పేదరిక నిర్మూలనను పట్టించుకోలేదు

20 Oct, 2018 02:02 IST|Sakshi

యూపీఏ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ప్రధాని మోదీ

40,000 మంది పీఎంఏవై లబ్ధిదారులకు ఇళ్ల అందజేత  

షిర్డీ న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం గతంలో పేదరిక నిర్మూలనపై సీరియస్‌గా దృష్టి పెట్టలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. ఓ కుటుంబానికి పేరుప్రతిష్టలను పెంచేందుకే యూపీఏ ప్రభుత్వం పనిచేసిందని విమర్శించారు. దేశంలో సమ్మిళిత అభివృద్ధి కోసం విభజన శక్తులను ఓడించాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్నారు.

అనంతరం షిర్డీలో జరిగిన ‘ఈ–గృహప్రవేశ్‌’ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘యూపీఏ ప్రభుత్వం తన చివరి నాలుగేళ్లలో కేవలం 25 లక్షల ఇళ్లను మాత్రమే నిర్మించింది. కానీ ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో 1.25 కోట్ల ఇళ్లను నిర్మించింది. దేశంలోని నిరుపేదలందరికీ 2022 కల్లా సొంతిళ్లు కల్పించేందుకు కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోంది. గతంలోనూ పేదల కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి.

కానీ దురదృష్టవశాత్తూ పేదలకు ఇళ్లు ఇవ్వడం కాకుండా ఓ కుటుంబం పేరుకు ప్రచారం కల్పించడమే వాటి ముఖ్యోద్దేశంగా మారింది’ అని మోదీ విమర్శించారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) లబ్ధిదారులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించారు. అలాగే డిజిటల్‌ మాధ్యమం ద్వారా 40,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేశారు. సాయిబాబా మహాసమాధి అయి అక్టోబర్‌ 18(గురువారం) నాటికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన స్మృత్యర్థం వెండి నాణేన్ని విడుదల చేశారు.

దసరా వేడుకల్లో కోవింద్, మోదీ
ఢిల్లీలోని పరేడ్‌ గ్రౌండ్‌లో శుక్రవారం నిర్వహించిన దసరా వేడుకల్లో రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత వేషధారణలో ఉన్నవారికి తిలకం దిద్దిన మోదీ, కోవింద్‌ అనంతరం బాణాలను ప్రయోగించి రావణుడు, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడి విగ్రహాలను దహనం చేశారు.

మరోవైపు భూటాన్‌ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినందుకు ప్రధాని లోటే షేరింగ్‌ను మోదీ ఫోన్‌లో అభినందించారు. షేరింగ్‌ నేతృత్వంలోని డీఎన్‌టీ పార్టీ జాతీయ అసెంబ్లీలోని 47 స్థానాల్లో 30 చోట్ల ఘనవిజయం సాధించింది. కాగా, నవ భారతాన్ని నిర్మించడంలో సూచనలు అందజేయాలని ఐటీ నిపుణులను మోదీ కోరారు.  

మరిన్ని వార్తలు