‘శివ’సైనికుడే సీఎం

2 Nov, 2019 03:51 IST|Sakshi

శివసేన నేత సంజయ్‌రౌత్‌ వ్యాఖ్య

50:50 ఫార్ములాకే ప్రజలు ఓటేశారని వ్యాఖ్య

7లోగా ప్రభుత్వం ఏర్పడకపోతే రాష్ట్రపతి పాలన: బీజేపీ

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్‌ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి వారం గడిచినా.. మెజారిటీ సాధించిన మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య అధికారం పంపిణీపై అవగాహన కుదరకపోవడంతో ఈ ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. నవంబర్‌ 7వ తేదీలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడనట్టయితే రాష్ట్రపతి పాలన విధించే అవకాశముందని బీజేపీ నేత, ఆర్థికమంత్రి ముంగంతివార్‌ పేర్కొన్నారు. ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి నవంబర్‌ 8వ తేదీతో ముగుస్తుంది. దీపావళి పండుగ కారణంగా శివసేన, బీజేపీల మధ్య చర్చలు ప్రారంభం కాలేదని, ఒకట్రెండు రోజుల్లో అవి ప్రారంభమవుతాయని ముంగంటివార్‌ తెలిపారు.

ఏ ఒక్క పార్టీకో అనుకూలంగా ప్రజలు తీర్పునివ్వలేదని, బీజేపీ, సేన కూటమికి వారు మద్దతిచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ‘మా కూటమి ఫెవికాల్‌ కన్నా, అంబుజా సిమెంట్‌ కన్నా దృఢమైనది’అని వ్యాఖ్యానించారు. మరోవైపు, శివసేన వ్యక్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడంటూ సేన నేత సంజయ్‌ రౌత్‌ శుక్రవారం వ్యాఖ్యానించారు. ‘సేన కోరుకుంటే.. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సభ్యుల మద్దతు కూడగట్టుకోగలదు’అన్నారు. అధికారాన్ని సమంగా పంచుకోవాలనే ప్రతిపాదనకే మహారాష్ట్ర ప్రజలు ఓటేశారన్నారు. అతివృష్టితో తీవ్రంగా నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందాల్సి ఉందని శివసేన పత్రిక సామ్నా పేర్కొంది.   

ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తాం
ఒకవేళ బీజేపీ, శివసేన ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైతే.. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు తాముప్రయత్నిస్తామని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు, అదే పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ మాత్రం.. ప్రతిపక్షంలో కూర్చోమనే ప్రజలు తీర్పిచ్చారని, తాము అదే పాటిస్తామని వక్కాణించారు.  గురువారం రాత్రి శరద్‌పవార్‌ నివాసంలో ఎన్సీపీ  నేతల భేటీ అనంతరం అజిత్‌ పవార్‌ పై వ్యాఖ్యలు చేశారు.  

అది బీజేపీ, శివసేన డ్రామా
బీజేపీ, శివసేన డ్రామాలో పావు కావద్దొని కాంగ్రెస్‌కు ఆ పార్టీ నేత సంజయ నిరుపమ్‌ సూచించారు. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతివ్వాలన్న కాంగ్రెస్‌ ఆలోచనను ఆయన తప్పుబట్టారు. బీజేపీ, శివసేనల మధ్య విభేదాలను ‘అధికారంలో ఎక్కువ వాటా కోసం ఆడుతున్న తాత్కాలిక డ్రామా’అని ఆయన అభివర్ణించారు. ‘బీజేపీ నీడ నుంచి శివసేన ఎన్నటికీ బయటకు రాదు’అని కాంగ్రెస్‌లో చేరకముందు శివసేనలో కీలక నేతగా వ్యవహరించిన సంజయ్‌ వ్యాఖ్యానించారు.

పొత్తు తేలే దాకా నేనే సీఎం!
ఔరంగాబాద్‌: రాజకీయ అనిశ్చితి కొనసా గుతున్న మహారాష్ట్రలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. బీజేపీ, శివసేనల మధ్య ఒప్పందం కుదిరేవరకూ తనను ముఖ్యమంత్రిగా చేయాలని ఓ రైతు అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే, ముఖ్యమంత్రి పదవిపై ఇరుపార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో బీడ్‌ జిల్లాకు చెందిన రైతు శ్రీకాంత్‌ విష్ణూ గడాలే గురువారం కలెక్టర్‌ను కలిసి సీఎం పీఠంపై అస్పష్టత తొలిగే వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించి, రైతుల సమస్యలు పరిష్కరిస్తానంటూ వినతి పత్రం అందించారు. లేదంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనకు దిగుతా నంటూ ఆ రైతు హెచ్చరించడం కొసమెరుపు!

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా