ప్రతిపక్షం అన్నింటా వైఫల్యం

30 Jan, 2018 07:28 IST|Sakshi
ఎద్దులబండిపై నిరసన వ్యక్తం చేస్తున్న ప్రేమలతావిజయకాంత్‌

ప్రేమలతా విజయకాంత్‌ విమర్శలు

తిరువళ్లూరు: రాష్ట్రంలో అసమర్ధుడైన ప్రతిపక్ష నాయకుడు ఉండడం వల్లే ప్రజా సమస్యలపై గళమెత్తే పరిస్థితి లేకుండా పోయిందని డీఎండీకే అధినేత విజయకాంత్‌ సతీమణి ప్రేమలత ఆరోపించారు. బస్సు చార్జీల మోతకు నిరసనగా డీఎండీకే ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం తిరువళ్లూరులోని బజారువీధిలో ధర్నాకు జిల్లా కన్వీనర్‌ కృష్ణమూర్తి నాయుడు అధ్యక్షత వహించారు. ప్రేమలతా విజయకాంత్‌ హాజరై ప్రసంగించారు. మొదట ఆమె ఎద్దుల బండిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేస్తూ, బస్సు చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

అనంతరం ఆమె ప్రసంగిస్తూ రాష్ట్రంలో స్టాలిన్‌ లాంటి అసమర్థ నేత ప్రతిపక్షంగా ఉండడం ప్రజల దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. స్టాలిన్‌ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని జోస్యం పలికారు. అన్నాడీఎంకే ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని స్పష్టం చేసిన ఆమె, వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే అడ్రస్‌ లేకుం డా పోతుందని విమర్శించారు. రవాణా శాఖలో రూ.5,700 కోట్ల కుంభకోణం, కార్మిక సంఘాల పేరిట విధులకు హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్న నేతల వైఖరే నష్టాలకు కారణమని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సినీ నటులు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని పరోక్షంగా కమల్‌ రజనీకాంత్‌లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రేమలత, జయలలిత ఉన్నప్పుడు వారెం దుకు పార్టీని స్థాపించలేదని ప్రశ్నించారు. ఆందోళనలో పార్టీ నేతలు శేఖర్, శరవణన్, రజనీకాంత్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు