సివిల్స్‌లో మెరిసిన ప్రవీణ్‌ నాయక్‌

7 Apr, 2019 14:50 IST|Sakshi
కుటుంబ సభ్యులతో ప్రవీణ్‌ నాయక్‌ (కుడి నుంచి మొదటి వ్యక్తి)

సాక్షి, భీమదేవరపల్లి(హుస్నాబాద్‌): చదువుకు పేదరికం అడ్డుకాదు.. సాధించాలనే లక్ష్యం, తపన ఉంటే కష్టపడి తత్వం ఉంటే విజయ తీరాలను అందుకోవచ్చని నిరూపించాడు గ్రామీణ ప్రాంత విద్యార్థి ప్రవీణ్‌ నాయక్‌. సివిల్‌ సర్వీసెస్‌–2018 ఫలితాల్లో వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు మండలం ఎర్రబల్లికి చెందిన నునావత్‌ ప్రవీణ్‌నాయక్‌ 610 ర్యాంక్‌ను సాధించాడు. నునావత్‌ భీమా నాయక్‌–రాజమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. వారి కుమారుడు ప్రవీణ్‌ నాయక్‌ ఒకటో తరగతి నుంచి టెన్త్‌ వరకు కరీంనగర్‌లోని పారమిత హైస్కూల్లో చదువుకున్నాడు.

పదో తరగతి పూర్తికాగానే 2008 సంవత్సరం హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్‌(ఎంపీసీ), అనంతరం వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌ జ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చేశాడు. సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో బీటెక్‌ పూర్తి కాగానే ఢిల్లీలో కొన్ని నెలల పాటు  కోచింగ్‌ తీసుకున్న ప్రవీణ్‌ నాయక్‌ 2016 సివిల్స్‌ మెయిన్స్‌లో తప్పాడు. రెండో ప్రయత్నంలో లక్ష్యం సాధించాడు. 2018 సంవత్సరానికి సంబంధించిన సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాలు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. యూపీఎస్సీ(యూనియన్‌ పబ్లిక్‌ కమిషన్‌) గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌ సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలను, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంటర్వూలు నిర్వహించగా అందులో ప్రవీణ్‌నాయక్‌కు 610 ర్యాంక్‌ సాధించాడు. 

సంతోషంగా ఉంది..
నా కుమారుడు సివిల్స్‌ సాధించడం చాల సంతోషంగా ఉంది. మాది చాలా  పేద కుటుంబం. మా తండాల్లో ఎర్రమట్టి విక్రయాలే జీవనాధారం. మా తండ్రి నునావత్‌ బిక్యా–బూలమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నాన్న ఎర్రమట్టి అమ్మి వచ్చిన డబ్బులతో నన్ను చదివించాడు. ప్రస్తుతం మా ఇద్దరు తమ్ముళ్లలో ఒకరు ఆటో డ్రైవర్‌గా, మరో తమ్ముడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. నేను పదో తరగతి వరకు ముల్కనూర్‌లో చదువుకున్నాను. 1996 సంవత్సరంలో ఓరియంటల్‌ బ్యాంక్‌ కామర్‌లో ఫ్యూన్‌గా ఉద్యోగం లభించింది. నాకు కుమారుడు ప్రవీణ్‌తో పాటుగా కూతురు నవ్య సంతానం. నవ్య ఇప్పుడు డిగ్రీ చదువుతోంది.  
– భీమా నాయక్, ప్రవీణ్‌ నాయక్‌ తండ్రి

పేపర్‌ చదవడం వల్లే సివిల్స్‌ సాధించాను..
మాది పేద కుటుంబం.. సివిల్స్‌ చదవాలనే తపన ఇంటర్మీడియట్‌లోనే కలిగింది. అప్పటి నుంచి అందే సంకల్పంతో బీటెక్‌ పూర్తి కాగానే సివిల్స్‌పై దృష్టి సారించి ఢిల్లీలో కోచింగ్‌కు వెళ్లాను. అయిప్పటికీ స్వతహాగా నోట్స్‌ తయారు చేసుకున్నాను. ఇతర పుస్తకాలతోపాటు నిత్యం పేపర్‌ చదివాను. సివిల్స్‌ సాధించడానికి ఇవి తోడ్పడ్డాయి. పేపర్‌ చదవడం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. నిత్యం 8 నుంచి 10 గంటలు ప్రిపేరయ్యాను. ఆశయం ఉంటే లక్ష్యం సాధించడం కష్టమేమి కాదు.
– నునావత్‌ ప్రవీణ్‌ నాయక్‌ 

మరిన్ని వార్తలు