ముందస్తు ఎన్నికలకు సన్నద్ధం కావాలి

11 Sep, 2018 02:27 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ తెలంగాణ కార్యకర్తలకు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపు  

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గట్టు శ్రీ,కాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య సమావేశం జరిగింది. గట్టు శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలు, అభ్యర్థులు బలంగా ఉన్న స్థానాలు గుర్తిస్తున్నామని తెలిపారు. ఈ వివరాలన్నీ అధిష్టానానికి అందజేస్తామని చెప్పారు. ముందస్తు నేపథ్యంలో ఎన్నికల కమిటీ, కోఆర్డినేషన్‌ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

పార్టీకి కార్యకర్తలే దేవుళ్లని, రాజకీయాల్లో ఓపిక ఎక్కువగా ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమై, మళ్లీ ముందస్తు ఎన్నికలు వచ్చేలా చేశారని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించి, ముగ్గురు కాంగ్రెస్‌ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని గుర్తుచేశారు. అలాంటి టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడం అనైతికమన్నారు. అవసరం కోసం చంద్రబాబు ఎవరి కాళ్లయినా పట్టుకుంటారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకే ఎన్నికల్లో పాల్గొంటామని పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. సంపూర్ణ మద్దతున్నా కేసీఆర్‌ ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్‌ సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మతీన్‌ ముజాద్దాదీ, రాంభూపాల్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, అనిల్‌ కుమార్, ప్రపుల్లారెడ్డి, సంజీవరావు, పార్టీ మహిళా అధ్యక్షురాలు అమృతసాగర్, జీహెచ్‌ఎంసీ అధ్యక్షుడు సాయినాథ్‌రెడ్డి, వెల్లాల రామ్మోహన్, రవికుమార్, ఎస్‌ఈసీ సభ్యులు అక్కెనపల్లి కుమార్, బ్రహ్మానందరెడ్డి, జిల్లాల అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు