ప్రభుత్వ నినాదం సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌: రాష్ట్రపతి

20 Jun, 2019 12:12 IST|Sakshi

పార్లమెంట్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం

సాక్షి, న్యూఢిల్లీ : ‘సబ్‌కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌’ అనేది తమ ప్రభుత్వం నినాదమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి ఆయన నేడు(గురువారం) ప్రసంగించారు. లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగాన్ని ప్రారంభించిన రాష్ట్రప్రతి.. స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓం బిర్లాను అభినందించారు. ప్రభుత్వం సుపరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా ఆయన ప్రసంగం కొనసాగింది.  సుస్థిరత, పారదర్శకత, అభివృద్ధిని కాంక్షిస్తూ దేశ ప్రజలు విజ్ఞతతో ఓటువేశారని రాష్ట్రపతి కితాబిచ్చారు. యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారని, ఈ సారి ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. 2014 నుంచి కొనసాగుతున్న ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇచ్చారని, మహిళా సభ్యుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. దాదాపు పురుషులతో సమానంగా మహిళా సభ్యులున్నారని చెప్పారు. లోక్‌సభలో సగం మంది తొలి సారిగా ఎన్నికైన వాళ్లే ఉన్నారని పేర్కొన్నారు. 
 
రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • 2014కు ముందు ఉన్న పరిస్థితులు నుంచి దేశాన్ని బయటకు తీసుకురావాలని జనం భావించారు.
  • ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు మా ప్రభుత్వం పనిచేస్తోంది. 
  • శక్తి వంతమైన భారత దేశం నిర్మాణం కోసం కృషి చేస్తున్నాం.
  • రైతుల గౌరవం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 60 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్‌ అందిస్తాం.
  • వీర్‌జవాన్‌ స్కాలర్‌షిప్‌లను రాష్ట్రాల పోలీసుల పిల్లలకు అందజేస్తాం. 
  • నదులు కాల్వలు ఆక్రమణల వల్ల జల వనరుల తగ్గిపోతున్నాయి. స్వచ్ఛభారత్‌ తరహాలో జల సంరక్షణ కార్యక్రమం చేపడతాం. జల సంరక్షణ కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తాం.
  • 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నాం.
  • ఆక్వాకల్చర్‌ ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. దీని కోసం బ్లూ రివల్యూషన్‌ తీసుకొస్తాం. 
  • జన్‌ధన్‌ యోజన్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవలను ప్రతి ఇంటికి చేర్చాం. పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నాం. ఆయుష్మాన్‌ భారత్‌ కింద 20 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతోంది.
  • 2024 నాటికి దేశంలో 50 లక్షల స్టార్టప్స్‌ ఏర్పాటవుతాయి. 
  • ఉన్నత విద్యాసంస్థల్లో 2 కోట్ల సీట్లు అదనంగా వస్తాయి. 
  • ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తాం. క్రీడాకారులకు అత్యాధునిక సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నాం. 
  • మహిళా రక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. దేశంలో బ్రూణ హత్యలు తగ్గాయి. ట్రిపుల్‌ తలాఖ్‌ను అరికట్టాలి. 
  • గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల పక్కా ఇళ్లు నిర్మిస్తాం. 
  • జీఎస్టీ రాకతో పన్నుల వ్యవస్థ సులభతరమైంది. జీఎస్టీ చెల్లించే వ్యాపారులకు రూ.10 లక్షల జీవిత బీమా అమలు చేస్తున్నాం.
  • అవినీతి అంతానికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.
  • నల్లధనానికి వ్యతిరేకంగా ప్రారంభించిన కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తాం. విదేశాల్లో నల్లధనం దాచుకున్న వాళ్ల వివరాలు సేకరిస్తున్నాం.
  • డైరెక్ట్‌ బెనిఫిట్‌ స్కీమ్‌ ద్వారా లబ్ధిదారులకు నేరుగా డబ్బు చేరుతోంది. 400కు పైగా పథకాలకు డీబీఎస్‌ను విస్తరించాం.
  • చిన్న వ్యాపారుల కోసం పెన్షన్‌ యోజన పథకం తెస్తాం.
  • రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నల్లధనాన్ని తగ్గించాం. రెరా చట్టంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నల్లధనానికి అడ్డుకట్ట వేశాం.
  • ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేస్తాం. ఉపరితల రవాణతో పాటు జల రవాణాకు ప్రాధాన్యత ఇచ్చాం. డీజిల్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు తెస్తున్నాం.
  • అనేక రాష్ట్రాల్లో మెట్రో రైళ్లను ప్రోత్సహిస్తున్నాం.
  • పర్యావరణ పరిరక్షణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం
  • అన్ని దేశాలతో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నాం
  • మసుద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి భారత్‌ చేసిన ఒత్తిడి ఫలించింది
  • విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెంటనే స్వదేశానికి రప్పించేందుకు సాయం అందిస్తున్నాం.
  • త్వరలోనే రఫేల్‌, అపాచి యుద్ధ విమానాలు అందుబాటులోకి వస్తాయి.
  • మాజీ సైనికుల పెన్షన్‌ను పెంచుతాం.
  • ఉగ్రవాదుల ఏరివేతకు చర్యలు తీసుకుంటున్నాం
  • ప్రజల ఆకాంక్షలను మా ప్రభుత్వం నెరవేరుస్తోంది.

మరిన్ని వార్తలు