ప్రతి ఒక్కరికీ సాధికారతే లక్ష్యం

21 Jun, 2019 03:48 IST|Sakshi
ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి కోవింద్‌ను తోడ్కొని వెళ్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య, స్పీకర్‌ ఓం బిర్లా, ప్రధాని మోదీ

జమిలి ఎన్నికలకు సమయం ఆసన్నమైంది

‘అందరితో కలసి, అందరికీ ప్రగతి, అందరి విశ్వాసం’కోసం కృషి

బలమైన, సురక్షిత, సమ్మిళిత భారత్‌ నిర్మాణం దిశగా ముందుకు

పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  ప్రసంగం

న్యూఢిల్లీ: రెండోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వ రోడ్‌మ్యాప్‌ను రాష్ట్రపతి కోవింద్‌ ఆవిష్కరించారు. 2014లో ప్రారంభమైన నిరంతర, నిరాటంక అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించేందుకు వీలుగా ప్రజలు గట్టి తీర్పునిచ్చారని చెప్పారు. భారత ప్రజాస్వామ్య విశ్వసనీయతను ఈ సాధారణ ఎన్నికలు పెంపొందించాయన్నారు. రికార్డు స్థాయిలో 61 కోట్ల మంది ప్రజలు ఓటేశారని, వీరిలో మహిళలే ఎక్కువ శాతం ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో 2022 నాటికి నవభారతాన్ని నిర్మించేలా ప్రతి ఒక్కరికీ సాధికారతను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజలకు సాధికారత కల్పించడం ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం పేదలకు నివాస, ఆరోగ్యపరమైన సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు.

గురువారం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి కోవింద్‌ సుమారు గంటసేపు ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రముఖంగా ప్రస్తావించారు.  ప్రస్తుతం దేశానికి జమిలి ఎన్నికలు అవసరమని అన్నారు. ఎప్పుడూ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుండటం అభివృద్ధి కార్యక్రమాల వేగం, కొనసాగింపుపై ప్రభావం చూపిస్తోందన్నారు. అందువల్ల ఎంపీలందరూ ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు’అనే అభివృద్ధి కాముక ప్రతిపాదనపై గట్టిగా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నానన్నారు. లోక్‌సభలో సగం మంది ఎంపీలు కొత్తగా ఎన్నికైన వారు కావడం, మునుపెన్నడూ లేనివిధంగా 78 మంది మహిళా ఎంపీలుండటం నవభారత దృశ్యాన్ని మన ముందు ఉంచుతోందన్నారు.   

భారత్‌కు ప్రపంచ దేశాల మద్దతు
దేశ భద్రతకు ప్రభుత్వం అత్యంత అధిక ప్రాధాన్యతను ఇస్తోందంటూ మెరుపు దాడులను, పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులను రాష్ట్రపతి ప్రస్తావించారు. తొలుత మెరుపుదాడులతో, ఆ తర్వాత పుల్వామా దాడి నేపథ్యంలో సరిహద్దు పొడవునా ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడుల ద్వారా ప్రభుత్వం ఈ విషయంలో తన ఉద్దేశాన్ని, సామర్థ్యాన్ని చాటి చెప్పిందన్నారు. ఉగ్రవాదంపై భారత్‌ వైఖరికి ప్రపంచ దేశాలు మద్దతు పలుకుతున్నాయన్నారు. జైషే మొహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం ఇందుకు నిదర్శనమన్నారు. జమ్మూ కశ్మీర్‌ ప్రజలకు సురక్షితమైన, ప్రశాంత వాతావరణం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు.

రైతు సంక్షేమానికి చర్యలు
నవభారత నిర్మాణం సాధన దిశగా 21 రోజుల్లోనే ప్రభుత్వం.. రైతులు, సైనికులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, మహిళలు, సమాజంలోని ఇతర వర్గాలు లక్ష్యంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. రైతులు, చిరు వ్యాపారులకు పింఛను పథకాలు ప్రారంభించేందుకు, రైతులందరికీ రూ.6 వేల ఇన్‌పుట్‌ సబ్సిడీ వర్తింపజేసేందుకు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రానున్న సంవత్సరాల్లో రూ.25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడం జరుగుతుందని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా గత ఐదేళ్లలో పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.  

సాంఘిక దురాచారాల నిర్మూలన
మహిళలకు సమాన హక్కులు కల్పించేలా ట్రిపుల్‌ తలాక్, నికా హలాల వంటి సాంఘిక దురాచారాల నిర్మూలనలో ప్రభుత్వం చిత్తశుద్ధిని రాష్ట్రపతి నొక్కి చెప్పారు. అవినీతిపై ఉక్కుపాదం మోపే విధానాన్ని మరింత పటిష్టం చేసేందుకు నల్లధన వ్యతిరేక కార్యాచరణను వేగంగా ముందుకు తీసుకువెళతామన్నారు. గత రెండేళ్లలో 4 లక్షల 25 వేల కంపెనీ డైరెక్టరపై అనర్హత వేటు వేశామని, 3 లక్షల 50 వేల అనుమానాస్పద కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న వారి వివరాలన్నీ ప్రస్తుతం దేశానికి అందుతున్నాయని చెప్పారు. అభివృద్ధిని ప్రోత్సహించడం, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తుందన్నారు. సహకార సమాఖ్య వ్యవస్థ విధానాన్ని, స్ఫూర్తిని బలోపేతం చేసేలా దేశ ప్రయోజనాల సాధనకు తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకుని పోతోందని చెప్పారు.  

ప్రసంగం సైడ్‌లైట్స్‌
► ప్రసంగ సమయంలో కావేరీ జలాల సమస్యను తీర్చాలంటూ డీఎంకే పార్టీ సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేశారు.  
► రాష్ట్రపతి ప్రసంగంలో మోదీ ప్రభుత్వాన్ని సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్‌ను, రఫేల్‌ అంశం గురించి ప్రసంగిస్తున్నపుడు ఎన్డీయే సభ్యులు చప్పట్లు చరిచారు.  
► ప్రసంగసమయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌సహా పలువురు ఎంపీలు మొబైల్‌ ఉపయోగించడం కెమెరాల కంటపడింది.  
► రాష్ట్రపతి వెళ్లిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీల సభ్యులు పలువురు రాహుల్‌గాంధీని కలిశారు. సెంట్రల్‌ హాల్‌ నుంచి బయటకు వస్తూ సోనియా గాంధీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పలకరించుకున్నారు.

కోవింద్‌ ఏడాదిలో ఇది రెండోసారి
రాష్ట్రపతి కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. క్రీమ్‌ కలర్‌ జోధ్‌పురి సూట్‌ (బంద్‌గలా) ధరించిన కోవింద్‌ అశ్విక దళం ముందూ వెనుకా నడుస్తుండగా బగ్గీలో కాకుండా కార్లో పార్లమెంటు ఆవరణకు చేరుకున్నారు. అంతకుముందు తన వ్యక్తిగత అంగరక్షకుల (పీబీజీ) గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి భవనం వెలుపల అశ్విక దళం (పీబీజీ) రాష్ట్రపతి వెంట ఉండటం అరుదుగా కన్పిస్తుంది. సాధారణంగా ఏడాదిలో మూడుసార్లు రాజధాని వాసులకు ఈ దృశ్యం కనువిందు చేస్తుంది. ఈ ఏడాది ఇలా జరగడం నాల్గోసారి.
 

మరిన్ని వార్తలు