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించారు. కాటా వేయని పత్తికి కాటా వేసినట్లు చార్జీలు, మార్కెట్‌ యార్డుల నుంచి సీసీఐ జిన్నింగ్‌ చేయించే మిల్లులకు పత్తిని తరలించినట్లు రవాణా చార్జీలు ఖర్చు రాసి డబ్బులు దండుకున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారత పత్తి కొనుగోలు సంస్థ (సీసీఐ)లో జరిగిన అవినీతి ప్రభుత్వాన్ని కుదిపేసింది.  ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావటంతో కంటితుడుపుగా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్‌ దర్యాప్తునకు ఆదేశించింది. విచారణ అనంతరం 2016 నవంబర్‌లో చిలకలూరిపేట మార్కెట్‌ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి కే నాగవేణి సహా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 మంది మార్కెటింగ్‌ శాఖ అధికారులు, సిబ్బందిని సస్పెండ్‌ చేశారు.

కప్పం కట్టనిదే ఫైల్‌ కదలదు 
చిలకలూరిపేట నియోజకవర్గంలో రెవెన్యూ, మున్సిపల్‌ ఇలా ఏ కార్యాలయంలో ఫైల్‌ కదలాలన్నా మేడమ్‌ను కలిసి కప్పం కట్టాల్సిందే. ల్యాండ్‌ కన్వర్షన్‌ ఎకరాకు రూ.1 లక్ష వసూలు చేస్తున్నారు. మంచినీటి సరఫరా పేరుతో ఇప్పటి వరకు రూ. 5 కోట్ల వరకు దండుకున్నారు. ఎంత పెద్ద వర్క్‌ అయినా మూడు, నాలుగు భాగాలుగా విభజించి ఒక్కరికే నామినేషన్‌ పద్ధతిలో అప్పగిస్తూ భారీగా ముడుపులు తీసుకున్నారు.

బాణా సంచా వ్యాపారుల నుంచి ఏటా రూ. కోటి చొప్పున ఇప్పటి వరకు రూ. 5 కోట్లు, పాన్‌ పరాగ్, గుట్కా హోల్‌సేల్‌ వ్యాపారుల నుంచి రూ. 3 కోట్లు వసూలు చేశారు. గుంటూరులో కల్తీ కారం తయారీదారులను బెదిరించి రూ. 8 కోట్లు దండుకున్నారు. నకిలీ విత్తనాల  కుంభకోణం సైతం వీరి కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. విత్తనాలను బ్లాక్‌ చేసి కిలో లక్ష రూపాయలకు అమ్మించారు.  

అతి ఖరీదైన భూమి కబ్జా 
చిలకలూరిపేటలోని ఓగేరు వాగు పక్కనే ఉన్న సుమారు ఎకరాల స్థలాన్ని మంత్రి పుల్లారావు అనుచరులు ఆక్రమించి ప్లాట్లు వేసేశారు. 12 ఏళ్ళ క్రితం వాగు నుంచి వరద నీరు పట్టణంలోకి రాకుండా కరకట్టలు నిర్మించారు. ఆ సమయంలో అక్కడ ఎస్టీలు కొందరు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. దీంతో కొంత స్థలాన్ని వదిలేసి కరకట్ట నిర్మించారు.

ఇది మంత్రి అనుచరులకు వరంగా మారింది. తమ పూర్వీకుల పేరుతో పట్టాలు ఉన్నట్లుగా సృష్టించి మంత్రి అండదండలతో పూర్ణాసింగ్, మాధవ్‌సింగ్, శంబుసింగ్‌ అనే వ్యక్తులు ఆక్రమించి ప్లాట్లు వేశారు. సుమారు రూ. 4 కోట్ల విలువ చేసే స్థలం కబ్జాకు గురైంది.  

మంత్రి కన్నుపడిన యడవల్లి భూముల్లో గ్రానైట్‌ విలువ : రూ. 3000 కోట్లు
పేదల బియ్యం రవాణాలో అక్రమాలు : రూ. 200 కోట్లు
ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో గ్రావెల్‌ దోపిడీ :  రూ.500 కోట్లు
మున్సిపల్‌ పనుల్లో మంత్రి భార్య కమీషన్‌ : రూ.150 కోట్లు
పేట కేంద్రంగా సీసీఐ కుంభకోణం : రూ. 540 కోట్లురూ.
టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలను అడ్డుపెట్టుకుని దోచుకున్న మొత్తం  : 150 కోట్లు
అగ్రి గోల్డ్‌ ఆస్తుల కొనుగోలులో లబ్ధి : సుమారు 5 కోట్లు 

మరిన్ని వార్తలు