మాజీ ఎమ్మెల్యేకి చెక్‌ పెట్టిన టీడీపీ 

10 Mar, 2020 10:06 IST|Sakshi
మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి

ఎన్నికల సమన్వయకర్తగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి 

నైరాశ్యంలో టీడీపీ శ్రేణులు

సాక్షి, ప్రొద్దుటూరు : టీడీపీ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డికి పార్టీ అధిష్టానం చెక్‌ పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన ఈ పరిస్థితుల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆదివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రభావం కారణంగా టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నాయి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించగా ఆ తర్వాత 1, 2 ఏళ్లకు మల్లేల లింగారెడ్డి పార్టీలో చేరారు. నాటి నుంచి నేటి వరకు ఆయన పార్టీలో కొనసాగుతున్నారు.

2009లో జిల్లాకంతటికీ టీడీపీ శాసనసభ్యునిగా లింగారెడ్డి మాత్రమే ఎన్నికయ్యారు. గతంలో పార్టీ జిల్లా అధ్యక్షునిగా, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా పనిచేయగా, ఆయన సతీమణి మల్లేల లక్ష్మీప్రసన్న కూడా మహిళా విభాగంలో కీలక బాధ్యతలు వ్యవహరించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు వచ్చే సమయంలో టీడీపీ ఏదో రకమైన కొత్తమెలిక పెడుతోంది. చాలా ఎన్నికల్లో నామినేషన్లు వేసే వరకు శాసనసభ అభ్యర్థులను ప్రకటించిన సందర్భాలు లేవు. 2014 శాసనసభ ఎన్నికల్లో సైతం అప్పటికప్పుడు పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి టికెట్‌ ఇవ్వడం, ఓడిపోయిన తర్వాత ఆయనే చాలా రోజుల వరకు ఇన్‌చార్జిగా ఉండటం జరిగింది. చదవండి: జేసీ బ్రదర్స్‌ కాళ్లబేరం!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సమన్వయకర్తగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని నియమించడం జరిగింది. వాస్తవానికి ఇప్పటి వరకు ఈయన పార్టీలో లేరు. 2019 ఎన్నికల సందర్భంగా టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నించారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని నియమించారని ప్రచారం ఊపందుకోవడంతో లింగారెడ్డి సోమవారం స్వయంగా సెల్ఫీ వీడియో ద్వారా సోషల్‌ మీడియాలో కార్యకర్తలకు ప్రచారం చేసుకున్నారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కేవలం 20 రోజులపాటు ఎన్నికల సమన్వయకర్తగా మాత్రమే పనిచేస్తారని, పార్టీ ఇన్‌చార్జితో అతనికి సంబంధం లేదని అన్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.   

మరిన్ని వార్తలు